Site icon NTV Telugu

SRH: ప్రాక్టీస్ మానేసి భార్యలతో మాల్దీవ్స్ వెళ్తే ఎలా గెలుస్తారు కావ్య?

Srh'

Srh'

గుజరాత్‌పై ఓటమితో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడగా అందులో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. అయితే హైదరాబాద్‌కు ఇంకా ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోలేదు. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దాంతో పాటు మెరుగైన రన్ రేట్ మైంటైన్ చేయాలి. గతంలో ఆర్సీబీ ఇలానే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. కానీ సన్ రైజర్స్ పరిస్థితి చూస్తుంటే ఏదో టైం పాస్ కోసమే ఆడుతున్నట్లు కనిపిస్తుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగి పేలవ ప్రదర్శనతో అపజయాలు ఎదురైన తర్వాత చెన్నైపై గెలిచి ప్లేఆఫ్స్‌పై ఆశలు పెంచింది. ఆ తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టి ప్రాక్టీస్ సెషన్‌లో కష్టపడాల్సిందిపోయి మాల్దీవ్స్‌కు వెళ్లి చిల్ అయ్యారు మన కాటేరమ్మ కొడుకులు.

Read More:Sailesh Kolanu: సిడ్నీ వెళ్తున్నా.. ఆరునెలలు అక్కడే!

ఏదో హనీమూన్‌కు వెళ్లినట్లు భార్యలతో కలిసి వెళ్లారు. అక్కడ ఏమైనా ప్రాక్టీస్ లాంటిదేమైనా చేశారా అంటే మందు తాగుతూ చిందేశారు. బ్యాట్ మూలాన పడేసి వాలీబాల్ ఆడుతూ బీచ్‌లో సేద తీరారు. విశేషమేంటంటే వాళ్లేదో పొడిచినట్లు తమ ఆటగాళ్లను కావ్య మారన్ దగ్గరుండి సాగనంపింది. అసలు కావ్య మారన్ ఏ ఉద్దేశంతో తమ ఆటగాళ్లను మాల్దీవ్స్‌కు పంపించిందోనని క్రికెట్ విశ్లేషకులు తలలు పట్టుకున్నారు. భారీ యాక్షన్ ప్లాన్‌తో తిరిగి వస్తామని కట్టింగ్ ఇచ్చారు. వారం గ్యాప్ తర్వాత జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై సమిష్టిగా చేతులెత్తేశారు. అభిషేక్ శర్మ మినహా ఎవరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ట్రావిస్ హెడ్ అలా వెళ్లి ఇలా వచ్చాడు. క్లాసెన్, నితీష్ రెడ్డి, ఇషాన్ కిషన్ 20 పరుగులకే పరిమితమయ్యారు. చివర్లో ప్యాట్ కమిన్స్ ధాటిగా ఆడినప్పటికీ అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సరే బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఏమైనా సాధించారా అంటే అదీ లేదు. గుజరాత్ ఆరంభం నుంచే ఊచకోత మొదలుపెట్టింది. రషీద్ ఖాన్ మూడు ఓవర్లేసి 50 పరుగులు సమర్పించుకున్నాడు.

Read More:Saif Ali Khan: ఆదిపురుష్ చూపించి.. కొడుక్కి సారీ చెప్పిన సైఫ్

మిగతా స్పెల్‌లలోనూ ధారాళంగా పరుగులు వచ్చాయి. ఇక ఫీల్డింగ్‌లోనూ మనోళ్లు తేలిపోయారు. పలు క్యాచ్‌లను చేజార్చుకున్నారు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ క్యాచ్ విషయంలో రషీద్ ఖాన్ చిరుతలా పరుగెత్తి కష్టతరమైన క్యాచ్‌ను అందుకుని సన్ రైజర్స్‌ను చావుదెబ్బ కొట్టాడు. ఇలా గుజరాత్ సమిష్టి ప్రదర్శనతో విజయం వైపుకు దూసుకెళ్తుంటే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సన్ రైజర్స్ ప్రాక్టీస్ గాలికొదిలేసి సమిష్టిగా విఫలమైంది. దీనిపై ఫ్యాన్స్ కూడా గట్టిగానే ట్రోల్స్ చేస్తున్నారు. మాల్దీవ్స్ ఏం కర్మ.. అండమాన్‌కు పంపించబోయావా అంటూ కావ్య మారన్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయకుండా మందు పార్టీ ఏందిరా బ్లడీ ఫూల్స్ అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ఏదేమైనా సన్ రైజర్స్ ప్రాక్టీస్ మానుకుని మాల్దీవ్స్ వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు.

Exit mobile version