ఇది అభిమానం కాదు.. ఉన్మాదం..ఉ*గ్రవాదం.. బానిసత్వం..బుద్ధిలేని తనం! హీరోయిన్లు కనిపిస్తే ఎగబడతారా? పడిపడి మీదపడతారా? ఎగిరి ఎగిరి దూకుతారా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా? మొన్న నిధి అగర్వాల్.. నిన్న సమంత.. రేపు ఎవరు? భవిష్యత్‌లో ఇంకెవరు? ఇంకెమంది ఇబ్బంది పడాలి? ఈ దిక్కుమాలినతనానికి ముగింపే లేదా? అసలు అభిమానం చాటున వెర్రవేషాలు వేసే సంస్క్రతి ఎలా మొదలైంది? ఫ్యాన్స్.. ఇక మీరు మారరా? 
‘ది రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి కొద్దీ రోజుల ముందు నిధి అగర్వాల్ హాజరైంది. తన వర్క్‌ను ఫినిష్ చేసుకోని కారులో రిటర్న్ అవ్వాలనుకుంది. అయితే ఇంతలోనే అభిమానుల ముసుగులో పోకిరిగాళ్లు చుట్టుముట్టారు. ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. చివరకు అతికష్టం మీద కారెక్కి వెళ్లిపోయింది నిధి. ఇక ఇలాంటి పరిస్థితే సమంతకు ఎదురైంది. ఓ షాపింగ్ మాల్ ఈవెంట్‌కు సమంత హైదరాబాద్‌కు వచ్చారు. కార్యక్రమం ముగించుకున్న తర్వాత స్టేజ్‌పై నుంచి కారు వైపు వెళ్తుండగా ఫ్యాన్స్ ఆమెను భారీగా చుట్టుముట్టారు. ఆమెకున్న సెక్యూరిటి ఎంత ప్రయత్నించినా క్రౌడ్‌ను కంట్రోల్ చేయలేకపోయారు. అభిమానుల తోపులాట మధ్య సమంతకు అడుగు తీసి అడుగు వెయ్యడం కూడా కష్టంగా మారింది. చివరకు బౌన్సర్ల సాయంతో కారు ఎక్కగలిగారు.
ఇలాంటి చేదు అనుభవాలు నిధి, సమంతకి మాత్రమే ఎదురవ్వలేదు.. నిజానికి దశాబ్దాల నాటి నుంచి సినీతారల పరిస్థితి ఇంతే. హీరోయిన్లు ఎక్కడికి వెళ్లినా ప్రైవెసీనే ఉండదు. బాలీవుడ్ నటి జయ బచ్చాన్‌కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు నోటితో పాటు చేత్తో కూడా పనిచెప్పిన సందర్భాలున్నాయి. ‘క్యా కర్ రహే హె ఆప్’ అంటూ రెండు చెంపలు వాయించిన ఘటనలు కూడా ఉన్నాయి. మరికొందరు బాలీవుడ్ తారలకు ఫ్యాన్స్ ముద్దులు పెట్టబోయిన సీన్స్ కూడా ఉన్నాయి. 2024లో హైదరాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కాజల్ అగర్వాల్‌ను ఓ అభిమాని తాకరాని చోట టచ్ చేశాడు. సెల్ఫీల కోసం ఎగబడడం, హీరోయిన్లను చికాకు పెట్టడం, అదేదో ఘనకార్యం చేసినట్టు సోషల్‌మీడియాలో డబ్బా కొట్టుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది.
ఇది చాలా కాలంగా కొనసాగుతున్న ఒక ఉన్మాద ఫ్యాన్ కల్చర్‌కు కొన్ని ఉదాహరణలు మాత్రమే. హీరోయిన్లు అంటే అందరిలాంటి అమ్మాయిలు కాదన్న భావన.. వారేదో పబ్లిక్ ప్రాపర్టీ అన్నట్టు ఫీల్ అయ్యే తత్వం కలిగినవారు ఇలా దిగజారుతుంటారు. పబ్లిక్‌లో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయవచ్చన్న అహంకారంతో శారీరక హద్దులు కూడా దాటే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టేజ్‌లపై, జన సమూహాల మధ్య, కెమెరాల ముందు కూడా హీరోయిన్లు తమను తాము రక్షించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. చేసే వికృత చేష్టలు కెమెరాలో రికార్డవుతున్నాయని భయం కూడా చాలా మందికి లేకుండాపోయింది. అభిమానానికి, ఆకతాయితనానికి తేడా తెలియని వారు పెరిగిపోయారు. రోడ్డుపై కనిపించిన హీరోయిన్లను తమ హక్కుగా భావించడం.. నవ్వితే సరే అనుకోవడం… నవ్వకపోతే అహంకారం చూపించారంటూ ట్రోల్ చేయడం లాంటి మైండ్‌సెట్ కలిగిన వారు కూడా కనిపిస్తున్నారు.
