ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం ఒక్క వెలుగు వెలిగింది. భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత ఆళ్లగడ్డలో ఆ కుటుంబానికి పట్టు సడలింది. భూమా అఖిల నిత్యం ప్రత్యర్థులతోపాటు.. ఒకప్పటి సన్నిహితులతోను, సొంత బంధువులతోను పోరాడాల్సి వస్తోంది. ఒకవైపు కేసులు, మరోవైపు రాజకీయ వివాదాలు, పెదనాన్న కుమారుడు భూమా కిశోర్ రెడ్డితో తగాదాలు… వెరసి జనం సమస్యల కంటే సొంత సమస్యలే ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆమె దృష్టంతా వాటిపైనే పెట్టాల్సి వస్తోందట. ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు జనంలోకి వచ్చినా ఎక్కువ సమయం వివాదాలు, తగాదాలు, కేసులతో ఆమెకు సరిపోతోంది. వివిధ కారణాలతో ఒకప్పుడు భూమా నాగిరెడ్డి కుటుంబానికి సన్నిహితంగా, అండగా ఉన్న బంధువులు, అనుచరులు అఖిలప్రియకు దూరమయ్యారట.
ఇలాగే వదిలేస్తే మొదటికే మోసం వస్తుందనుకున్నారో.. ఏమో సొంత సమస్యల నుంచి బయటపడ్డా పడకున్నా ఫీల్డ్‌లో పట్టుకాపాడుకోవడానికి రెడీ అవుతున్నారట అఖిలప్రియ. ఆళ్లగడ్డలో సడలిన పట్టు తిరిగి సాధించేందుకు పాదయాత్రను ఆయుధంగా చేసుకుంటారట. ఈ నెల 18 నుంచి జనంలోకి వెళ్తున్నట్టు చెబుతున్నారు. . గ్రామాల్లో తిరుగుతూ జనంతో మమేకమై వాళ్ల సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారట. గతంలో తన తల్లి భూమా శోభ ఏ ఊరికి వెళ్లినా పేరు పేరునా పలకరిస్తూ తనదైన శైలిలో వారి అభిమానం పొందారు. అదే తరహాలో అఖిల ప్లాన్ చేస్తున్నారట. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఆ సమయానికి పూర్తిస్థాయిలో ఫామ్‌లోకి రావాలన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. కనీసం 6 నెలలపాటు పాదయాత్ర ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.
వాస్తవంగా ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఒంటరయ్యారు. నాగిరెడ్డి మృతి చెందిన కొన్నాళ్లేకే తన తండ్రికి అత్యంత సన్నిహితుడిగా ఉంటే AV సుబ్బారెడ్డితో విభేదాలు వచ్చాయి. అందులో ప్రధానంగా ఆర్థికపరమైన విభేదాలే. చివరకు ఏవీ సుబ్బారెడ్డి హత్యకు అఖిల సుపారీ ఇచ్చిన వ్యవహారం బయటపడటంతో వారి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఇక భూమా అఖిల పెదనాన్న కుమారుడు భూమా కిశోర్‌రెడ్డి ప్రస్తుతం ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నాగారెడ్డి దంపతుల విగ్రహాలను కిశోర్‌రెడ్డి తన స్థలంలో ఏర్పాటు చేసి ఆవిష్కరణకు సిద్ధం చేసుకోగా.. కొద్ది నిమిషాల ముందు అఖిల వాటిని ఆవిష్కరించారు. మరోవైపు.. బీజేపీలో ఉంటూనే ఆళ్లగడ్డలో తన పెదనాన్న కుమారుడే తనకు చెక్ పెడుతుండటం అఖిలకు ఊపిరాడకుండా చేస్తోందట. టీడీపీ టికెట్ తనకే వస్తుందని భూమా కిశోర్‌రెడ్డి చెప్పుకొంటున్నట్టుగా స్వయంగా అఖిల తెలిపారు.
భూమా అఖిల మరో పెదనాన్న కుమారుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితోనూ మంచి సంబంధాలు లేవట. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మాటలు కూడా లేనట్టు చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి దంపతుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు గతంలోలా కలసి నిర్వహించడం లేదట. ఇక వైసీపీ నేతలతో రాజకీయపరమైన విబేధాలు సరేసరి.. అందుకే భూమా అఖిల జనంబాట పట్టాలని నిర్ణయించారట. మరి..ఈ నిర్ణయం ఆమెకు ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.