Site icon NTV Telugu

MLA Adeep Raju : వైసీపీలో రాజకీయ విమర్శలకు కేంద్రంగా అదీప్ రాజు.. తాడేపల్లికి పిలిచి తలంటారట..?

Trs Anam Raju

Trs Anam Raju

అధికారపార్టీలో ఆయనో యువ ఎమ్మెల్యే. సొంత కెపాసిటీకంటే పార్టీగాలి కలిసొచ్చి పదవులోకి వచ్చారు. ఎన్నికల్లో ఏనుగంత బలం అనుకున్న అనుచరులు, బంధువులే ఇప్పుడు వీక్ పాయింట్ అయ్యారు. ఐనవాళ్లను కంట్రోల్ చెయ్యలేక… హైకమాండ్ అక్షింతలు భరించలేక అడకత్తెరలో నలిగిపోతున్నారట. ఇంత నెగిటివిటీ మూటగట్టుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ గొడవలేంటి?

అన్నంరెడ్డి అదీప్‌రాజు. విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగడం..పరవాడ, సబ్బవరం మండలాల్లో వైసీపీకి ఆదరణ లభించడంతో 34 ఏళ్లలోనే ఎమ్మెల్యే అయ్యారు అదీప్‌రాజు. గెలిచిన తర్వాత మొదటి రెండేళ్లు బాగానే గడిచినా.. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భవిష్యత్‌పై అదీప్‌రాజ్ కు చాలా ఆశలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ బలంగానే కనిపిస్తోంది. అనుచరులు, బంధువుల చర్యలు కారణంగా వివాదాలకు, రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు అదీప్‌రాజు.

పెందుర్తి పరిధిలో ఏ వివాదం చెలరేగినా దానివెనక అధికారపార్టీ నాయకుడు లేక.. ఎమ్మెల్యే అనుచరుడి పేరు బయటకు రావడం చర్చగా మారుతోంది. ల్యాండ్ బ్యాంక్ అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ భూ వివాదాలు ఎక్కువ. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు సంబంధించిన ఏ అంశం విమర్శలకు తావిచ్చినా వైరిపక్షాలు ఊరుకోవడం లేదు. ఇదే అదీప్‌రాజుకు తలనొప్పిగా మారుతోందట. కొన్ని వ్యవహారాలు ఆయనకు తెలిసి జరుగుతుండగా.. మరికొన్ని వివాదం రేగిన తర్వాత ఎమ్మెల్యే నోటీసుకు వెళ్తున్నాయట. వయసుతోపాటు రాజకీయ అనుభవం తక్కువ కావడం.. సీనియర్ల మాట కాదనలేకపోవడంతో ఇబ్బందలు వస్తున్నాయని చెబుతున్నారట అదీప్‌.

ఇటీవల పెందుర్తిలో నడిరోడ్డులో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వైద్యురాలి కుటుంబాన్ని వేదించారు. ఎదురు మాట్లాడితే పొడిచి పారేస్తానని బెదిరించారు మనోహర్‌ అనే వ్యక్తి. చివరకు ఆ మనోహర్‌ తన అనుచరుడే అని అదీప్‌రాజు అంగీకరించారు. ఈ గొడవ ఎంత సంచలనమైందో.. ఎమ్మెల్యేకు అంతే డ్యామేజ్‌ అయ్యిందట. అంతకు ముందు ఇటువంటిదే మరో ఘటన జరిగింది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వార్డు అధ్యక్షుడుగా ఉన్న దొడ్డి కిరణ్‌ అనే చోటా నాయకుడు దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపైన దాడికి తెగబడ్డాడు. స్వయంగా కలెక్టర్ జోక్యం చేసుకుని నిందితుణ్ణి అరెస్ట్ చేయించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేకు సంబంధం లేదన్నది పార్టీ వర్గాల మాట. కానీ అదీప్‌రాజు జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. ఇటీవల సబ్బవరం మండలం గొల్లలపాలెం భూవివాదంలో జరిగిన ఘర్షణ చిన్నదే అయినా పెద్ద రచ్చే అయ్యింది. ఎమ్మెల్యే స్వగ్రామం రాంపురంలో చెరువు ఆక్రమణ.. పరవాడ మండలంలో రొయ్యల చెరువుల భూముల తగువు విమర్శలకు దారితీసింది. చివరకు పార్టీ పెద్దలు కల్పించుకుని డ్యామేజ్‌ కంట్రోల్ చేశారు.

కొన్ని అంశాలపై నేరుగా CMOకు ఫిర్యాదులు వెళ్తున్నాయట. రాజకీయంగా ఎమ్మెల్యే అభద్రతకు లోనయ్యే పరిణామాలు పెందుర్తిలో కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పెందుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో పంచకర్లపై అదీప్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. పెందుర్తిలో జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్న పార్టీ పెద్దలు ఎమ్మెల్యేను తాడేపల్లికి పిలుపించుకున్నారట. సుమారు 2 గంటలపాటు సమావేశం జరిగింది. మరోసారి ఆరోపణలు వస్తే సహించబోమని హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. ఎమ్మల్యే అదీప్‌రాజు తీరు మార్చుకుంటారో లేక.. పాత పద్ధతిలోనే వెళ్తారో చూడాలి.

Exit mobile version