Site icon NTV Telugu

1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్‌ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!

Who Is Matadin Bhangi

Who Is Matadin Bhangi

Matadin Bhangi-Mangal Pandey: కొన్ని పేర్లను వెలుగులో తీసుకొస్తారు..మరికొన్ని పేర్లను చీకట్లోకి తోసివేస్తారు. 1857 తిరుగుబాటు అంటే మనకు గుర్తొచ్చేది ఒక సిపాయి ధైర్యం.. ఒక తుపాకీ గర్జన.. మంగల్‌ పాండే వీర మరణం. కానీ ఆ తుపాకీకి మంట పెట్టిన క్షణం ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? ఒక దళితుడు నీళ్లు అడిగిన క్షణం.. ఒక కుల అహంకారం అతన్ని అవమానించిన క్షణం.. అదే క్షణం చరిత్ర దిశ మార్చుకుంది.

ఒక మాట.. ఒక ప్రశ్న.. ఒక అవమానం.. ఇవే ఒక సామ్రాజ్యానికి సవాల్‌గా మారాయి. ఏప్రిల్‌ 8 అనగానే అంతా మంగల్‌ పాండే త్యాగాన్నే గుర్తుచేసుకుంటారు. ఆయన్ను ఉరితీసి చంపిన బ్రిటిష్‌ పాలకుల క్రూరత్వమే అందరికి కనిపిస్తుంది. అయితే అసలు మంగల్‌ పాండే పోరాటానికి కారణమైన మాతాదిన్‌ భంగి గురించి ఎంతమందికి తెలుసు? ఇంతకీ ఎవరీ భంగీ? స్వాతంత్ర్య సమరానికి ఆజ్యం పోసింది ఆయననేనా?

బరాక్‌పూర్‌ కాంటోన్మెంట్‌లో మాతాదిన్‌ భంగి స్వీపింగ్‌ పని చేసేవాడు. అంటే కాంటోన్మెంట్‌లో ఊడ్చే పని భంగిది. ఆయుధాల తయారీ కేంద్రంలో చర్మంతో, జంతువుల అవశేషాలతో పని చేయడం ఆయన దినచర్య. కుల వ్యవస్థ భంగికి ఇచ్చిన పేరు దళితుడు..!

భంగి చేసి పనిని చూసి భారతీయ సమాజం ఆయన్ను మరింత తక్కువగా చూసేది. అయితే అదే సమాజం ఆయన చేతులతో తయారైన వస్తువులను మాత్రం నిర్భయంగా ఉపయోగించేది. ఒక రోజు ఎప్పటిలాగే కష్టపడి పని చేసి అలసిపోయిన భంగిదాహంతో ఒక బ్రాహ్మిన్‌ సిపాయిని చూసి నీళ్లు అడిగాడు. ఆ సిపాయి ఎవరో కాదు.. మంగల్‌ పాండే. కానీ మంగల్‌ పాండే నీళ్లు ఇవ్వలేదు. ఎందుకంటే భంగి ఒక దళితుడు. భంగి చేతిని పట్టుకుంటే మైలు అని పాండే భావించాడు. భంగి దాహాన్ని పట్టించుకోలేదు. ఆ క్షణంలో అవమానం మంటగా మారింది. భంగి మౌనంగా తలదించుకోలేదు. ఎదిరించాడు. ఒక ప్రశ్న వేశాడు. మీరు మిమ్మల్ని పవిత్రులు అనుకుంటారు కానీ మీరు నోటితో కొరికి ఉపయోగిస్తున్న తుపాకీ కార్ట్రిడ్జ్‌లపై పశువుల కొవ్వు ఉందని మీకు తెలుసా అంటూ నిలదీశాడు. ఆ మాట అక్కడున్న ప్రతి సిపాయిని లోపల నుంచి కుదిపేసింది.

ఎందుకంటే ఆ కార్ట్రిడ్జ్‌లకు ఆవు, పంది కొవ్వును పూస్తారని అర్థమైంది. హిందువులకు ఆవు పవిత్రం, ఇటు ముస్లింలకు పంది నిషిద్ధం. ప్రతి రోజు ఆ కార్ట్రిడ్జ్‌లను సిపాయిలు నోటితో కొరుకుతున్నారు. ఇది మంగల్‌ పాండే మనసులో గుచ్చుకుంది. రోజులు గడిచేకొద్దీ ఆ ఆలోచన అగ్నిగా మారింది.

చివరికి 1857 మార్చి 29న పాండే బ్రిటిష్ అధికారులపై తుపాకీ ఎత్తాడు. ఆ గర్జనతో ఒక యుద్ధం మొదలైంది. పాండేను అరెస్టు చేశారు. కోర్ట్ మార్షల్ చేశారు. ఏప్రిల్ 8న ఉరితీశారు. ఈ రోజు ఆయన త్యాగాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది. అయితే అదే మంటను మొదట రేపిన భంగిని కూడా బ్రిటిషర్లు అరెస్టు చేసి శిక్షించారనే విషయాన్ని చరిత్ర దాచిపెట్టింది. పాఠ్యపుస్తకాలు భంగి గురించి మనకు చెప్పలేదు. ఆయన కథ దళిత గ్రామాల పాటల్లో, నోటి మాటల్లో మాత్రమే మిగిలిపోయింది.

మంగల్‌ పాండే తుపాకీ గర్జన మనకు స్వాతంత్ర్య స్పూర్తిని గుర్తు చేస్తే.. మాతాదిన్ భంగి మాట మనకు కఠిన నిజాన్ని గుర్తు చేయాలి. ఒక దళితుడు అడిగిన ప్రశ్న.. ఒక సమాజం దాచిపెట్టిన నిజం.. అదే 1857 తిరుగుబాటుకు అసలు ఆరంభమనే విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.

Exit mobile version