Site icon NTV Telugu

MLA Reddy Shanti : పాతపట్నం వైసీపీలో రంగులు మారుతున్నాయా?

Palavalasa Reddy Shanthi

Palavalasa Reddy Shanthi

కుటుంబ రాజకీయ చరిత్ర.. బలమైన కుల సమీకరణలు కలసిరావడంతో ఎమ్మెల్యే అక్కడ పాగా వేశారు. ప్రస్తుతం ఆ బలమే బలహీనంగా మారుతోందట. స్థానికతను సాకుగా చూపిస్తూ వ్యతిరేకత పెరుగుతోందట. నాడు పల్లకీ మోసిన వాళ్లే నేడు రాంరాం అంటున్నారా? ఎందుకలా? లెట్స్‌ వాచ్‌..!

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా హిర మండలంలో సమావేశం అయ్యారు. కొత్తూరు వైస్ ఎంపీపీ తులసి వరప్రసాద్ నేతృత్వంలో 5 మండలాల అసమ్మతి నేతలంతా ఆ సమావేశానికి వచ్చారట. నాన్ లోకల్ అయిన రెడ్డి శాంతికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేశారట అసమ్మతి నేతలు. మొదటి నుంచి వైసీపీ కోసం కష్టపడే నేతలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని.. అసహనం వ్యక్తం చేశారట. స్థానికులకు టికెట్‌ కేటాయించాలనే డిమాండ్‌ను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో తీర్మానించినట్టు తెలుస్తోంది.

పాతపట్నంలో స్థానికేతరులను ఎమ్మెల్యేలుగా చేయడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిర మండలంలో జరిగిన ఆ సమావేశం ప్రస్తుతం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. మొన్నటి వరకు ఎమ్మెల్యేపై విపక్ష పార్టీలు విరుచుకుపడితే.. ఇప్పుడు స్వపక్షంలోని వైరి వర్గమే ఆ పాత్ర పోషిస్తోంది. పైగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గ్రామ గ్రామానికీ తీసుకెళ్లే పనిలో పడ్డారట.

వంశధార జలాలను ఇతర ప్రాంతాలకు తరలించుకు పోతున్నారని.. నియోజకవర్గ ప్రజలకు నీళ్లు కరువయ్యాయని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పార్టీలో ఒంటెద్దు పోకడలు.. ఎమ్మెల్యే PAల అత్యుత్సాహం మొదటికే మోసం తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డి శాంతి కుమారుడు హిర మండలంలో జడ్పీటీసీగా ఓడిపోయారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వైఖరిలో మార్పు లేదని మండిపడుతున్నారట.

మాజీ మంత్రి పాలవలస రాజశేఖరం కుమార్తె ఎమ్మెల్యే రెడ్డి శాంతి. పాతపట్నంతోపాటు మరో రెండు నియోజకవర్గాల్లో పాలవలస కుటుంబం పట్టు ఎక్కువ. ఇక్కడ పాలవలస కుటుంబం చెప్పిన వాళ్లకే టికెట్‌ ఇస్తుంటారు. ఆ కోటాలోనే రెడ్డి శాంతికి టికెట్‌ దక్కింది. జిల్లాల విభజన తర్వాత పరిస్థితి మారిపోయిందనే చర్చ నడుస్తోంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండబోవని.. సమయం వస్తే తిరుగుబావుటాలు తప్పదని కామెంట్స్ చేస్తున్నారట. ఈ లుకలుకల తీవ్రత పెరిగి.. పాతపట్నంలో పార్టీతోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలు వెలవెలబోతున్నాయి. ఎమ్మెల్యే పాల్గొనే.. చేపట్టే ప్రోగ్రామ్స్‌కు ఆమంటే గిట్టని వాళ్లు రావడం లేదు. మరి.. సమస్యను సర్దుబాటు చేసేందుకు వైసీపీ పెద్దలు చొరవ తీసుకుంటారో.. లేక పాలవలస కుటుంబమే నష్ట నివారణ చర్యలు చేపడుతుందో చూడాలి.

Exit mobile version