Suvendu Adhikari: బంగ్లాదేశ్‌ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్‌ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!

Suvendu Adhikari Illegal Immigrants explained

Suvendu Adhikari Illegal Immigrants

కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది..! జవాన్లు కాపలా కాస్తూనే ఉంటారు…! కానీ పదంటే పది నిమిషాల్లో మన దేశంలోకి చొరబడిపోతారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన గడ్డపైకి వచ్చేస్తారు…! దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దర్జాగా అక్రమ చొరబాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది.

మమత పాలనపోయి సువేందు పగ్గాలు చేపట్టడంతో వలసదారులు పెట్టేబేడా సర్దుకుని పారిపోతున్నారు. ప్రభుత్వ కఠిన చర్యలకు తోడు.. డిటెన్షన్ క్యాంపులకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుల వద్ద బారులు తీరుతున్నారు. ఇంతకాలం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను చూసీచూడనట్లుగా ఎలా వదిలేసిందో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. దళారులు.. స్థానిక నేతలు.. అందరూ కలిసి భారత్ సరిహద్దు ప్రాంతాలను అక్రమ వలసదారులతో నింపేశారు.

×
×
Ad

స్వచ్ఛందంగా వెళ్లిపోతున్నారు:

పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అరెస్టులు చేసి డిటెన్షన్ కేంద్రాలకు తరలిస్తారనే భయంతో వందలాది మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు ప్రాంతాలు, ట్రాన్సిట్ టెర్మినల్స్ వద్దకు చేరుకుంటున్నారు. తమ జీవితకాలం మొత్తం భారత్‌లోనే గడిపిన వారు సైతం ఇప్పుడు స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం మారడం.. ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ వలసదారులకు ఎటువంటి ఆశ్రయం కల్పించకూడదని నిర్ణయించడంతో.. అక్రమ వలసదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పైగా అక్రమ వలసదారులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను కూడా నిలిపివేస్తోంది. పట్టుబడిన వారిని కోర్టుల్లో ప్రవేశపెట్టకుండా నేరుగా సరిహద్దుల్లోని బీఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

10నిమిషాల్లో చొరబడేలా ఏర్పాట్లు:

భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు బంగ్లాదేశీయులు అనేక అక్రమ మార్గాలను ఎంచుకుంటుున్నారు. దళారుల సాయంతో నదులు దాటుకుంటూ, చీకటి పడిన తర్వాత సరిహద్దులు దాటినట్లు పలువురు బంగ్లాదేశీయులు స్వయంగా అంగీకరించారు. బీఎస్‌ఎఫ్ బలగాల గస్తీలో చిన్న గ్యాప్ దొరికినా చాలు.. దళారులు కేవలం 10 నిమిషాల్లోనే తమను భారత్‌లోకి చొరబడేలా ఏర్పాట్లు చేసేవారని ఒక వ్యక్తి చెప్పాడు. రాత్రి వేళల్లో బీఎస్‌ఎఫ్ కదలికలను గమనించి, దళారులు స్కెచ్ వేసేవాళ్లు. భారత్‌లోకి రప్పించినందుకు ఒక్కొక్కరి నుంచి 7 నుంచి 8 వేల రూపాయలు తీసుకునేవాళ్లు. సరిహద్దుల్లో సైన్యం ఉన్నప్పటికీ ఏజెంట్‌కు 20 వేల రూపాయలు చెల్లించి భారత్‌లోకి ప్రవేశించినట్లు అక్రమ వలసదారులు చెబుతున్నారంటే.. బోర్డర్‌లో ఏ స్థాయి దందా జరిగేదో అర్థం చేసుకోవచ్చు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న 4,096 కిలోమీటర్ల సరిహద్దుల్లోని నదీ ప్రాంతాలు, వ్యవసాయ భూములను ఈ మానవ అక్రమ రవాణా ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి.

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత వీరికి స్థానికంగా ఒక బలమైన రాజకీయ నెట్‌వర్క్ సహాయం అందించింది. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన కొందరు కార్యకర్తలు వీరికి గుర్తింపు కార్డులు.. ఇతర పత్రాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషించారని స్వయంగా వలసదారులే చెబుతున్నారు.

మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు.. ఓటర్ ఐడీలతో పాటు కేవలం రెండు మూడు వేల రూపాయలకే ఆధార్ కూడా సంపాదించినట్లు వాళ్లే చెబుతున్నారు. వీళ్లు స్థానికంగా ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా లక్ష్మీర్ భండార్ వంటి పథకాల ద్వారా నగదు బదిలీ ప్రయోజనాలను కూడా పొందారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. అక్రమంగా నివసిస్తున్న వారికి ఆశ్రయం ఇస్తే ఇళ్ల యజమానులకు 2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడుతుందన్న కఠిన నిబంధనలతో ఎవరూ ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదు.

అక్రమ వలసదారుల వ్యవహారంపై అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ తిరిగి వెళుతున్న వలసదారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే BSFకు చికెన్ నెక్ ప్రాంతంతో సహా 600 హెక్టార్ల భూమిని అప్పగించినందుకు సీఎం సువేందు అధికారిని ఆయన అభినందించారు. మరోవైపు మేఘాలయ సరిహద్దుల్లో కూడా ఫెన్సింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 4,096 కి.మీ సరిహద్దులో ఇప్పటికే 79 శాతం ఫెన్సింగ్ పూర్తయినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

పదేళ్ల వయసులో భారత్‌కు వచ్చి దశాబ్దాలుగా వడ్రంగులు, మేస్త్రీలు, గృహ కార్మికులుగా పనిచేస్తున్న ఎంతో మంది ఇప్పుడు సొంతూళ్లకు పయనమయ్యారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాట్లను ప్రోత్సహించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై, భద్రతా వ్యవస్థపై ఎంతటి భారం పడుతుందో మమతా బెనర్టీ ప్రభుత్వం గుర్తించలేకపోయింది.

: ఫణి కుమార్ (NTV DIGITAL)