NTV Telugu Site icon

Tollywood: కాస్టింగ్ కౌచ్…మనోళ్లు సుద్దపూసలా..?

Tollywood Casting Couch

Tollywood Casting Couch

Special Story on Tollywood Casting Couch : మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం కలిగిస్తోంది. ఈ నివేదిక తర్వాత మిగిలిన సినిమా ఇండస్ట్రీలు కూడా ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగిక వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని భావించిన ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అది నివేదిక కూడా ఇచ్చింది. మరి ఇప్పటి వరకు ఆ నివేదిక ఎందుకు బయటకు రాలేదు..? దీని వెనుక ఎవరున్నారు..? టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై తారల మాటేంటి..?

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొత్తకాదు. ఎంతోకాలంగా దీనిపై చర్చ జరుగుతున్నా.. బయట పెట్టేందుకు చాలామందికి దైర్యం సరిపోదు. అయితే ఆరేళ్ల కిందట శ్రీరెడ్డి ఈ సాహసం చేసింది. అప్పట్లో ఇది సంచలనం కలిగించింది. 2018 ఏప్రిల్ 7న సినీ నటి శ్రీరెడ్డి టాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేశారు. కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులకు నిరసనగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనానికి దారి తీసింది. శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించాలని మహిళా సంఘాలు, స్వచ్చంధ సంస్థలు డిమాండ్ చేశాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ సమాచార ప్రసార శాఖకు నోటీసులు ఇచ్చింది. విమెన్ అండ్ ట్రాన్స్ జెండర్స్ ఆర్గనైజేషన్ జాయింట్ కమిటీ.. అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను కలిసి విచారణ జరపాలని కోరింది. మరోవైపు వి.సంధ్యారాణితో పాటు పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు 2018 సెప్టెంబర్ లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరపిన హైకోర్టు.. సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, తదితర అంశాలపై ఉన్నతస్థాయి కమిటీని వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 2019 ఏప్రిల్ లో తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

2019లో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ టాలీవుడ్ లో మహిళల స్థితిగతులపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసులు కూడా చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నాటి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రామ్మోహన్ రావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 25 మంది సభ్యులుగా ఉన్నారు. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డి, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో దర్శకుడు సుధాకర్ రెడ్డి తదిదరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, వారికి దక్కుతున్న గౌరవ వేతనాలు, షూటింగ్ సమయాల్లో వారి భద్రత.. తదితర అంశాలపై కమిటీ సుదీర్ఘ విచారణ చేపట్టింది. 2022 జూన్ 1న కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీ సభ్యులతో ఫాలో అప్ మీటింగ్స్ కూడా నిర్వహించింది. అయితే ఇప్పటికీ ఈ కమిటీ నివేదిక మాత్రం బయటకు రాలేదు.

మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో .. టాలీవుడ్ కమిటీ నివేదికను కూడా బయటపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. టాలీవుడ్ లో మహిళల స్థితిగతులపై 2019 కమిటీ రిపోర్టును బయటపెట్టాలని ప్రముఖ నటి సమంత ప్రభుత్వాన్ని కోరారు. టాలీవుడ్ లో మహిళలకు మద్దతుగా 2019లో ఏర్పాటైన వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రకటనకు మద్దతుగా సమంత ట్వీట్ చేశారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రకటనకు యాంకర్ ఝాన్సీ కూడా మద్దతు తెలిపారు. అయితే నాడు కమిటీలో ఉన్న పలువురు సభ్యులు నివేదికను ఇంతవరకూ బయటపెట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొంతమంది అసలు కమిటీ నివేదిక ఇచ్చిన విషయమే తెలియదన్నారు. ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన విషయంపై తనకు అవగాహన లేదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. రెండేళ్లూ పూర్తయినా నివేదిక ఎందుకు బయటపెట్టలేదని కమిటీ సభ్యురాలు కొండవీటి సత్యవతి ప్రశ్నించారు.

