Site icon NTV Telugu

Silent kil*ler: 2 కోట్ల మందిని చంపింది.. పిల్లలను కూడా వదల్లేదు.. 2026లోనూ ఇదే ప్రమాదం పొంచి ఉందా?

Heart attack cases 2025 silent killer

Silentkillerheartattack

2025…! గుండెపోటుల ఏడాది..! స్కూల్‌ పిల్లలు, టీనేజర్లు కూడా గుండెపోటుకు గురైన కేసులు ఎక్కువగా కనిపించిన సంవత్సరం ఇదే! జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువకులు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం.. ఆఫీస్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్న ఉద్యోగి ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు ఓ భయానక ట్రెండ్‌గా నిలిచాయి. అమెరికా నుంచి భారత్ వరకు, యూరప్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ ఏడాది ఆకస్మిక గుండెపోటు మరణాలు భారీగా పెరిగాయని ఆరోగ్య సంస్థల డేటా చెబుతోంది. ఇంతకీ ఎందుకిలా జరిగింది? 2026లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండనుందా? ఏ దేశాల్లో ఎంతమంది చనిపోయారు? ఇండియాతో పాటు తెలుగు రాష్ట్రాల సంగతేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలా? అయితే ఇవాళ్టి మన ఇయర్‌ ఎండర్ టాపిక్‌లో హార్ట్‌ అటాక్‌ ఎందుకు ది సైలెంట్‌ కిల్లర్‌గా మారిందో మాట్లాడుకుందాం!
YouTube video player
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2025లో కార్డియో-వాస్క్యులర్ డిసీజెస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మందికి పైగా మరణించారు. ఇందులో గుండెపోటులే ప్రధాన కారణం. గత ఐదేళ్లతో పోలిస్తే ఇది దాదాపు 15 నుంచి 20 శాతం పెరుగుదల. ఈ మరణాల్లో పెద్ద సంఖ్యలో 30 నుంచి 50 ఏళ్ల వయసు వాళ్లు ఉండడం అన్నిటికంటే కలవరపెట్టే విషయం. అంటే వృద్ధాప్యంతో వచ్చే సహజ మరణాలు కాదు. పూర్తిగా యాక్టివ్‌గా ఉన్న వాళ్ల జీవితాలు మధ్యలోనే ఆగిపోయాయని అర్థం.

అమెరికాలో 2025లో సడన్ కార్డియాక్ డెత్ కేసులు భారీగా పెరిగాయని CDC నివేదికలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 4 లక్షల మంది అమెరికన్లు సగన్‌గా గుండె ఆగిపోవడం వల్ల మరణిస్తున్నారని అంచనా. ఇందులో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు, నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవాళ్లు, అధిక స్థాయిలో కెఫైన్‌ ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే యువత ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. జిమ్‌లో హెవీ వర్కౌట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలు కూడా 2025లో అమెరికాలో ఎక్కువగా నమోదయ్యాయి.

అటు యూరప్‌లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. యూకే, జర్మనీ, ఇటలీ లాంటి దేశాల్లో చలికాలంలో గుండెపోటుల రేటు భారీగా పెరిగింది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఊబకాయం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఈ సమస్యను మరింత పెంచాయి. ఆస్ట్రేలియాలో కూడా 40 ఏళ్ల లోపు వయసులో హార్ట్ ఎమర్జెన్సీలు పెరిగాయని అధికారిక డేటా చెబుతోంది.

ఇటు భారత్‌లో అయితే 2025 గుండెపోటుల విషయం ఒక టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం మరణాల్లో సుమారు 28 శాతం గుండె సంబంధిత వ్యాధుల వల్లనే జరుగుతున్నాయి. 2025లో ఆకస్మిక మరణాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ముఖ్యంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో గుండెపోటులు పెరగడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. పోస్ట్ కోవిడ్ ప్రభావం, బీపీ, డయాబెటిస్, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం లాంటివి కలిసి ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి.

ముఖ్యంగా ఇండియాలో పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా టెన్షన్ పెడుతోంది. చిన్న వయసులోనే పెద్దలకు వచ్చే హార్ట్ సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది పిల్లల్లో ఐదు సంవత్సరాల వయసు నుంచే రక్తంలో కొవ్వు పదార్థాలు పెరగడం, రక్తపోటు ఎక్కువగా ఉండటం లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్ ప్రాంతంలో స్కూల్ పిల్లలకు ట్రైగ్లిసరైడ్ సమస్య కనిపిస్తోంది. అంటే రక్తంలోని కొవ్వు ఎక్కువగా ఉండడం చాలా సాధారణమైపోయింది. ఈ పదార్థం ఎక్కువైతే గుండెకి ఒత్తిడి పెరిగి రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. కేరళలో చిన్న వయసు పిల్లలలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉంటున్నాయి. సాధారణంగా పెద్దవారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపించడం చాలా ఆందోళన కలిగించే విషయం.

