Site icon NTV Telugu

అనంత టీడీపీ లో తారాస్థాయికి చేరిన వర్గ పోరు…

కంచుకోట లాంటి జిల్లాలో ప్రస్తుతం వర్గపోరుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది టీడీపీ. పార్టీ వేదికలపైనే వైరిపక్షాల్లా మాటలు దూసుకుంటున్నారు నేతలు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా జిల్లా? ఎందుకు తమ్ముళ్లు కట్టు తప్పుతున్నారు? లెట్స్‌ వాచ్‌!

జేసీకి వ్యతిరేకంగా ఒక్కటైన పాత టీడీపీ లీడర్లు!

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. మొన్నటికి మొన్న రాయలసీమ టీడీపీ నేతలంతా ఉన్న వేదికపైనే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని.. పార్టీ నాశనం అవుతోందని మండిపడ్డారు జేసీ. ఈ వ్యాఖ్యలపై పార్టీ నేతలంతా బహిరంగంగానే విమర్శలకు దిగారు. జేసీకి వ్యతిరేకంగా పాత టీడీపీ నేతలంతా ఒక్కటయ్యారు. ఈ వివాదంలో జేసీ ఫ్యామిలీ ఒకవైపు.. మిగిలిన ఓల్డ్‌ టీడీపీ లీడర్లంతా ఇంకోవైపు అన్నట్టుగా అనంత పార్టీ చీలిపోయింది. పార్టీ పార్లమెంటరీ అధ్యక్ష పదవికి కాల్వ శ్రీనివాసులు రాజీనామా చేస్తాననే వరకు అదే ఇష్యూ వెళ్లింది. జిల్లాలో జేసీ రాజేసిన అగ్గి టీడీపీని కుదేలు చేసింది.

టూ మెన్‌ కమిటీపై శింగనమల ఇంఛార్జ్‌ శ్రావణి వర్గం ఫైర్‌!
మూకుమ్మడి రాజీనామాలకు శ్రావణి వర్గం అల్టిమేటం!

ఈ కాక చల్లారకముందే జిల్లాలో మరో వివాదం. అదికూడా పార్టీ కొనితెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో పడుతూ వస్తోన్న అనంతపురం పార్లమెంటరీ కమిటీ ప్రకటన విభేదాలకు అగ్గిరాజేసింది. శింగనమల నియోజకవర్గ నేతలంతా జిల్లా పార్టీ ఆఫీస్‌లో కుర్చీలు విరగొట్టేంత పనిచేశారు. టూమెన్ కమిటీ ఏర్పాటే దానికి కారణం. ఎస్సీ రిజర్డ్వ్‌గా ఉన్న శింగనమలకు బండారు శ్రావణి టీడీపీ ఇంఛార్జ్‌. పార్టీ మాత్రం నియోజకవర్గంలో టీడీపీ వ్యవహారాలు, కమిటీల ఎంపిక బాధ్యతను కేశవరెడ్డి, ఆలం నరసానాయుడుతో కూడిన టూ మెన్‌ కమిటీకి అప్పగించింది. దీనిపై శ్రావణి వర్గీయులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ‘ఎస్సీ నియోజకవర్గంలో వారి పెత్తనం ఏంటి? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని వారిని.. మండలాల్లో చిచ్చు పెడుతున్న నేతలతో కమిటీలు ఎలా వేస్తారు’ అని జిల్లా పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు శ్రావణి వర్గీయులు. దళితులకు, మహిళలకు పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా.. అసలు అధిష్ఠానానికి కొంచమైనా శ్రద్ధ ఉందా అని మీడియా ముందు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టూ మెన్‌ కమిటీ ఏర్పాటును వెనక్కి తీసుకోకపోతే.. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ వివాదంపై తాజాగా జేసీ దివాకర్‌రెడ్డిని కలిసి మాట్లాడారు శ్రావణి వర్గం నేతలు.

శ్రావణి వర్గంపై కాల్వ శివాలు..!

గొడవ జరిగిన రోజు సాయంత్రం పార్టీ కార్యాలయంలో కాల్వ శ్రీనివాసులు అసంతృప్తులతో సమావేశం నిర్వహించారు. అప్పటికే JC వ్యాఖ్యలతో బాగా కాకమీద ఉన్న కాల్వకు శింగనమల పంచాయితీ చిర్రెత్తించినట్టు ఉంది. శ్రావణి వర్గంపై ఫైర్‌ అయ్యారు. ‘పార్టీ ఆఫీస్‌లో మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా.. ఎవరుపడితే వారు ఏదంటే అది మాట్లాడటానికి ఇది పార్టీ కార్యాలయమా… లేక ఇంకొకటా.. పెద్ద పొడిచే వారొచ్చారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిదిద్దాల్సిన నేతే ఇలా రియాక్ట్‌ కావడంతో సీన్‌ మరింత హీటెక్కింది. శింగనమల నేతలంతా భగ్గుమన్నారు. మమ్మల్నే అంటారా అని వాగ్వాదానికి దిగారు.

కాల్వపై దాడి అని సోషల్‌ మీడియాలో ప్రచారం!

కళ్యాణదుర్గంలో జిల్లా నేతల సమక్షంలోనే టీడీపీలో రెండువర్గాలు ఘర్షణకు దిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తూ ముందుకు దూసుకెళ్లింది శ్రావణి వర్గం. పోలీసులు రావడంతో వారంతా కుర్చీలు విసిరేస్తూ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇంతలో సోషల్‌ మీడియాలో కాల్వపై దాడి అంటూ ప్రచారం జరిగింది. అయితే తనపై ఎవరూ దాడి చేయలేదని కాల్వ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. టీడీపీకి కంచుకోటలా ఉన్న జిల్లాలో ఈ పరిస్థితికి, విభేదాలకు కొన్నింటికి నాయకులు కారణమైతే.. మరికొన్నింటికి అధిష్ఠానం నిర్ణయాలు ఆజ్యం పోస్తున్నాయి. మరి.. వీటికి ఎలా చెక్‌ పెడతారో చూడాలి.

Exit mobile version