ఎన్నికలు డబ్బుమయంగా మారాయనేది పాత మాటే.పంచాయతీ ఎన్నికలకే కోట్లు పెట్టే చోట, అసెంబ్లీకి ఎంత ఖర్చవుతుందో ఊహకు కూడా అందని పరిస్థితి. అయితే భారీ హైప్ వచ్చిన హుజూరాబాద్ ప్రచారం జరిగిన తీరు…. బిజెపి నేతల్ని కంగారు పెడుతుందట. ఈ స్థాయిలో ఖర్చు చేయాలంటే కష్టమే అనుకుంటున్నారట.
హుజూరాబాద్ ఎన్నికల ల్లో డబ్బుల ప్రవాహాన్ని చూసిన బీజేపీ నేతలు ఖంగుతింటున్నారు… ఇదేం ఖర్చు , ఇన్ని పైసలు ఎక్కడి నుండి తేవాలి.. రేపు పోటీ చేసే అవకాశం వస్తే మా పరిస్థితి ఏంటి… తట్టుకోగలమా అని హడలిపోతున్నారట. హుజూరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీనే కాదు బీజేపీ కూడ ఖర్చు పెట్టింది. పోటా పోటీగా సభలు నిర్వహించింది. ప్రచారం చేసింది. రెండు పార్టీలు ఇక్కడ అంచనాలకు మించే ఖర్చు చేశారనే టాక్ ఉంది. అధికార పార్టీ కాస్త ఎక్కువ సమర్పించుకుంటే, కాషాయం పార్టీ కాస్త తక్కువ సమర్పించుకుని ఉండొచ్చు. మొత్తానికి ఈ ఎన్నికతో రెండు పార్టీ లకు ఖర్చు తడిసి మోపెడు అయింది.
హుజూరాబాద్ ప్రచారానికి ఇతర జిల్లాల బీజేపీ నేతలు కూడా వెళ్లారు… కొన్ని రోజుల పాటు అక్కడే బస చేసి క్యాంపెయిన్ చేశారు… బయట నుండి వచ్చిన కార్యకర్తలకు, నేతలకు మంచి ఏర్పాట్లు చేసారట. ఎక్కడ ఎన్నికలు ఉన్నా, అక్కడికి వెళ్లి ప్రచారం చేయడం బీజేపీ నేతలకు, కార్యకర్తలకు అలవాటు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సర్దుకు పోతారు కూడా. అయితే ఈసారి ప్రచారానికి వెళ్లిన నేతలు తమకు ఏర్పాటు చేసిన వసతులను చూసి ఆశ్చర్యపడ్డారట… ఏమిటీ ఏర్పాట్ల అని చర్చించుకున్నారట. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ట్రీట్మెంట్ చూడలేదనుకున్నారట
ఇంతవరకు బాగానే ఉంది.. ఖర్చు చేసినా, ఫలితం కాషాయం పార్టీకే అనుకూలంగా వచ్చింది కాబట్టి కాస్త ఊరటగానే ఉంది. కానీ, ఈ హాడావుడి అంతా చూసిన తరువాత కొందరు నేతల్లో భయం మొదలు అయిందట.రేపు తమకు సీటు వస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారట.కార్యకర్తలు , నేతల ఆకామడేషన్ కోసం ఇంత ఖర్చు పెడితే…ఇక ఎన్నికల్లో కొట్లాడడానికి ఎంత ఖర్చు పెట్టాల అని వర్రీ అవుతున్నారట.
హుజూరాబాద్ లో చేసిన ఏర్పాట్లు తమ దగ్గర కూడా చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని ఇతర నేతలు అంటున్నారట.హుజూరాబాద్ నుండి పోటీ చేసిన ఈటల దగ్గర అర్థ బలం ఉంది కాబట్టి చేయగలిగారు… పార్టీ సిస్టమ్ కి కొత్త కాబట్టి ఆ విధమైన ఏర్పాట్లు చేసారు.దీన్ని కొనసాగించాలంటే కష్టమని చెప్పుకుంటున్నారట. ఒక విధంగా ఆయన కమలం పార్టీకి లేని కొత్త అలవాటు నేర్పినట్టే అనే టాక్ నడుస్తోంది.