ఇటు ఢిల్లీలో టీనేజర్లలో రక్తపోటు పెరగడం ఒక తీవ్రమైన సంకేతంగా భావించబడుతోంది. ఒత్తిడి, జంక్ ఫుడ్ అలవాట్లు, నిద్ర లేకపోవడం, కాలుష్యం లాంటి కారణాలు దీనికి కారణంగా భావిస్తున్నారు. పిల్లల శరీరం ఇంకా ఎదుగుతున్న దశలోనే ఇలాంటివి కనిపించడం కారణంగా వారంతా పెద్దయ్యే సమయానికి హార్ట్ అటాక్‌ లాంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. నిజానికి 2025లో 9ఏళ్ల బాలుడికి కూడా గుండెపోటు వచ్చి మరణించిన కేసు నమోదైంది.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 2025లో నమోదైన ఆకస్మిక మరణాల కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల డేటాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీమా అగ్రిగేటర్ల డేటా ఆధారంగా చూస్తే 2019-2020లో గుండె జబ్బులకు సంబంధించిన ఆరోగ్య బీమా చికిత్స క్లెయిమ్‌లు 9 శాతం నుంచి 12 శాతం వరకు ఉన్నాయి. 2023-24 నాటికి, బీమా క్లెయిమ్‌లు 18 శాతం నుంచి 20 శాతానికి పెరిగాయి. ఇక 2025లో ఈ సంఖ్య మరింత పెరిగి ఉంటుందని అంచనా. హైదరాబాద్‌లో ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల గుండె నిద్రలోనే ఆగిపోతున్నాయి. ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ, లేదా జిమ్‌లో ట్రెడ్‌మిల్ మీద నడుస్తూ కుప్పకూలిన ఘటనలు కూడా 2025లొ తరచూ కనిపించాయి. వైద్యుల మాటల్లో చెప్పాలంటే, చాలా మందికి ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. సాధారణ హెల్త్ చెకప్‌లు చేసినా ప్రమాదాన్ని గుర్తించలేకపోయిన సందర్భాలూ ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో మధ్య వయసు ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఆకస్మిక గుండెపోటుతో మరణించిన ఘటనలు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సమస్య మరింత తీవ్రంగా ఉంది. గుండెపోటు వచ్చిన తర్వాత ఆస్పత్రికి చేరుకునేలోపు సమయం వృథా కావడం వల్ల ప్రాణాలు కోల్పోయిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. వైద్య సదుపాయాల ఆలస్యం కూడా ఒక ప్రధాన కారణంగా మారింది.

అయితే ఇవి సాధారణ గుండెపోటులు కావు. ఇవి సైలెంట్ హార్ట్ అటాక్స్. అంటే ముందుగా ఛాతి నొప్పి, ఊపిరాడకపోవడం లాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కొందరిలో ECG, కొలెస్ట్రాల్ రిపోర్టులు నార్మల్‌గా ఉన్నా కూడా గుండె లోపల ప్లాక్ ఒక్కసారిగా రప్చర్ అవుతుంది. దీంతో వెంటనే గుండె ఆగిపోతుంది. నిద్రలో వచ్చే స్లీప్ అప్నియా, తీవ్రమైన ఒత్తిడి వల్ల విడుదలయ్యే స్ట్రెస్ హార్మోన్లు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.

2025లో ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేసిన మరో అంశం వాతావరణ మార్పులు. తీవ్రమైన వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు గుండెపై అదనపు ఒత్తిడి పెడుతున్నాయి. శరీరంలో డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ హార్ట్ బీట్‌ను దెబ్బతీస్తోంది. దీనికితోడు.. డెస్క్‌ వర్క్‌ కల్చర్ వల్ల గంటల తరబడి కూర్చుని పనిచేయడం, శారీరక కదలిక తగ్గిపోవడం కూడా ఒక పెద్ద కారణంగా మారింది.

ఇప్పుడంతా కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 2025లో గుండెపోట్లు ఒక హెచ్చరికగా మారాయి. మన జీవనశైలిలో జరిగిన మార్పుల ఫలితం. సరైన స్క్రీనింగ్ లేకపోవడం, లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడిని సాధారణంగా తీసుకోవడం మనల్ని ఈ ప్రమాదం వైపు నడిపిస్తోంది. ఇక ఇప్పుడు భయపెడుతున్న మరో అంశం.. 2026లో ఈ సైలెంట్ కిల్లర్ మరింత ప్రమాదకరంగా మారుతుందా? లేదా మనం ఇప్పటికైనా అలర్ట్ అవుతామా? గుండె మనకు హెచ్చరిక ఇవ్వకుండా ఆగిపోకముందే, మన జీవనశైలిని మార్చుకునే సమయం వచ్చిందా? 2025 ఈ ప్రశ్నలను గట్టిగా అడిగి వెళ్లింది. సమాధానం మాత్రం మన చేతుల్లోనే ఉంది!

Exit mobile version