NTV Telugu Site icon

Off The Record: చోడవరంపైనే ఫోకస్.. పీఠం కదిలేనా?

Shock

Shock

అధికారపార్టీలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. కన్నీళ్లు పెట్టుకోవడంతో హైకమాండ్ కరుణించింది. ఒకేసారి పార్టీ, ప్రభుత్వ పదవులు ఇచ్చి శాంతింపజేసింది. ఇప్పుడో షాకింగ్ పరిణామం తెరపైకి వస్తోందట. ఇవాళో రేపో అధ్యక్ష పీఠం కదలడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరోసారి షాక్‌కు రెడీగా ఉన్న ఆ సీనియర్ శాసనసభ్యుడు ఎవరు?

మంత్రి పదవి రాలేదని కన్నీటి పర్యంతమైన ధర్మశ్రీ
కరణం ధర్మశ్రీ. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే. పొగడ్తైన, విమర్శైనా ప్రాస లేకుండా పాయింట్‌లోకి రారు. వేదిక ఏదైనా అధినేతకు విధేయత ప్రకటించడానికి ఎక్కువ తాపత్రయ పడతారు. కాపు కోటాలో కేబినెట్ బెర్త్ ఆశించినప్పటికీ భంగపాటు తప్పలేదు. తన సీనియారిటీని, విధేయతను హైకమాండ్ గుర్తించలేదని కన్నీటి పర్యంతం అయ్యారు ధర్మశ్రీ. ఎమ్మెల్యే ఆవేదనను గుర్తించిన అధిష్ఠానం ఒకేసారి డబుల్ ప్రమోషన్ ఇచ్చింది. ప్రభుత్వ విప్ పదవితోపాటు అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది. జోడు పదవుల సవారీ తెచ్చిన కిక్కుకంటే పార్టీలోనే ప్రత్యర్ధివర్గంపై అధికారం చేసే అవకాశం రావడం ధర్మశ్రీని ఫుల్ ఖుషీ చేసిందనే చర్చ అప్పట్లో జరిగింది. అందుకు తగ్గట్టే అట్టహాసంలో రాజీపడ్డం లేదు ఎమ్మెల్యే. పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఓ రేంజ్‌లో చేసిన ధర్మశ్రీ.. జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అగ్గిరాజేశారు ధర్మశ్రీ.

చోడవరంపైనే ఫోకస్‌ చేయమని చెబుతున్నారా?
రాజకీయంగా పైచేయి సాధించినట్టేనని.. జిల్లా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసే బాధ్యత తమ నేతదేనని ధర్మశ్రీ అనుచరగణం గట్టిగా నమ్మింది. కానీ.. ఆ హుషారు ఎక్కువ కాలం వుండబోదనేది తాజా చర్చ. కారణం అనకాపల్లి అధ్యక్ష పీఠంపై హైకమాండ్ పునరాలోచలో పడ్డమేనట. త్వరలోనే అనకాపల్లిజిల్లా అధ్యక్షుడు మార్పు అనివార్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు మొదలైందట. ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోడవరంలో కాపు ఫ్యాక్టర్ కీలకం. టీడీపీ అభ్యర్థిపై స్పష్టత లేకపోయినా క్షేత్రస్ధాయిలో బలం కనిపిస్తోంది. సమర్ధుడైన అభ్యర్ధి జనసేన నుంచి రంగంలోకి దిగితే ట్రయాంగిల్ ఫైట్ హోరాహోరీ కాక తప్పదు. అందుకే ఏమరపాటుగా ఉంటే నష్టం జరగొచ్చనే అంచనాలు లేకపోలేదు. ఆ కారణంగా ధర్మశ్రీని జిల్లా వైసీపీ బాధ్యతల నుంచి తప్పించి పూర్తి స్ధాయిలో నియోజకవర్గంపై ఫోకస్‍ పెట్టేలా డ్రయివ్ చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం.

సామాజికవర్గాల లెక్కల వడపోతలో పార్టీ
వైసీసీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని బీసీ సామాజికవర్గానికి కట్టబెట్టి.. ఆ వర్గాలకు ప్రాధాన్యం పెంచాలని వైసీపీ చూస్తోందట. ఈ క్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్లు ప్రస్తావనకు వచ్చినా హైకమాండ్ సుముఖత చూపలేదట. ఇటీవల బీసీ సభ తర్వాత అనకాపల్లి నాయకత్వం మార్పుపై చర్చ జరిగినట్టు భోగట్టా. అనేక ఈక్వేషన్లను వైసీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుకు ఇచ్చింది. పొరుగునే వున్న అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ మంత్రిగా వున్నారు.

ఈ లెక్కలను దగ్గర పెట్టుకునే పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి వున్నప్పటికీ టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేని నాయకుడికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారట. గవర, వెలమ సామాజికవర్గాలకు చెందిన నాయకత్వం కోసం వడపోత పోస్తుండగా.. ఒకటి రెండు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేటి ప్రసాద్, కోటపాడు జడ్పీటీసీ అనురాధ పేర్లు వినిపిస్తున్నాయి. అనూరాధ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు కుమార్తె కాగా బొడ్డేటి ప్రసాద్ మంత్రి అమర్నాథ్‌కు ముఖ్య అనుచరుడు. వీరిద్దరు అవకాశం వస్తే ఎమ్మెల్యేలుగా పోటీకి సిద్ధమనే స్ధాయిలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ధర్మశ్రీ మానసికంగా సిద్ధం అయ్యారా?
పదవి చేజారుతున్న అంశాన్ని చూచాయగా గ్రహించిన కరణం ధర్మశ్రీ సైతం మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. చేతిలో ప్రభుత్వ విప్‌ పదవి ఉండటం.. ఈ సమయంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఎమ్మెల్యే పదవికి కూడా ఎసరు వస్తుందనే అభిప్రాయంలో ధర్మశ్రీ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ధర్మశ్రీ ప్లేస్‌లో పార్టీ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేదే ప్రశ్న.