Site icon NTV Telugu

Prudhviraj: పృథ్వీరాజ్‌కు ఏమైంది?

30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు ఏమైంది? రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు ఏ విషయంలో మథన పడుతున్నారు? రాజకీయ వైరాగ్యం కలిగిందా? అసలు రాజకీయం తెలిసిందా? ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం పరితపిస్తున్నారా? లెట్స్‌ వాచ్‌..!

గతాన్ని తలచుకుని ఆవేదన
30 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటుడు పృధ్వీరాజ్‌. అర్థాంతరంగా రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. పాలిటిక్స్‌లో ఒక ఫుట్‌బాల్‌లా ఎగిరిపడ్డారు పృథ్వీ. ఇప్పుడు ఆ గతాన్ని తలచుకుని ఆవేదన చెందుతూ మరోసారి చర్చల్లోకి వచ్చారు.

రాజకీయాల్లో.. ఇండస్ట్రీలో తెరమరుగు..!
నటుడిగా చేతి నిండా సినిమాలు ఉన్న సమయంలో వైసీపీ కండువా కప్పుకొని ఏపీలో పొలిటికల్‌ అరంగ్రేటం చేశారు పృథ్వీ. ఎన్నికల ప్రచారంలో ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం.. SVBC ఛానల్‌ బోర్డు ఛైర్మన్‌గా నియమించింది. పృథ్వీకి ఆ పదవి ఇవ్వడంపై అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. ఎంత వేగంగా ఆ పదవి చేపట్టారో.. అంతే వేగంగా ఆయన తీరు అక్కడ వివాదాలు రేపింది. చివరకు అనూహ్యంగా ఆ పదవి ఊడిపోవడం.. రాజకీయంగా.. వెండితెర పరంగా తెరమరుగు కావడం చకచకా జరిగిపోయాయి. కొన్నాళ్లు మీడియాలో పృధ్వీ గురించి చర్చ జరిగినా.. తర్వాత ఆయన్ని పట్టించుకున్నవాళ్లూ లేరు.

రాజకీయాల్లో గుణపాఠం నేర్పారన్న పృథ్వీ
వైసీపీకి, మీడియాకు దూరంగా ఉన్న పృథ్వీ.. తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నారు. తనకు రాజకీయాలు సరిపోవని..చిత్ర పరిశ్రమే తనకు దిక్కు అని చెప్పి వాపోయారు పృథ్వీ. ఆ వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇక తాను రాజకీయాలు చేయలేనని.. రాజకీయ జీవితంలో బండ చాకిరీ చేసిన తనకు ఒక గుణపాఠం నేర్పారని పృథ్వీ వెల్లడించారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ వైరాగ్యం కలిగిందా?
వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై మాటల తూటాలు పేల్చిన పృథ్వీ.. ఇప్పుడు టోన్‌ మార్చేశారు. పవన్‌ కల్యాణ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. మెగాస్టార్‌ చిరంజీవితోపాటు.. మెగా ఫ్యామిలీని ఆకాశానికి ఎత్తేయడం చర్చగా మారింది. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలోనూ సైరాలో తనకు చిరంజీవి అవకాశం ఇచ్చారని.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వీడియో చూశాక.. పృథ్వీరాజ్‌కు ఏమైంది అనే ప్రశ్న వినిపిస్తోంది. రాజకీయ వైరాగ్యం కలిగిందా? ఆయనకు బుద్ధి చెప్పింది ఎవరు? అనే చర్చ జరిగింది. తన వెనకాల కొండను చూసి ఇష్టానుసారం మాట్లాడేశానని..చాలా తప్పుడు మాటలు మాట్లాడినట్టు పృథ్వీ వెల్లడించారు.

చాలా వెన్నుపోట్లు చూశారట
ఆత్మగౌరవానికీ అహంకారానికీ మధ్య జరిగిన పోరాటంలో రాజకీయంగా ఓడిపోయినట్టు చెబుతున్నారు పృథ్వీ. బంధువులను, స్నేహితులను నమ్మడం లేదని.. అన్ని వెన్నుపోట్లను చూశానని ఆయన వెల్లడించారు. కోవిడ్‌ సోకినప్పుడు బతుకుతానో లేదో అనుమానం వచ్చినట్టు చెప్పారు పృథ్వీ. ఆ సమయంలో తనను ఆదుకున్నది చలనచిత్ర పరిశ్రమే అన్నది ఆయన మాట. మొత్తానికి ఈ థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి.. పాలిటిక్స్‌ గురించి వేగంగానే బోధపడిందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Exit mobile version