NTV Telugu Site icon

Telugu States Floods: స్టార్ హీరోలూ మీకేమైంది.. బాధ్యత ఉండక్కర్లే?

Tamil Star Heros

Tamil Star Heros

Non Telugu Star Heros Silent on Telugu States Floods: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వలన ఖమ్మం, విజయవాడ లాంటి ప్రాంతాలు వరదలతో అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడలో చిట్టినగర్, సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు ఉధృతంగా ఉంది. అక్కడి బాధితులకు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు సైతం ఆకలి తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒక సరికొత్త చర్చ తెర మీదకు వచ్చింది. నిజానికి ఈ వరద నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి సుమారు 20 కోట్ల వరకు విరాళాలు ప్రకటించారు. కొంతమంది నిర్మాతలు, కొంతమంది దర్శకులు, కొంతమంది హీరోలతో పాటు అనన్య నాగళ్ళ, స్రవంతి చొక్కారపు లాంటి నటీమణులు సైతం తమకు తోచినంత సాయం చేశారు.

Devara‌ : ఓవర్సీస్ లో ‘దేవర’ రికార్డులే రికార్డులు.. దేవర ముంగిట నువ్వెంత..

ఇక్కడ సాయం చిన్నదా? పెద్దదా? అనే సంగతి పక్కన పెడితే తెలుగు ప్రజలకు అండగా మేము ఉన్నామని కల్పించే భరోసా అది. ఇప్పుడు అదే భరోసా ఇతర సినీ పరిశ్రమల స్టార్ హీరోల నుంచి కరువైంది అనే వాదన వినిపిస్తోంది. నిజానికి తమిళ సినీ పరిశ్రమ నుంచి చూసుకుంటే తలపతి విజయ్, అజిత్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి హీరోల సినిమాలు తమిళనాడుతో పోటాపోటీగా ఇక్కడ కూడా రిలీజ్ అవుతాయి. మన నిర్మాతలు సైతం వాటిని ఒక సెలబ్రేషన్ లాగా సెలబ్రేట్ చేస్తూ రిలీజ్ చేస్తారు. కన్నడ సినీ పరిశ్రమ స్టార్లకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు కానీ కేజిఎఫ్ లాంటి సినిమాలు అక్కడి నుంచి వస్తున్న తర్వాత అక్కడి యష్ , రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, సుదీప్, రాజ్ కుమార్ ఫ్యామిలీ హీరోలు, అర్జున్ మేనల్లుళ్ల సినిమాలు కూడా తెలుగులో మంచి థియేటర్ కౌంట్ తోనే రిలీజ్ అవుతున్నాయి. తెలుగు వర్షన్ రిలీజ్ చేసినందుకు వాళ్లకు బాగానే గిట్టుబాటు కూడా అవుతుంది. ఇక హిందీ స్టార్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోల సినిమాలకు హైదరాబాదు నుంచే తెలుగు కోసం ఖర్చుపెట్టిన డబ్బంతా వచ్చేస్తుంది.

ఓటీటీలలో అలవాటు పడిపోయాక మలయాళ సినీ పరిశ్రమ సినిమాలను కూడా ఇప్పుడిప్పుడే మనవాళ్ళు గట్టిగానే ఆదరిస్తున్నారు. అయితే వాళ్లు ఎవరికీ తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద బీభత్సం గురించి తెలియదా అంటే తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన పరిస్థితులను నేషనల్ మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చింది. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల హీరోలు తప్ప బయట స్టార్ హీరోలు ఒక్కరు కూడా ఒక లక్ష రూపాయలు ప్రకటించిన పాపాన పోలేదు. ఇక్కడ డబ్బు ఎంత ఇస్తున్నాం అనేది ముఖ్యం కాదు. తెలుగు ప్రజలకు అండగా మేమున్నామని ఒక భరోసా కల్పించడమే ముఖ్య ఉద్దేశం. నిజానికి గతంలో కేరళ వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ జరిగినప్పుడు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు అక్కడి ప్రజలకు అండగా విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి అయితే నేరుగా కేరళ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి మరీ తన సహాయాన్ని అందించి వచ్చారు. కేవలం అప్పుడు మాత్రమే కాదు చెన్నైలో వరదలు వచ్చినప్పుడు సైతం మన తెలుగు హీరోలు అక్కడి ప్రజలకు అండగా ఉన్నామని సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు.

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. మనల్ని ఆదరించే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు మన తెలుగు హీరోలు ఎప్పుడూ అండగానే ఉన్నారు. కానీ ఇతర సినీ పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలకి మాత్రం ఆ బాధ్యత కరువైందని చెప్పాలి. ఈ విషయం మీద తెలుగు సినీ అభిమానుల నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు తెలుగు ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించే కొందరు ఇతర భాషల స్టార్ హీరోల సినిమాలను ఇక్కడ అసలు రిలీజ్ చేయకూడదు అన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈటీవీ ప్రభాకర్ కొడుకు హీరోగా లాంచ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా రెండు సినిమాలు చేశాడు కానీ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే నా అనుకునే తన తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ స్పీకర్ను పిలిచి మరి తనకు వీలైనంతలో ఒక చెక్ రాసిచ్చాడు. తన మొదటి సినిమా కనుక ఆడితే తన తల్లిదండ్రులే నిర్మాతలు కనుక వచ్చే లాభాల్లో 10% వరద బాధితులకు ఖర్చు పెడతానని మాట ఇచ్చాడు. ఇది కదా మన అనే భావన. ఆ భావన ఇతర భాష స్టార్ హీరోలకు ఎందుకు ఉంటుంది అంతా మన పిచ్చే కానీ.

Show comments