NTV Telugu Site icon

Kiran Kumar Reddy : అయన అభిమానుల్లో ఆశలు చిగురించాయా.? ఈ సారైనా క్లారిటీ ఇస్తారా.?

Kiran

Kiran

మాజీ సీఎం నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి పొలిటికల్‌ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా మారారు. వాయల్పాడు, పీలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2004-2014లోపల చీఫ్‌విప్‌, స్పీకర్‌, ఉమ్మడి ఏపీకి చిట్టచివరి సీఎంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి దెబ్బతిన్నాక అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించిన సభకు మాత్రమే అలా వచ్చి వెళ్లిన కిరణ్ కూమార్ రెడ్డి కీలకమైన ఎన్నికల సమయంలో కనిపించలేదు. ఆపై ఆయన చిరునామా ఎవరికీ తెలియలేదు. కాంగ్రెస్‌లో చేరడమైతే చేరారు కానీ.. పొలిటికల్‌గా మాత్రం యాక్టివ్‌గా లేరు. రఘువీరారెడ్డి ఏపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో.. కొత్త సారథి కిరణ్ కుమార్‌రెడ్డి అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అవన్నీ రూమర్స్ అనేలా బాధ్యతలు స్వీకరించారు మాజీ మంత్రి శైలజానాథ్‌.

కాంగ్రెస్‌లో ఫుల్‌ స్పీడ్‌తో పని చేస్తారని అనుకుంటే ఇలా చేరడం.. అలా సైలెంట్‌ అయిపోవడంతో ఆయన వ్యూహం ఏంటో ఎవరికీ అంతు చిక్కలేదు. మళ్లీ వస్తారా.. రారా లేక.. ఇక శాశ్వతంగా రాజకీయాల్లో రిటైర్మెంట్‌ ప్రకటిస్తారా అనే చర్చలు జరుగుతున్న తరుణంలో ఢిల్లీలో ఒక్కసారిగా మెరిశారు ఈ లాస్ట్ బాల్ బ్యాట్సమెన్‌. దీంతో ఆయన అనుచరులు, అభిమానులో మరోసారి ఆశలు చిగురించాయి. గత రెండు, మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారారు కిరణ్‌కుమార్‌రెడ్డి.

ఏపీసీసీ చీఫ్‌ పదవి ఆయనే అని కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరులు సోషల్‌ మీడియాలో అనుకూలంగా పోస్టులు పెట్టేశారు. అయితే.. అవన్నీ ఫేక్‌ వార్తలే అని.. కేవలం పార్టీలో సీనియర్ నేతలను ఢిల్లీకి రమ్మంటే వెళ్లారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ చేపట్టే పాదయాత్ర, పీసీసీ చీఫ్‌ నియామకంపై చర్చించే అవకాశమే లేదన్నది కొందరు సీనియర్ల వాదన. పైగా ఢిల్లీలో సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. మాజీ సీఎం సన్నిహితులు సైతం ఆయన రాజకీయంగా ఎలా ముందుకెళ్తారు అనేది చెప్పలేకపోతున్నారట.

వాస్తవంగా కిరణ్‌ కుమార్‌రెడ్డిని టైట్‌ లిప్‌ అంటారు. ఎడమ చేత్తో చేసేదాన్ని కుడి చేతికి కూడా తెలియకుండా చేయడం ఆయన స్టయిల్‌. అలాగే ఆయన సీఎం అయ్యారు కూడా. ఇప్పుడు ఢిల్లీ టూర్‌ వెనక అలాంటిదేదో పెద్ద ప్లాన్‌ ఉండి ఉండొచ్చని అంటున్నారు. ఆయన ఎందుకు వెళ్లారు.. ఎందుకు ఉంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. ఢిల్లీలో అడుగు పెట్టిన రోజున సొంత పనులు మీద వచ్చానని చెప్పిన కిరణ్‌ తర్వాత అధినేత అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తూ కనిపించారు. APలో జీవం లేనిపార్టీని లేపడం ఎవరి వల్లా కాదు. ఒకవేళ కిరణ్‌ దగ్గర అలాంటి ప్లాన్స్‌ ఏవైనా ఉన్నాయా లేక AICCలో చేరి జాతీయ స్థాయి నేతగా రాజకీయ శేష జీవితాన్ని లాగించేద్దాం అనుకుంటున్నారా అనేది తేలడం లేదు.