మలయాళ సినీ పరిశ్రమతో పోల్చితే టాలీవుడ్ లోనే కాస్టింగ్ కౌచ్ ఎక్కువనేది కొంతమంది మహిళల ఆరోపణ. జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత, అంతకు ముందు కూడా పలువురు ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ ఎక్కువ మంది ఈ అంశంపై మాట్లాడేందుకు సుముఖంగా లేరు. సినిమా ఇండస్ట్రీలలో లైంగిక వేధింపులు చాలా సహజమని.. ఆ విషయానికొస్తే తమిళ ఇండస్ట్రీతో పోల్చితే టాలీవుడ్ లోనే ఎక్కువ వేధింపులు ఉంటాయని ప్రముఖ నటి షకీలా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదన్నారు. సినిమా పరిశ్రమలో మహిళలపై వేధింపులు ఎలా ఉంటాయో ప్రముఖ నటి మాధవీలత వెల్లడించారు. నేరుగా ఎవరూ తమతో గడపాలని కోరరని.. మేనేజర్ల ద్వారా సందేశాలు పంపిస్తారని తెలిపారు. వాళ్లకు ఎస్ చెప్తే ఒకలా.. నో చెప్తే మరోలా ట్రీట్ చేస్తారని చెప్పారు. నో చెప్పిన వాళ్ల గురించి ఇండస్ట్రీ మొత్తానికి చేరవేస్తారని.. ఆ అమ్మాయికి పొగరెక్కువ.. నటించడం రాదు.. సమయానికి రాదు.. ఇలాంటి చీప్ ట్రిక్స్ తో ఒక ముద్ర వేస్తారని మాధవీలత చెప్పారు. దీంతో క్రమంగా అవకాశాలు సన్నగిల్లుతాయన్నారు. ఇలా అవకాశాలు కోల్పోయిన వాళ్లెంతో మంది ఉన్నారని ఆమె అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో అనేక అవలక్షణాలున్నాయనే సంగతి అందరికీ తెలుసు. అయితే వాటిని బయట పెట్టేందుకు మాత్రం ఎవరూ సాహసం చేయట్లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. టాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులు, వాళ్ల భద్రతకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సుదీర్ఘంగా విచారణ జరిపింది. అయితే కమిటీ ముందుకొచ్చి సమస్యలు చెప్పిన వాళ్లు చాలా తక్కువ. అది కూడా చిన్నాచితకా నటులు మాత్రమే ముందుకొచ్చి కమిటీ ముందు తమ సమస్యలను చెప్పుకున్నారు. పెద్ద తారలెవరూ కమిటీ ముందుకు రాలేదు.. ఎలాంటి సమస్యలూ చెప్పలేదు. దీన్నిబట్టి ఇండస్ట్రీ కొంతమంది పెద్దల గుప్పిట్లో ఉందని అర్థమైందని కమిటీ సభ్యురాలు ఒకరు వెల్లడించారు. కొంతమంది నటులు సర్దుకుపోవడం వల్ల సమస్యలు బయటకు రావన్నారు. అలాంటి వాళ్లకు అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని.. అలా కమిట్ కాలేని వాళ్లే ఇబ్బందులు పడుతున్నారని ఆవిడ తెలిపారు. ఇలాంటి విషయాలను బయటపెడితే తమ కెరీర్ నాశనం అవుతుందనే భయం కూడా చాలా మందిలో ఉందని.. అందుకే వాళ్లు బయటకు రావట్లేదన్నారు.

సినిమా ఇండస్ట్రీ ఎంతో మందికి కలల ప్రపంచం. అందులోకి వెళ్లాలని.. ప్రేక్షకులను అలరించాలని.. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఎంతోమంది కలలు కంటుంటారు. అయితే అక్కడికి వెళ్లాకే లోతెంతో తెలుస్తుంది. కానీ ఒక్కసారి ఆ ఊబిలోకి వెళ్లాక బయటకు రాలేని పరిస్థితి. బయటకు వచ్చి నోరు తెరిస్తే.. అంతటితో కెరీర్ ఖతం. అందుకే సర్దుకుపోతూ కాలం గడపాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితులున్నచోట ఎన్ని కమిటీలు వేసినా.. ఎన్ని నివేదికలు ఇచ్చినా ఉపయోగం ఉంటుందని ఆశించలేం.