NTV Telugu Site icon

Telangana Politics : ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?

Kommati Rajagopal Reddy

Kommati Rajagopal Reddy

Congress MLA Komatireddy Rajagopal Reddy’s political future has been clarified ?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీ వచ్చినట్టేనా? కాంగ్రెస్‌ కండువా తీసేసి.. కాషాయ కండువా వేసుకోబోతున్నారా? కేడర్‌తో సమావేశాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తారా..లేదా? ముహూర్తం ఎప్పుడు? లెట్స్‌ వాచ్‌..!

స్వపక్షంలో విపక్షంగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగొపాల్ రెడ్డి.. గత కొన్నేళ్లుగా పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతారని టాక్‌. ఆ ప్రయత్నంలో భాగంగానే ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారట. కాకపోతే ఆ సమావేశాన్ని చివరి క్షణంలో ఎందుకు వాయిదా వేసుకున్నారనే చర్చ మునుగోడులో జోరందుకుంది. అనారోగ్యం వల్ల వాయిదా వేసినట్టు చెబుతున్నా.. ఇంకేదో బలమైన కారణం ఉందని అనుమానిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను ఎప్పుడు వీడతారు? రాజకీయ భవిష్యత్‌పై ఎప్పుడు స్పష్టత ఇస్తారో అనే ఉత్కంఠ మళ్లీ పెరిగింది.
గతంలో పలుమార్లు బీజేపీకి అనుకూలంగా ప్రకటన చేసినా.. ధైర్యంగా అడుగు వేసింది లేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నదీ లేదు. రాహుల్‌ గాంధీ పర్యటనకు.. మీటింగ్‌కు దూరంగా ఉన్నారు. దాంతో రాజగోపాల్‌రెడ్డి జంప్‌ చేయడానికే నిర్ణయించుకున్నారని చర్చ సాగుతోంది. ఇంతలో మునుగోడులో జరిగిన ఒక కార్యక్రమంలో తాను కాంగ్రెస్‌ను వీడేది లేదని చెప్పి ఆశ్చర్యపరిచారు రాజగోపాల్‌రెడ్డి. ఆయన మనసు మార్చుకున్నారని అనుకున్నంతలోనే.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షాతో రాజగోపాల్‌రెడ్డి సమావేశం అయ్యారని.. ప్రచారం గుప్పుమంది. ఆ తర్వాతే మునుగోడులో ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేయడంతో ఏదో కీలక ప్రకటన ఉంటుందని అనుకున్నారు. బీజేపీలో ఎప్పుడు చేరేదో వెల్లడిస్తారని భావించారంతా. కానీ అదేమీ జరగలేదు.

ప్రస్తుతం మునుగోడులో కాంగ్రెస్‌ రెండుగా చీలిపోయింది. రాజగోపాల్‌రెడ్డి తీరుపై ఒక వర్గం కన్నెర్ర చేస్తోందట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే బీజేపీలోకి వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నారట. ఆ కామెంట్స్‌ చెవిన పడిన తర్వాత రాజగోపాల్‌రెడ్డి కొంత షాక్‌ అయ్యారట. ఆయన ఏర్పాటు చేసే సమావేశానికి వెళ్లి ఇదే అంశంపై నిలదీయాలని చూశారట. దాంతో సమావేశం రచ్చ రచ్చ అవుతుందని సందేహించి.. హడావిడిగా మీటింగ్‌ను రద్దు చేశారని అభిప్రాయ పడుతున్నారు. గతంలో రాజీనామాపై రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటనను ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే ఉపఎన్నికలు జరిగితే అన్నీ నియోజకవర్గాలు హుజురాబాద్‌లా ఉండబోవని.. కాంగ్రెస్‌ కేడర్‌ సవాల్‌ చేస్తోందట.

మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తరఫున బరిలో ఉంటే.. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తారా అనేది కొందరి ప్రశ్న. కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ జీవితం ఎవరిది వారిదే అయినప్పటికీ.. కాంగ్రెస్‌ కేడర్‌ మాత్రం వారిని వేర్వేరుగా చూడటం లేదట. రాజగోపాల్‌రెడ్డి తీసుకునే నిర్ణయం.. వెంకటరెడ్డిపై కూడా పడుతుందని అభిప్రాయ పడుతున్నారు. వన్స్‌ రాజగోపాల్‌రెడ్డి జంప్‌ అయితే.. ఆయనపై కత్తులు దూసేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరి.. ఈ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఏం చేస్తారో.. ఎప్పుడు కండువా మారుస్తారో చూడాలి.