NTV Telugu Site icon

Kim : చంపేస్తావా కిమ్ మావా..!?

Kim News

Kim News

Story Behind North Korea Nuclear Weapons: ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వాడు ఎవడి మీద విసురుతాడో.. ఏం చేస్తాడోననే భయం ఉంటుంది. అలాంటి పిచ్చోడు ఒక దేశానికి అధ్యక్షుడైతే..? ఆ అధ్యక్షుడి చేతిలో ఒక న్యూక్లియర్ బాంబ్ ఉంటే..? పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..! వింటుంటేనే ఒళ్లు జలదరించిపోతోంది కదా..! మీకే కాదండీ.. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఇదే టెన్షన్.. ఇంతకూ ఆ అధ్యక్షుడెవరు..? ఆ దేశమేంది..?

ఇప్పటికే మీకు అతనెవరో అర్థమైపోయి ఉంటుంది.. ఎస్.. మీరు ఊహించినట్లే అతను కిమ్ జోంగ్ ఉన్. ఉత్తర కొరియా అధ్యక్షుడు. ప్రపంచంలో పలు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కిమ్.. ఇప్పుడు మరో టెన్షన్ కు తెరలేపారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. అతని నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. ఎప్పడు ఎవరి మీద దాడి చేస్తారో ఊహించలేని పరిస్థితి. ప్రపంచం నుంచి ఎన్ని హెచ్చరికలు వచ్చినా అతను లెక్క చేయడు. తనకు నచ్చింది తాను చేసుకుంటూ పోతుంటాడు. తాజాగా అణ్వాయుధాల తయారీలో కీలకమైన యరేనియం శుద్ధి కర్మాగారానికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టాడు. ఆ ఫోటోల్లో కిమ్ కూడా ఉన్నాడు. ఇది ప్రపంచాన్ని కంగు తినేలా చేసింది.

వాస్తవానికి ఉత్తర కొరియా ఎంతోకాలంగా అణ్వాయుధాల తయారీలో నిమగ్నమై ఉంది. దీంతో పలు ప్రపంచ దేశాలు ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించాయి. అయినా కిమ్ మాత్రం లెక్క చేయట్లేదు. తమ దేశ అణుసంపత్తిని గణనీయంగా పెంచుకోబోతున్నట్టు గతంలో కిమ్ వెల్లడించారు. ఇప్పుడు విడుదలైన ఫోటోలను చూస్తే కిమ్ అన్నంత పనీ చేస్తున్నట్టు అర్థమవుతోంది. యురేనియం ఉత్పత్తి ఎలా జరుగుతోందో స్వయంగా తెలుసుకునేందుకు కిమ్ ఆ ప్లాంట్ ను సందర్శించినట్లు తెలుస్తోంది. అధికారుల పనితీరుపై కిమ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ దేశ వార్తాకథనాలు వెల్లడించాయి.

అసలు ఉత్తర కొరియా అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని ఎందుకు అనుకుంది..? ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా కిమ్ మాత్రం ఎందుకు దూకుడుగానే ముందుకెళ్తున్నారు..?
ఉత్తర కొరియా అణ్వాయుధ చరిత్ర తెలుసుకోవాలంటే కాస్త వెనక్కు వెళ్లాలి. 1950 నుంచి 1953 మధ్య కాలంలో కొరియా యుద్ధం జరిగింది. అప్పుడే కొరియా రెండుగా విడిపోయింది. దక్షిణ కొరియా నుంచి తమను తాము కాపాడుకోవాలంటే కచ్చితంగా తమకు కూడా అణ్వాయుధాలు అవసరమని ఉత్తర కొరియా అప్పుడే భావించింది. ఇందుకు రష్యా సహకరించింది. 1980 నుంచి అణ్వాయుధాలకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవడం మొదలు పెట్టింది.

అయితే ఉత్తరకొరియా అణ్వాయుధాలను సమకూర్చుకోవడంపై పలు దేశాలు ఆక్షేపణ తెలిపాయి. కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో తాత్కాలికంగా పక్కన పెట్టింది.
కొరియా చేతిలో అణు బాంబు ఉండడం అంటే అది పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టే అని పలు ప్రపంచ దేశాలు భయపడిపోయాయి. వెంటనే ఉత్తర కొరియాకు ముకుతాడు వేయాలని నిర్ణయించాయి. ఉత్తర కొరియాను దారికి తెచ్చుకోవాలంటే ముందు రష్యాకు చెక్ చెప్పాలని భావించాయి. అందుకే అణ్వాయుధ నియంత్రణ మండలి ద్వారా కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో ఉత్తర కొరియా దిగి వచ్చింది. 1994లో అణ్వాయుధ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు వాటి తయారీకి స్వస్తి చెప్పింది. అయితే ఇది ఎంతో కాలం మాట మీద నిలబడలేదు. 2003లో అణ్వస్త్రాల వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి బయటికొచ్చేసింది.

