Site icon NTV Telugu

Congress : మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండలోనూ వర్గపోరే!

Congress Rachabanda

Congress Rachabanda

తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రచ్చబండ.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్ నేతలు మధ్య ఉన్న పాత విభేదాలను బయటపెట్టింది. సంగారెడ్డి జిల్లాలో రచ్చబండ కేవలం రెండు నియోజకవర్గాల్లోనే కొనసాగుతుంది. రెండు చోట్లా పోటా పోటీగా ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండువర్గాలుగా విడిపోయింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి నాయకత్వంలో ఓ వర్గం, పార్టీ నాయకుడు నరోత్తమ్ ఆధ్వర్యంలో మరోవర్గం ఎవరికి వారే రచ్చబండ నిర్వహిస్తోంది. ఒకవర్గం నిర్వహించే కార్యక్రమాలకు మరోవర్గం హాజరవడం లేదు.

నారాయణఖేడ్‌లో పీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి రచ్చబండ నిర్వహిస్తుంటే.. మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ దూరంగా ఉన్నారట. ఇద్దరి మధ్య గ్యాప్‌ రావడం వల్లే మాజీ ఎంపీ దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువ. అక్కడ రైతులు లేరనే కారణంతో రచ్చబండ నిర్వహించడం లేదట. గుమ్మడిదల మండల కేంద్రంలో మాత్రం రచ్చబండ నిర్వహించగా, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ కుమార్, అసెంబ్లీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మిగిలిన మండలాల్లో రైతులు ఉన్నా రచ్చబండను లైట్‌ తీసుకున్నారు నేతలు.

ఆందోల్‌ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రచ్చబండపై ఊగిసలాటలో ఉన్నారు. హైదారాబాద్‌లో ఉంటూ నియోజకవర్గంలో కార్యకర్తల వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరవడం తప్ప పార్టీ బలోపేతం కోసం ప్రయత్నించడం లేదని రాజనర్సింహ వైఖరిపై కేడర్‌ గుర్రుగా ఉందట. సంగారెడ్డి ఎమ్మెల్యే.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం రచ్చబండకు బదులుగా జనంలోకి వెళ్లేలా ప్రోగ్రామ్‌ ప్రకటించుకున్నారు. ఈ నెల 21 వరకు డేట్ ఫిక్స్ చేశారు కూడా. కానీ ఆ కార్యక్రమం వాయిదా పడింది. మళ్లి ఎప్పడు నిర్వహించేదీ చెప్పడం లేదు.

మొత్తానికి ఉమ్మడి జిల్లాలో బలమైన కాంగ్రెస్‌ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ కార్యక్రమం మాత్రం చడీ చప్పుడు లేదు. కొన్ని చోట్ల చేస్తారు.. మరికొన్ని చోట్ల అడ్రస్‌ లేకుండా ఉంటున్నారు. మరి.. జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతానికి పీసీసీ పెద్దలు చొరవ తీసుకుంటారో లేక స్థానిక నేతలకే అప్పగించి ప్రేక్షకపాత్ర పోషిస్తారో చూడాలి.

Exit mobile version