ప్రపంచమంతా ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్ గురించే మాట్లాడుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో భారత్ చేసుకున్న ఈ ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్.. దేశ ఆర్థిక భవిష్యత్తుపై కచ్చితంగా ఎఫెక్ట్ చూపనుంది.
ఎగుమతులు, ఉద్యోగాలు, MSMEలు, రైతులు, పరిశ్రమలు.. ఈ నిర్ణయానికి నేరుగా లింకై ఉంటుంది. ఇది పూర్తి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు కానీ కీలక అడ్డంకులను తొలగిస్తూ భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్‌లో దారి సులభం చేసే ప్రయత్నం. ముఖ్యంగా టారిఫ్‌ల తగ్గింపు, నాన్ టారిఫ్ బారియర్స్ తగ్గింపు, టెక్నాలజీ సహకారం, పరిశ్రమలకు ఊరట లాంటివి ఈ ఫ్రేమ్‌వర్క్‌లో భాగం.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యవసాయం, డెయిరీ లాంటి సున్నిత రంగాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంది. ఒకవైపు మార్కెట్ యాక్సెస్ పెంచుకుంటూనే మరోవైపు రైతుల భద్రతను కూడా గట్టిగా నిలబెట్టిన ఒప్పందం ఇది. అయితే ఈ ఒప్పందంలో అసలు ఏముంది? ఎవరికీ లాభం? భారత్‌కు ఇది ఎలా గేమ్ చేంజర్ అవుతుంది?
ఈ ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్‌లో కీలకమైన అంశం టారిఫ్‌ల తగ్గింపు. ఇప్పటివరకు భారత వస్తువులపై అమెరికా విధిస్తున్న రిసిప్రొకల్ టారిఫ్‌లు భారీగా ఉండేవి.
ఇప్పుడు ఆ టారిఫ్‌లను గరిష్టంగా 18 శాతానికి తగ్గించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీని వల్ల టెక్స్‌టైల్స్, అపారెల్, లెదర్ అండ్ ఫుట్‌వేర్, ప్లాస్టిక్ అండ్ రబ్బర్ ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకార్, ఆర్టిసనల్ ప్రొడక్ట్స్, కొన్ని రకాల మెషినరీలకు అమెరికా మార్కెట్‌లో పెద్ద అవకాశాలు తెరుచుకోనున్నాయి. అంతేకాదు కొన్ని రంగాల్లో టారిఫ్‌లు పూర్తిగా జీరోకి తగ్గనున్నాయి. జనరిక్ ఫార్మాస్యూటికల్స్, జెమ్స్ అండ్ డైమండ్స్, ఎయిర్‌క్రాఫ్ట్ పార్ట్స్ లాంటి రంగాల్లో భారత్‌కు నేరుగా లాభం చేకూరనుంది. ముఖ్యంగా ఎయిర్‌క్రాఫ్ట్ పార్ట్స్ విషయంలో అమెరికా సెక్షన్ 232 కింద మినహాయింపులు భారత్‌కు లభించనున్నాయి. అలాగే ఆటో పార్ట్స్‌పై టారిఫ్ రేట్ కోటా విధానంలో అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఇది భారత్ నుంచి జరిగే హై వాల్యూ ఎగుమతులకు బలాన్నిస్తుంది.
వ్యవసాయ రంగం విషయానికి వస్తే ఈ ఒప్పందం చాలా స్పష్టంగా ఒక లైన్ గీసింది. మక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఎథనాల్, పొగాకు, మాంసం, కొన్ని కూరగాయలు లాంటి సున్నిత వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్ ఓపెనింగ్ ఇవ్వలేదు. అంటే రైతుల ప్రయోజనాలు పూర్తిగా రక్షించారు.
వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో భారత్ ఎలాంటి రాయితీలు ఇవ్వలేదన్నది ఈ డీల్‌లో కీలక పాయింట్. అదే సమయంలో భారతీయ పండ్లు, కూరగాయలు, మసాలాలు, టీ, ప్రాసెస్డ్ ఫుడ్ లాంటి విభాగాల్లో నాన్ టారిఫ్ బారియర్స్ తగ్గించేందుకు అంగీకారం కుదిరింది. అంటే రిపీటెడ్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లాంటి సమస్యలు తగ్గి అమెరికా మార్కెట్‌లోకి భారత ఉత్పత్తులు త్వరగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది.
ఇక ఈ ఒప్పందం టెక్నాలజీ రంగానికీ కీలకంగా మారుతోంది. జాయింట్ టెక్నాలజీ కోఆపరేషన్ కింద డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ విలువ చైన్, హైఎండ్ కంప్యూటింగ్ పరికరాలపై ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. GPUలు, డేటా సెంటర్ ఎక్విప్‌మెంట్ లాంటి టెక్ ఉత్పత్తులపై ట్రేడ్ పెరగనుంది. దీని వల్ల భారత కంపెనీలకు ఆధునిక టెక్నాలజీ తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా మధ్య పెరుగుతున్న నమ్మకం, భాగస్వామ్యానికి ఇది నిదర్శనమన్నారు. మేక్ ఇన్ ఇండియాకు ఇది బలాన్నిస్తుందని, రైతులు, MSMEలు, స్టార్టప్స్, యువతకు పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తీసుకువస్తుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇన్వెస్ట్‌మెంట్, టెక్నాలజీ భాగస్వామ్యం మరింత లోతుగా మారుతుందని కూడా స్పష్టం చేశారు. ఇక కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ ఫ్రేమ్‌వర్క్‌పై స్పందించారు. ఇది భారత ఎగుమతిదారులకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్‌ను మరింత సులభంగా తెరుస్తుందన్నారు. ముఖ్యంగా MSMEలు, రైతులు, మత్స్యకారులు ఈ ఒప్పందం వల్ల నేరుగా లాభపడతారని చెప్పారు. ఎగుమతుల పెరుగుదలతో లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశముందని వివరించారు.
మొత్తానికి ఇది ఒక ఇంటరిమ్ అగ్రిమెంట్ మాత్రమే. పూర్తి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు. కానీ భారత ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికా మార్కెట్‌లో అవకాశాలను విస్తరించే దిశగా వేసిన కీలక అడుగు. టారిఫ్‌లు తగ్గాయి. నాన్ టారిఫ్ అడ్డంకులు తగ్గుతున్నాయి. టెక్నాలజీ సహకారం పెరుగుతోంది. రైతులకు రక్షణ ఉంది. పరిశ్రమలకు ఊరట ఉంది. ఈ అన్ని అంశాల కలయికే ఈ ఇండియా అమెరికా ట్రేడ్ డీల్‌ను భారత్‌కు ఒక వ్యూహాత్మక గేమ్ చేంజర్‌గా మార్చుతోంది.
ALSO READ: మంచు కొండల నుంచి కారుతున్న రక్తం.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రకృతి రహస్యం!
