ఎమ్మెల్యే కోటాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎంపిక చేసే ఆ ఆరుగురు ఎమ్మెల్సీలు ఏవిట్లు? ఆరు సీట్లలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయి? పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. చట్టసభల్లో కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తామని గతంలో సీఎం కేసీఆర్ మాటిచ్చారు. మరి ఇప్పుడా మాట ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా? లేదా? అనే ఉత్కంఠ మొదలైంది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. శాసనమండలికి ఎన్నిక కాబోతున్న ఆరుగురు ఎమ్మెల్సీలు ఎవరు? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 16 వరకు నామినేషన్లకు గడువు ఉంది. అసంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఆరింటికి ఆరు స్థానాలు అధికారపార్టీకే దక్కుతాయి. అయితే పార్టీ అధినేత ఎంపిక చేయబోయే ఆ ఆరుగురు ఎమ్మెల్సీలు ఎవరు? ఏఏ సామాజిక వర్గాలకు చెందిన వారన్నదానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే పార్టీలో లాబీయింగ్ మొదలైంది. అధినేత దృష్టికి తమ పేర్లు వెళ్లేలా ఆశావహులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకు అధినేత ఫైనల్ చేసే లిస్టులో తమ పేరు ఉండేలా చూసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. ఎవరెవరి పేర్లు ఫైనల్ లిస్టులో ఉంటాయి? ఆరింటిలో ఏఏ సామాజిక వర్గాలకు ఎన్నిసీట్లు ఇస్తారన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన రానేలేదు.
అయితే! పార్టీలో మాత్రం ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీసీల నుంచి ముగ్గురికి, ఎస్సీల నుంచి ఒకరికి, ఓసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం ఉంటుదనే సమాచారం ఉంది. భవిష్యత్ రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణలు, జిల్లాలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే వీలుంది. చట్ట సభల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం అవసరం ఉందని గతంలోనే చెప్పారు సీఎం కేసీఆర్. అందుకు తగ్గట్టుగానే విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, నాయి బ్రాహ్మణతో పాటు మరో బీసీ సామాజిక వర్గం నుంచి ఈ ముగ్గురిని ఎంపిక చేస్తారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.
ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆ ఒక్కరు ఎవరు? ఓసీల్లో అవకాశం దక్కుతుందన్నది ఇంకా తేలాల్సి ఉంది. నామినేషన్లు వేసేందుకు వచ్చే పదహారో తేదీ వరకు అవకాశం ఉంటంతో ఈలోపు కసరత్తు పూర్తి చేసి అభ్యర్థులను ఫైనల్ చేయనుంది అధిష్టానం.
