Site icon NTV Telugu

తెలంగాణ పౌరసరఫరాల శాఖలో పవర్‌ ఫైట్‌..!

మంత్రి అవునంటే.. కార్పొరేషన్ ఛైర్మన్‌ కాదంటారు. ఛైర్మన్‌ ఓకే చెబితే.. మంత్రి నో అంటారు. ఇద్దరి మధ్య నెలకొన్న పవర్‌ ఫైట్‌ వల్ల కొన్నాళ్లుగా కీలక నిర్ణయాల్లేవ్‌. అన్నీ సమస్యలే. ఇంతకీ ఎవరువారు? ఏంటా విభాగం? లెట్స్‌ వాచ్‌..!

కలిసి సమీక్షల్లేవ్‌.. కీలక నిర్ణయాలు లేవు..!

గంగుల కమలాకర్‌. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి. మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌. ఇద్దరి మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. ఒకరు ఎడ్డెమంటే.. ఇంకొకరు తెడ్డెమనే పరిస్థితి. దీంతో పౌరసరఫరాల విభాగంలో ఉన్నతాధికారుల నుంచి.. జిల్లా అధికారుల వరకు నిర్ణయాలు తీసుకోవడంలో అంతులేని జాప్యం. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కడివక్కడే పేరుకుపోతున్నాయి. ధాన్యం కొనుగోలుపై మంత్రి, కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఇద్దరు కలిసి సమీక్ష చేసిన దాఖాలాలు లేవు. కొన్ని సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల్లోనూ స్పష్టత కరువై అధికారులు తికమక పడే పరిస్థితి.

మంత్రి, ఛైర్మన్‌ కోల్డ్‌వార్‌తో అతీగతీ లేని రేషన్‌డీలర్ల కమీషన్‌ పెంపు..!

యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యంలో కోట్ల రూపాయల గోల్‌మాల్‌ జరిగిందని రైతులు వినతిపత్రాలు సమర్పించారు. ధర్నాలు చేశారు. అయినప్పటికీ ఆరోపణలు వచ్చిన మిల్లులపై చర్యల్లేవ్‌. కొన్నిచోట్ల బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న మిల్లులకూ ధాన్యం వెళ్లడం అనుమానాలకు తావిచ్చింది. మంత్రి గంగుల, ఛైర్మన్‌ మారెడ్డి మధ్య సఖ్యత లేకపోవడంతో మిల్లర్లు దానిని క్యాష్‌ చేసుకున్నారని ఓపెన్‌ టాక్‌. ఆరోపణలు వచ్చిన మిల్లర్లపై చర్యలకు అధికారులు వెనకాడటానికి కూడా మంత్రి, ఛైర్మన్‌ మధ్య గొడవలే కారణమట. రేషన్‌ డీలర్ల కమీషన్‌ పెంచుతామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. అదీ అతీగతీ లేకపోవడానికి మంత్రి, ఛైర్మన్‌ కోల్డ్‌వారేనని చెబుతున్నారు.

దీపం ఉండగానే ఇల్లుచక్కబెట్టుకునే పనిలో ఉన్నారా?

ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం బ్యాంకు నుంచి విడుదల చేస్తున్న నిధుల వినియోగం.. తర్వాత వాటిని తీర్చే క్రమంలో చూపిస్తున్న వడ్డీలే మంత్రి, ఛైర్మన్‌ మధ్య గ్యాప్‌ రావడానికి కారణంగా తెలుస్తోంది. సివిల్‌ సప్లయిస్‌లో కొనుగోలు తప్ప.. మిగతా అంశాల్లో మారెడ్డికి పెద్దగా పరిమితులు లేవు. కాకపోతే అంతా తానై నడిపించడంతో ఇద్దరి మధ్య పొరపచ్చాలకు దారితీసిందట. గన్నీ సంచుల సేకరణలో డబ్బుల పంపిణీపై భిన్నస్వరాలు వినిపించడం మంత్రికి నచ్చ లేదట. యాసంగి ధాన్యం కొనుగోలు తర్వాత రైతుల ఖాతాల్లో జమయ్యే నగదు కొందరు కనుసన్నల్లో జరిగిందట. అందుకే మిల్లర్లపై చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిధుల విడుదల, 2016-17లో కందుల కొనుగోలు, మిల్లుల కేటాయింపు, కందుల పంపిణీలో అనుమానాలు ఉన్నాయట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారని పౌరసరఫరాల వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

సమస్యలు వస్తే ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియడం లేదా?

వచ్చే ఏడాది సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాసరెడ్డి పదవీకాలం ముగియనుంది. ఆలోగానే స్వామి కార్యాలు, స్వకార్యాలు ముగించుకునే పనిలో మారెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు. సమస్యలు వస్తే మంత్రి దగ్గరకి వెళ్లాలో.. ఛైర్మన్‌ను ఆశ్రయించాలో తేల్చుకోలేకపోతున్నారట రేషన్‌ డీలర్లు.. అధికారులు. కొత్త రేషన్‌కార్డుల జారీలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చినా చర్యల్లేవ్‌. మరి.. మంత్రి, ఛైర్మన్‌ల మధ్య కోల్డ్‌వార్‌ ఇంకేస్థాయికి వెళ్తుందో.. ఇంకెంత రచ్చ రచ్చ అవుతుందో చూడాలి.

Exit mobile version