ఒప్పందం నుంచి బయటికొచ్చిన తర్వాత కిమ్ రెచ్చిపోయారు. అణ్వస్త్రాలను సమకూర్చుకోవడంలో దూకుడు పెంచారు. తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రయత్నించారు.
అణ్వస్త్రాల వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి 2003 నుంచి బయటికొచ్చిన తర్వాత 2006లో తొలి అణ్వాయుధాన్ని ప్రయోగించింది ఉత్తర కొరియా. దీనిపై పలు ప్రపంచదేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా తీవ్రంగా స్పందించింది. ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలు విధించింది. పలు దేశాలు ఉత్తర కొరియాతో సంబంధ బాంధవ్యాలను తెంచేసుకున్నాయి. అయితే కిమ్ మాత్రం అవేం పట్టించుకోలేదు. 2009 నుంచి 2017 మధ్యకాలంలో పలుమార్లు అణ్వాయుధాలను పరీక్షించారు. మిసైల్స్ టెస్ట్ చేశారు. దీంతో ఐక్యరాజ్య సమితి మరిన్ని ఆంక్షలు విధించింది.

ప్రపంచమంతా తమను వెలి వేయడం, ఆంక్షలతో ఆర్థికంగా చితికిపోవడంతో కిమ్ కాస్త మెత్తబడ్డారు. అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేందుకు అంగీకరించారు. ఉత్తర కొరియా దూకుడును అడ్డుకోకపోతే ప్రపంచానికే ముప్పు తప్పదని భావించిన ఐక్యరాజ్యసమితితో పాటు పలు ప్రపంచదేశాలు ఆ దేశాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. దీంతో కిమ్ దారికొచ్చారు. 2018లో అమెరికా అధ్యక్షుడితో కిమ్ సమావేశమయ్యారు. అణ్వాయుధాలకు స్వస్తి చెప్తామని సంతకాలు చేశారు. మరోవైపు ఉత్తర కొరియాతో ఉన్న సమస్యలను పక్కన పెట్టి ఆ దేశంతో సత్సంబంధాల కోసం దక్షిణ కొరియా, చైనా కూడా ముందడుగు వేశాయి.

అయితే అన్నీ చెప్పినట్టు చేస్తే అతను కిమ్ ఎందుకవుతాడు..? మళ్లీ ప్లేట్ ఫిరాయించేశాడు.. ప్రపంచ దేశాల ఆంక్షలను పట్టించుకోకుండా 2020లో కిమ్ మళ్లీ అణ్వాయుధాలను పరీక్షించడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో వీటిని పరీక్షిస్తూనే వస్తున్నాడు. అత్యాధునిక క్షిపణులను తయారు చేసి వదులుతున్నాడు. ఇంతటితో ఆగకుండా సైన్స్ అండ్ టెక్నాలజీని వినియోగించుకుని సొంతంగా అణు సామాగ్రిని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా యురేనియం శుద్ధి కర్మాగారాన్ని సందర్శించాడు. వాస్తవానికి ఉత్తర కొరియా యోంగ్ బ్యోన్ ప్రాంతంలో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని సొంతంగా నిర్మించుకుంటోందనే విషయం కొంతకాలం కిందట బయటికొచ్చింది. అయితే అది నిర్ధారణ కాలేదు. ఇప్పుడు కిమ్ స్వయంగా అందులో పర్యటిస్తూ ఫోటోలు విడుదల చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది.

ఉత్తర కొరియా అణ్వాయుధాలపై దాయాది దేశం దక్షిణ కొరియా తీవ్ర ఆందోళన చెందుతోంది. కిమ్ అసలే మూర్ఖుడు.. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అందుకే ఈ టెన్షన్. ఉత్తర కొరియా అణ్వాయుధాలను సమకూర్చుకోవడాన్ని దక్షిణ కొరియా తీవ్రంగా ఖండించింది. దీనిపై వెంటనే ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. మరోవైపు.. ఇది యోంగ్ బ్యోన్ న్యూక్లియర్ కాంప్లెక్సేనా లేకుంటే మరొకటా అనే దానిపై సందిగ్ధత మొదలైంది. ఉత్తర కొరియా యోంగ్ బ్యోన్ కాంప్లెక్స్ తో పాటు మరొక యురేనియం ప్లాంట్ ను నిర్మించి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలకు రష్యా, చైనా సహకరిస్తున్నాయని.. ముందు వాటికి చెక్ పెట్టాలని కోరుతున్నారు. ఉత్తర కొరియా వద్ద ఇప్పటి వరకూ ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో అధికారికంగా తెలీదు. అయితే సుమారు 50 వరకూ ఉండొచ్చని అంచనా. అంతేకాదు.. మరో 50 అణ్వాయుధాలకు సరిపడా సామాగ్రి కూడా దాని ఉండొచ్చని భావిస్తున్నారు.

మరి కిమ్ ఈ అణ్వాయుధాలను ఏం చేస్తారనేదే ఇప్పుడు తలెత్తుతున్న పెద్ద ప్రశ్న. కేవలం తన శతృదేశాలను భయపెట్టేందుకే ఇలా బలప్రదర్శన చేస్తున్నారా.. లేకుంటే నిజంగానే అణ్వాయుధాలను ప్రయోగించే సాహసం చేస్తారా.. అనేది అంతు చిక్కట్లేదు. కిమ్ వైఖరి తెలిసిన వాళ్లు ఏదైనా జరగొచ్చని భయపడుతున్నారు. మరి కిమ్ మదిలో ఏముంది..? మున్ముందు ఏం జరుగుతుంది..? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Show comments