అయితే ఇదంతా ఎందుకు జరుగుతోందనే ప్రశ్న కూడా చాలా ముఖ్యం. ఇది సమాజం నెమ్మదిగా పెంచుకున్న ఒక మానసిక వ్యాధి. సైకాలజిస్టులు దీన్ని సెలబ్రిటీ ఓనర్‌షిప్ మైండ్‌సెట్‌గా చెబుతున్నారు. అంటే ఫ్యాన్స్ తాము అభిమానించే వ్యక్తిపై ఒక రకమైన హక్కు ఉందని భావించడం. ఆమె పబ్లిక్‌లో కనిపిస్తే, తాకవచ్చని, దగ్గరకి వెళ్లవచ్చని, ఫొటో తీయవచ్చని అనుకోవడం. సోషల్ మీడియా ఈ తీరును మరింత ప్రమాదకరంగా మార్చింది. రీల్స్, సెల్ఫీలు, వైరల్ వీడియోల కోసం ఒక్క క్షణం హద్దులు మరిచిపోతున్నారు.
హీరోయిన్‌ని తాకడం, ఆమెను తొయ్యడం, ఆమె అసౌకర్యాన్ని కెమెరాలో క్యాప్చర్ చేయడం కూడా కొందరికి కంటెంట్‌గా మారిపోయింది. ఆ వీడియోకి లైక్స్ వస్తాయా, షేర్లు పెరుగుతాయా అన్నదే లక్ష్యం. అక్కడ ఉన్న హీరోయిన్ కూడా ఓ మహిళే అనే భావన పూర్తిగా మాయమవుతోంది. ఇక ఈ సమస్య ఇక్కడితో ఆగిపోదు. ఎందుకంటే చాలాసార్లు ఇలాంటి వికృత ప్రవర్తనకు కూడా మద్దతు లభిస్తుంది. ఈవెంట్ నిర్వాహకులు జనాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారు. భద్రత సరిపోదు. పోలీసులు కూడా చాలా సందర్భాల్లో ఇది చిన్న విషయం అన్నట్టు చూస్తారు.
బాధితురాలు స్పందిస్తే ఆమె వేసుకున్న దుస్తులనే సమస్యగా చిత్రీకరిస్తారు. స్పందించకపోతే వారి మౌనమే ఈ ఉన్మాదానికి ఫ్యూయల్‌గా మారుతుంది. అయితే ఇక్కడ కేవలం అభిమానులను మాత్రమే నిందిస్తే సరిపోదు. సినిమాల్లో అవసరం లేని చోట కూడా హీరోయిన్ బాడీ పార్ట్‌లను వివిధ కెమెరా యాంగిల్స్‌లో చూపిస్తూ ఆమెను అబ్జక్టిఫై చేయడం సాధారణమైపోయింది. కొంతమంది పండ్లు, కూరగాయాలతో హీరోయిన్లపై కంపేర్ చేస్తూ బాడీ పార్ట్స్‌ను చూపిస్తుంటారు. ఇలాంటి సినిమా సీన్లు చూసిన ప్రజలు కూడా హీరోయిన్లు కేవలం ఏదో గ్లామర్ కోసమే ఉన్నారన్న భావనలో బతుకుతుంటారు.
మొత్తంగా చూస్తే ఇక్కడ ఒక్కటే విషయం అర్థమవుతోంది. హీరోయిన్లు పబ్లిక్ ప్రాపర్టీ అనే ఆలోచనే ఈ నీచమైన బుద్ధి పెరగడానికి ప్రధాన కారణం. ఈ బుద్ధిని పెంచడంలో ఇండస్ట్రీ నుంచి సమాజం వరకు చాలా మంది బడాబాబుల పాత్ర కూడా కనిపిస్తోంది. లేదు..లేదు.. ఇదంతా ఫ్యాన్స్ వెర్రితనం మాత్రమే.. హీరోయిన్‌ను శృంగార తారగా, సీన్‌తో సంబంధం లేకుండా అబ్జక్టిఫై చేయవచ్చని అనుకుంటే ఈ సమస్యకు ముగింపు ఉండదనే అనుకోవచ్చు.
ఇక ఇదంతా ఏ ఇద్దరి హీరోయిన్ల బాధ కాదు… ఇది ప్రతి వేదికపై నిలబడే ప్రతీ మహిళ కథ. ఈ రోజు సెలబ్రిటీ.. రేపు మీ ఇంటి అమ్మాయి కూడా కావచ్చు. ఇంతకీ అభిమానం అంటే గౌరవమా? లేదా ఉన్మాదమా? ఈ తేడా ఇప్పటికైనా అర్థం కాకపోతే, ఫ్యాన్ కల్చర్ అనేది ఏదో ఒక రోజు పూర్తిగా అసహ్యంగా మారిపోవడమైతే ఖాయం!
