NTV Telugu Site icon

Telugu Vs Tamil: తమిళ థియేటర్ల విషయంలో టాలీవుడ్ కి అన్యాయం?

Theatres

దీపావళి సందర్భంగా తెలుగులో లక్కీ భాస్కర్, క సినిమాలతో పాటు తమిళం నుంచి అమరన్ సినిమాతో పాటు కన్నడ సినీ పరిశ్రమ నుంచి భగీర అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ కావడంతో మలయాళంలో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో కూడా ఆయనకు మార్కెట్ ఉండటంతో అక్కడ కూడా కాస్త థియేటర్లు దక్కాయి. కానీ పాన్ ఇండియా సినిమాగా తీసుకు రావాలనుకున్న కిరణ్ అబ్బవరం క సినిమాకి మాత్రం తమిళనాట థియేటర్లు దక్కలేదు. కేరళలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి థియేటర్లో ఆయన సినిమా నేరుగా రిలీజ్ అవుతుంది కాబట్టి పోటీగా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించి వెనక్కి తగ్గారు. అయితే తమిళ నాడులో తెలుగు సినిమాకి థియేటర్లు ఇచ్చే విషయం మీద సినిమా రిలీజ్ ముందే కిరణ్ అబ్బవరం మాట్లాడారు. ఎందుకో తాను ఆ విషయంలో సంతృప్తిగా లేనని చెప్పుకొచ్చారు.

ఈ రోజు సినిమా రిలీజ్ అయింది. తెలుగులో సూపర్ హిట్ టాక్ వచ్చింది అయినా సరే తమిళంలో థియేటర్లు దొరుకుతున్నాయా అంటే లేని పరిస్థితి నెలకొంది. అయితే అక్కడి నుంచి వచ్చిన సినిమాలకు మాత్రం తెలుగులో బ్రహ్మరథం పడుతున్నారు. నిజానికి శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన అమరన్ సినిమా బావుంది. మామూలుగానే దానికి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. సూపర్ హిట్ టాక్ రావడంతో ఇంకా థియేటర్లో పెంచుతున్నారు కానీ తెలుగు సినిమాని తమిళనాడులో తెలుగు వర్షన్ ఐదు షోలు వేసుకోవాలి అన్నా సరే థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తమిళ నాడులో తెలుగు సినిమాలకు చిన్న చూపు చూస్తున్నారా? అవమానిస్తున్నారా? అంటే అవునని చెప్పలేము కాదని చెప్పలేము.

ఎందుకంటే కిరణ్ కి అక్కడ మార్కెట్ లేదు. ఆయన అడిగినట్టు కేవలం 5 షోస్ ఇవ్వాలి అన్నా సరే అక్కడ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న అమరన్ సినిమాతో పాటు బ్లడీ బగర్ అనే మరో సినిమా ఏదో ఒకటి తీసి ఇవ్వాలి. అలా ఇస్తే హౌస్ ఫుల్ అవుతుందా అంటే అవునని చెప్పలేము కాదని చెప్పలేము. ఆ ఏరియాలో తెలుగు వాళ్ళు ఉంటే, సినిమా వేసిన సంగతి వాళ్ళకి తెలిసి ఉంటే, సెలవు రోజు అయితే హౌస్ ఫుల్ అవ్వచ్చు లేదంటే అవ్వకపోవచ్చు. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సినిమాలను తీసి క తెలుగు వర్షన్ కి ఎందుకు ఇవ్వాలి అనేది తమిళ వాళ్ళ ఆలోచన అయి ఉండవచ్చు. కాబట్టి తెలుగు వాళ్ళు అయినా తమిళం వాళ్ళు అయినా సినిమాల విషయంలో చేసేది వ్యాపారమే. కేవలం ప్రేక్షకులు మాత్రమే సినిమాలను ఒక వినోదంగా చూస్తారు. థియేటర్ల యజమానులు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి అది ఒక వ్యాపారంగానే భావిస్తారు.

తెలుగు సినిమా వేస్తే కోట్లకు కోట్లు వస్తాయని తెలిస్తే హ్యాపీగా థియేటర్లు ఇస్తారు. వాళ్ళు థియేటర్లు ఇవ్వకుండానే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకి అక్కడ మంచి కలెక్షన్స్ వచ్చాయా? కాబట్టి ఇక్కడ ఎవరినో నిందించడం మానేసి సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్లడం బెటర్. అమరన్ సినిమాని కూడా నితిన్ తండ్రి రిలీజ్ చేశారు కాబట్టి మంచి స్క్రీన్స్ దొరికాయి. అదే నేరుగా తమిళ నిర్మాతలే రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నించి ఉంటే ఈ స్థాయిలో స్క్రీన్స్ దొరికేవి కాదేమో. కాబట్టి కిరణ్ అబ్బవరం ఈ విషయంలో ఒక అనుభవంగా ఫీల్ అయి తమ రాబోతున్న సినిమాల విషయంలో తమిళంలో ఏదో ఒక పెద్ద నిర్మాతతో మంచి సంబంధం ఏర్పరచుకొని ఆయన ద్వారా ముందుకు వెళ్లడం మంచిది. కిరణ్ అబ్బవరం అని మాత్రమే కాదు ఎవరైనా సరే ఏ భాషలో అయినా రిలీజ్ చేయాలంటే సొంతంగా ప్రయత్నాలు చేయడం కాకుండా అక్కడ ఉన్న ప్రముఖ వ్యక్తులతో రిలీజ్ చేయించే ప్రయత్నం చేస్తే కొంతవరకు అవకాశం ఉండొచ్చు.

Show comments