NTV Telugu Site icon

Off The Record: పొరుగు రాష్ట్రాలపై బీఆర్ఎస్ ఫోకస్

Maxresdefault (5)

Maxresdefault (5)

పొరుగు రాష్ట్రాలపై BRS ఫోకస్..సరిహద్దుల్లోని ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలు| OTR | Ntv

సరిహద్దు జిల్లాల్లోని అధికారపార్టీ ఎమ్మెల్యేలకు కొత్త కష్టం వచ్చిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పొరుగు రాష్ట్రాల్లోని నేతలకు గాలంవేసే పని కూడా వారిపైనే పెట్టారా? సొంత నియోజకవర్గంలో పరిస్థితులు చక్కదిద్దుకోలేక.. అధిష్ఠానం అప్పగించిన టాస్క్‌ పూర్తి చేయలేక.. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న ఎమ్మెల్యేలు ఎవరు?

పొరుగు రాష్ట్రాలపై బీఆర్ఎస్‌ ఫోకస్‌
దేశవ్యాప్తంగా BRS విస్తరణకు కసరత్తు మొదలైంది. సంక్రాంతి తర్వాత వీలైనన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు మొదలు పెట్టే దిశగా అడుగులు వేస్తోంది పార్టీ. ఏపీలో బీఆర్‌ఎస్‌ సారథి ప్రకటనతో ముందడుగు పడింది. ఇదే క్రమంలో మిగతా పొరుగు రాష్ట్రాల్లోనూ పని మొదలుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో పార్టీ విస్తరింప చేయడంతోపాటు కర్నాటక, మహారాష్ట్రల్లోనూ జెండాను రెపరెపలాడించాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో అధిష్ఠానం స్థాయిలో కొంత కసరత్తు జరుగుతున్నా.. ఆయా రాష్ట్రంల్లో బలమైన నేతలను పికప్‌ చేయడం పెద్ద సవాల్‌గా మారింది. ఈ సమస్యను ఈజీగా అధిగమించేందుకు మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారట.

ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పర్యటన
తెలంగాణలోని సరిహద్దు జిల్లాల నేతలకు.. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీలోని బోర్డర్‌ ప్రాంతాల్లోని నాయకులతో పరిచయాలు ఉన్నాయి. పైగా తెలంగాణలో పథకాలు.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా చర్చలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. తమను తెలంగాణలో కలిపేయాలని గతంలో కొన్ని సరిహద్దు గ్రామాల ప్రజలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాల్లోని కీలక నేతలకు గాలం వేస్తే క్రమంగా పొరుగు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ పుంజుకోవచ్చని చూస్తున్నారు. ఈ మిషన్‌లో భాగంగా కొందరు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర, కర్నాటకల్లో పర్యటనలు మొదలుపెట్టేశారు. ఏపీలో సంక్రాంతికి ఎలాగూ గులాబీ నేతలు కోడిపందేలకు వెళ్తారు. ఆ సమయంలో మాటలు కలిపితే చాలా మంది ఆకర్షితులు కావొచ్చని అనుకుంటున్నారు. ఈ దఫా సంక్రాంతికి పెద్ద సంఖ్యలోనే గులాబీ నేతలు ఏపీకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయట.

సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్‌ టూర్‌
సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్‌ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఆలోగా కొంత గ్రౌండ్ వర్క్‌ చేసే పనిలో ఎమ్మెల్యేలు పడ్డారట. బలమైన నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు ఇలా వివిధ రంగాల్లో పేరు తెచ్చుకున్నవారిని ఆకర్షించే పనిలో ఉన్నారట. మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలకు కర్నాటక, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లా నేతలకు మహారాష్ట్ర, ఖమ్మం నేతలకు ఏపీ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా.. తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సొంత నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించకపోతే తేడా కొడుతుందని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట. రెండు పడవలపై కాలేస్తే.. మొదటికే మోసం రాదు కదా అని మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. అధిష్ఠానం అప్పగించిన పనిలో సక్సెస్‌ కాలేకపోతే తమ గ్రాఫ్‌ పడిపోతుందని.. అలా అని ఈ సమయంలో ఎక్కువ టైమ్‌ సొంత నియోజకవర్గానికి కేటాయించకపోతే ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారట.

రానున్న రోజుల్లో చిక్కులు ఎదురవుతాయని కలవరం
రానున్న రోజుల్లో ఈ పర్యటనల స్పీడ్‌ పెరిగితే.. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎదురయ్యే చిక్కులు తలుచుకుని కలవర పడుతున్నారట ఎమ్మెల్యేలు. ఇప్పటికే నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, బీజేపీ కార్యక్రమాల వేగం పెరిగింది. విపక్షాలను దృష్టిలో పెట్టుకునైనా అప్రమత్తంగా లేకపోతే ఎలా అని అనుచరుల దగ్గర ఆవేదన చెందుతున్నారట. మొత్తానికి పొరుగు రాష్ట్రాలో ఎంత మంది బీఆర్‌ఎస్ గేలానికి చిక్కుతారో కానీ.. సరిహద్దు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు మాత్రం ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల్లాడుతున్నారు.