NTV Special Story on Mission Mausam: జులాయి సినిమాలో ఇలియానా కోరుకున్నప్పుడల్లా అల్లు అర్జున్ వాన కురిపిస్తుంటాడు. అది ఎలా కురిపిస్తాడో మనందరమూ చూశాం.. కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం బాగుంది కదా.. మనకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన వచ్చే పరిస్థితులుంటే ఎంత బాగుంటుందో కదా..? కానీ త్వరలోనే ఇది సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. మనం ఇంట్లో కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లు అవసరమైనప్పుడు వాన కురిపించుకోవడం అన్నమాట..! అదేంటి.. ఇది సాధ్యమేనా..? అనే సందేహాలు రావచ్చు.. కానీ ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాతావరణ మార్పులే ఇందుకు కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇటీవల బెజవాడను బుడమేరు వరదలు ముంచేశాయి.మేడారం అడవుల్లో టైఫూన్ దాటికి వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి. వియత్నాం, చైనాల్లో బెబెంకా తుపాను అల్లకల్లోలం చేసింది. అంతెందుకు మన మెట్రో నగరాలైన హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటివి ఏటా కుండపోత వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇది ఒకరకమైన విపత్తు అయితే.. అసలు వర్షాలే లేకపోవడం మరో రకమైన సమస్య. ఇప్పటికీకోస్తాంధ్రలో అధిక వర్షపాతం నమోదవగా.. రాయలసీమలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన దగ్గర మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిశ్రమ వాతావరణ పరిస్థితులను చూస్తూనే ఉన్నాం.
ఓ వైపు కుండపోత వర్షాలు, మరోవైపు దారుణమైన వర్షాభావ పరిస్థితులు ప్రపంచంలో అనేక ఇబ్బందులకు కారణమవుతున్నాయి. వీటిని ముందుగా పసిగట్టలేకపోవడం వల్ల భారీ నష్టం వాటిల్లుతోంది. ప్రకృతి విపత్తులు చెప్పి రావు. వచ్చినా వాటిని అడ్డుకునే శక్తిసామర్థ్యాలు మనకు లేవు. గతంలో అసలు వాతావరణ హెచ్చరికలు ప్రజలకు చేరేవే కావు. దీంతో నష్టం బీభత్సంగా ఉండేది. అయితే ఇటీవల సైన్స్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వాతావరణాన్ని కాస్త ముందే పసిగట్టగలుగుతున్నాం. ప్రభుత్వ వాతావరణ అధ్యయన కేంద్రాలు రెండు, మూడు రోజుల ముందుగానే వాతావరణ అంచనాలను విడుదల చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు గంట ముందు గానే రిలీజ్ చేస్తున్నాయి.అయినా అంచనాలు తప్పవుతున్నాయి. దీని వల్ల నష్టం ఊహించని స్థాయిలో ఉంటోంది.
వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయగలిగితే భారీ నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం వాతావరణంపై అధ్యయనానికి భారీగా ఖర్చు చేయబోతోంది. పర్యావరణంలో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. దీంతో వాతావరణ పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. ఈ వేగానికి తగ్గట్టు మన వ్యవస్థలు పనిచేయలేకపోతున్నాయి. అందుకే ఇలాంటి వాటిని అధిగమించేందుకు భారత ప్రభుత్వం మిషన్ మౌసం పేరుతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, శాటిలైట్ వ్యవస్థలను అనుసంధానించి కచ్చితమైన వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 2వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వాతావరణంపై అధ్యయనానికి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం ఇదే తొలిసారి. మరి దీంతో ఏం చేయబోతున్నారు..? వాతావరణ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయాలంటే అందుకు అత్యాధునిక వ్యవస్థ ఉండాలి. ఇప్పుడున్నఅబ్జర్వేషన్ సిస్టమ్, మోడలింగ్ ప్రక్రియల వల్ల అది సాధ్యం కావట్లేదు. ప్రస్తుతం 12 కిలోమీటర్ల రేంజ్ లో మాత్రమే మన న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ వ్యవస్థ ఉంది. దీంతో క్లౌండ్ బరస్ట్స్, ఉరుములు, పిడుగుపాట్లు, కుంభవృష్టి లాంటి వాటిని కచ్చితంగా అంచనా వేయలేకపోతోంది. దీన్ని అప్ గ్రేడ్ చేయడం ద్వారా 6 కిలోమీటర్ల రేంజ్ కు న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ నుతీసుకురావాలనుకుంటోంది.కృత్రిమ మేఘాలకోసం ప్రత్యేక లేబొరేటరీ ఏర్పాటు చేయనుంది. రాడార్ల సంఖ్యను పెంచడంతో పాటు కొత్త శాటిలైట్లను పంపించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ తో కూడిన సూపర్ కంప్యూటర్లను వినియోగించనుంది. 2026 నాటికి ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి.భారత వాతావరణ శాఖ (IMD), ఉష్ణమండల వాతావరణ కేంద్రం (IITM), మధ్యస్థ శ్రేణి వాతావరణ ముందస్తు అంచనాల కేంద్రం (NCMRWF)కలిసి ఈ మిషన్‌లను అమలు చేయనున్నాయి.
