అప్పు పుట్టేదెలా? ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. కొంతకాలంగా ఏదోరకంగా రుణం తేవడం.. బండి నడిపించడం ఆర్థికశాఖ అధికారులకు అలవాటైంది. ఇప్పుడు కేంద్రం పరిమితులు విధించింది. భారీగా కోత పెట్టింది. మరి.. ఇప్పుడెలా? ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేంటి?
ఈ ఆర్థిక సంవత్సరం రూ.42,472 కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయం!
ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా.. సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా వెనకాడకుండా గట్టిగానే ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో అప్పుల కోసం నెలా నెలా సర్కార్ తర్జనభర్జన పడటం పరిపాటిగా మారింది. ఈ రెండేళ్లలోనే నగదు రూపంలోనే లక్షా పదివేల కోట్ల రూపాయలు జనానికి అందాయి. సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి లోటు లేదు. ఇప్పుడు సీన్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు.. పేరుకుపోయిన బకాయిలు.. తేవాలనుకొన్న కొత్త లోన్లకు అడ్డంకిగా మారాయట. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 42 వేల 4వందల 72 కోట్లు అప్పుగా తేవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆ మేరకు రుణం తీసుకోవడానికి వీల్లేదని కోర్రీలు వేస్తోంది కేంద్రం.
read aslo : వైఎస్సార్ జయంతి : అవార్డులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
ఏపీకి రుణ పరిమితి ఫిక్స్ చేసిన కేంద్రం
రూ.33,668 కోట్ల రుణానికే వెసులుబాటు!
కొన్నేళ్లుగా తీసుకున్న రుణాలెంత? తీర్చిందెంత? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? మార్కెట్ బారోయింగ్స్ ఎన్ని? కార్పొరేషన్ ద్వారా ఎంత మేర రుణాలు తీసుకున్నారు? బ్యాంక్ గ్యారెంటీలు ఏమైనా ఇచ్చారా? అనే అంశాలకు పూర్తిస్థాయి సమాచారం కావాలని కోరింది కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలు అందించిన తర్వాత మాత్రమే రుణ పరిమితిని ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో కేంద్రం అడిగిన లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఆ లెక్కలను బేస్ చేసుకున్న కేంద్రం ఏపీకి రుణ పరిమితిని ఫిక్స్ చేసింది. రాష్ట్రం 42 వేల కోట్లు తీసుకోవాలని అనుకుంటే, కేంద్రం సూచించిన లెక్కప్రకారం.. 33వేల 6 వందల 68 కోట్ల రూపాయల మేర రుణాన్ని తీసుకునేందుకు వెసులుబాటు ఉంది.
రుణ అర్హత నుంచి కొంత మొత్తాన్ని మినహాయించిన కేంద్రం
గతంలో అర్హత లేకున్నా ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకోవడంవల్ల ప్రస్తుత సంవత్సరంలో రుణకోత విధించారని అనుకుంటున్నారు. గతంలో అర్హత లేకుండా తీసుకున్న రుణాల విలువే సుమారుగా 17వేల 9 వందల 23 కోట్ల రూపాయలు ఉంటుందని కేంద్రం అంచనా వేసిందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీకున్న రుణ అర్హత నుంచి ఈ మొత్తాన్ని మినహాయించిందని సమాచారం.
తొలి త్రైమాసికంలో ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.47,118 కోట్లు
తొలి 3 నెలల్లో వచ్చిన ఆదాయం రూ.17,812 కోట్లు
ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలూ రోజు రోజుకూ తక్కువై.. ఖర్చులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సొంతం పన్నుల ద్వారా వస్తున్న ఆదాయానికీ ఖర్చుకి ఏ మాత్రం సరితూగడం లేదు. ప్రభుత్వం వివిధ పద్దుల కింద ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో ఖర్చు చేసిన మొత్తం 47 వేల నూట 18 కోట్లు. వచ్చిన ఆదాయం కేవలం 17 వేల 8 వందల 12 కోట్లు. ఇలా ఏప్రిల్‌లో 10 వేల కోట్లు, మే నెలలో 9 వేల కోట్లు, జూన్‌లో పదివేల కోట్లకుపైగా ఆదాయానికి వ్యయానికి మధ్య వ్యత్యాసం ఏర్పడింది.
అప్పు పుట్టక ఏం చేయాలో పాలుపోని అధికారులు!
ఆదాయ వ్యయాల పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం బ్రేక్‌లు వేసింది. ఇటు చూస్తే రాష్ట్రంలో అప్పు పుట్టక ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదట. మరి.. ఈ కష్టకాలాన్ని ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి.
