Site icon NTV Telugu

కడియం శ్రీహరి ఇంట్లో సీఎం కేసీఆర్‌ విందు.. దేనికి సంకేతం?

సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనలో లంచ్ వేదిక మార్పు వెనక కథేంటి? సీఎం ఇచ్చిన సంకేతాలు వెళ్లాల్సిన వారి చెంతకు వెళ్లాయా? ఓరుగల్లు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన అంశాలేంటి?

కడియం శ్రీహరి ఇంట్లో సీఎం కేసీఆర్‌ విందు!

సీఎం కేసీఆర్‍ వరంగల్‍ టూర్‍ అనగానే గుర్తొచ్చేది రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసం. 20 ఏళ్ల క్రితం ఉద్యమ సమయంలోను.. ఇప్పుడు సీఎం హోదాలో వరంగల్‌ వస్తే హంటర్‌ రోడ్డులోని కెప్టెన్‌ ఇంట్లో కేసీఆర్‌ దిగాల్సిందే. లంచైనా.. డిన్నరైనా.. చివరకు ఒకరోజు బస చేయాలంటే అక్కడే ఉండేవారు. గత నెలలో MGM సందర్శించినప్పుడు కూడా కెప్టెన్‌ ఇంట్లోనే ఉన్నారు. అలాంటిది ఈసారి వరంగల్ పర్యటనలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంట్లో లంచ్‍ చేశారు ముఖ్యమంత్రి. కొంతకాలంగా కడియం శ్రీహరికి పార్టీలో ప్రాధాన్యం తగ్గించారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగిసింది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌.. సడెన్‌గా కడియం ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం పెరిగింది. కొత్త చర్చకు ఈ టూర్ తెరలేపింది.

కడియం ఇంట్లో విందు వెనక మర్మం ఏదైనా ఉందా?

ఈ విందు వెనక మర్మం ఏమై ఉంటుంది? రాజకీయంగా ఏమైనా మార్పులు జరుగుతాయా? అని పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. కడియం శ్రీహరిని మరోసారి ఎమ్మెల్సీని చేస్తారా? అలాగే హుజురాబాద్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కెప్టెన్‌ కుటుంబానికి పరోక్ష సంకేతాలు ఏమైనా ఇచ్చారా అన్నది ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ కేడర్‌లోనే కాదు.. ఏ ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసినా ఇదే చర్చ సాగుతోందట.

read also : చంద్రబాబును, లోకేష్‌ను తిట్టిపోస్తున్న మంత్రి కొడాలి!

కడియం శ్రీహరిపై బీజేపీ ఫోకస్‌ పెట్టినట్టు ప్రచారం!

తెలంగాణలో కడియం శ్రీహరి రెండో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అధినేత తర్వాత అంతటి స్థానాన్ని అనుభవించారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కడియానికి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఆయన్ని సీఎం దూరం పెట్టారని ప్రచారం సాగింది. ఒకప్పడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలను శాసించిన కడియం ప్రస్తుతం ఆదరణ లేక, రాజకీయాల్లో ఉన్నారో లేరో అన్నట్టుగా సైలెంట్‌ అయ్యారు. మళ్లీ ఎమ్మెల్సీ డౌట్‌ అన్నవారూ ఉన్నారు. ఇదే సమయంలో రాజకీయ భవిష్యత్ కోసం కడియం పక్కపార్టీ వైపు కన్నేశారని ప్రచారం జరిగింది. కుమార్తెను రాజకీయాల్లో దించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ.. బీజేపీ ఆయనపై ఫోకస్‌ పెట్టినట్టు చెబుతున్నారు.

మనసులోని మాటను సీఎం కేసీఆర్‌ చెవిలో వేసిన కడియం!

ఈ తరహా ప్రచారాల మధ్య సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా కడియం ఇంటికి విందుకు రావడంతో సీన్‌ మారిపోయింది. మాజీ డిప్యూటీ సీఎంకు మళ్లీ ప్రాధాన్యం లభిస్తుందా? ఎమ్మెల్సీగా మళ్లీ అవకాశం ఇస్తారా? అని ఆరా తీస్తున్నారు. పదవిపై ఆశలు పెట్టుకున్న కడియం శ్రీహరి.. విందు పేరుతో ముఖ్యమంత్రిని ఇంటికి తీసుకెళ్లి.. తన మనసులో మాటను కేసీఆర్‌ చెవిలో వేశారని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ విందు ద్వారా కడియం పక్కచూపులు చూడకుండా సీఎం కేసీఆర్‌ చెక్‌ పెట్టారని వైరిపక్షాలు అభిప్రాయపడుతున్నాయట. మరి.. ఈ విందు రాజకీయం టీఆర్‌ఎస్‌లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Exit mobile version