ఇప్పుడున్న వ్యవస్థలన్నింటినీ అప్ గ్రేడ్ చేస్తున్నారు సరే.. వాటి వల్ల ఏంటి ఉపయోగం ఏంటి..? వాతావరణాన్ని ముందుగానే పసిగట్టడమేనా… లేకుంటే ఇంకేవైనా అద్భుతాలు జరుగుతాయా..? ఇప్పటివరకూ మనం వాతావరణాన్ని అంచనా వేయడానికి మాత్రమే పరిమితమయ్యాం. కానీ ఇప్పుడు రాబోయేది వాతావరణ నిర్వహణ. అంటే వెదర్ మేనేజ్మెంట్..! ఇన్నాళ్లూ వర్షం పడుతుంది.. ఎండలు మండిపోతాయ్.. అని చెప్పడం వరకూ మన వాతావరణ వ్యవస్థలు పని చేశాయి. కానీ ఇకపై వాటిని కంట్రోల్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎక్కడైనా కుండపోత వర్షం పడేటట్లు ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే.. ఎండ తీవ్రంగా ఉంటే అక్కడ చల్లబరిచేందుకు అవసరమైతే వర్షపు జల్లులను కురిపిస్తాయి.
వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఎస్.. ఇదే ఇప్పుడు భారత వాతావరణ యంత్రాంగం చేపట్టబోతున్న మిషన్ మౌసం ఉద్దేశం. మిషన్ మౌసమ్ ప్రాజెక్టు కింద అత్యాధునిక పరిశోధనలు చేయబోతున్నారు. అవసరాన్ని బట్టి వర్షం కురిపించడం, వడగళ్ల వానలను కంట్రోల్ చేయడం, పొగమంచును పెంచడం లేదా తగ్గించడం.. లాంటి అనేక అంశాలు ఈ పరిశోధనలో భాగం. ఇందుకోసం ప్రత్యేక క్లౌడ్ ఛాంబర్లను నోయిడా లేదా పుణేలో ఏర్పాటు చేయబోతున్నారు.
వాతావరణ పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు గతంలో కూడా అనేక పరిశోధనలు జరిగాయి. అయితే అవి పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని చెప్పలేం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేఘ మథనంద్వారా కరువు పరిస్థితుల్లో వర్షం కురిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే దీని వల్ల పెద్దగా వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. ఇలా కృత్రిమ వర్షాలపై గతంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పరిశోధనలు జరిగాయి. కొంతమేర మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రఖ్యాత జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ 1950ల్లోనే మంచు తుపాన్లు, హరికేన్లను సృష్టించేందుకు ప్రయత్నించింది.వియత్నాంతో యుద్ధం సమయంలో అమెరికా సైన్యం ఆపరేషన్ పాప్ ఐ పేరుతో రుతుపవనాల సీజన్ ను పొడిగించేందుకు ప్రయత్నించింది.ఇది కొంతమేర సక్సెస్ కావడంతో ఐక్యరాజ్య సమితి ఇలాంటివాటిపై నిషేధం విధించింది.
ప్రకృతికి ఎదురీదడం అంటే ఉత్పాతాలను కొనితెచ్చుకోవడమేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ లాంటి వాటిని కట్టడి చేయకుండా ఇలా కృత్రిమ పద్ధతుల ద్వారా వాతావరణ మార్పులను కంట్రోల్ చేస్తే అవి మరిన్ని ప్రమాదాలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ముందుగానే కచ్చితంగా అంచనా వేయగలగడం వరకూ ఓకే… కానీ ఇలా కృత్రిమంగా ఎండావానలను కంట్రోల్ చేయడం మాత్రం అనేక విమర్శలకు కారణమవుతోంది.