NTV Telugu Site icon

Pager Attacks : పేజర్ బాంబ్స్..! ఇలా కూడా చంపొచ్చా..!?

Lebanon

Lebanon

Ntv Special Story on Lebanon Pager Attacks: మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. చేతికి స్మార్ట్ వాచ్ ఉంది.. మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు. ఇంతలో మీ ఫోన్ లేదా వాచ్ ఒక్కసారిగా పేలిపోతే ఎలా ఉంటుంది..? మీ ఒక్కరికే అలా జరిగితే ఏదో పొరపాటు అనుకుంటాం.. అలా కాకుండా మీ లాంటి స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు ధరించిన వాళ్లందరివీ ఒకేసారి పేలితే పరిస్థితి ఏంటి..? సరిగ్గా ఇప్పుడు లెబనాన్ లో ఇలాగే జరిగింది. అయితే అక్కడ పేలింది ఫోన్లు, వాచ్ లు కాదు.. పేజర్లు.! అదేంటి స్మార్ట్ ఫోన్ల కాలంలో ఇంకా పేజర్లు ఎందుకు వాడుతున్నారు..? అవి ఎందుకు పేలాయి..? ఎవరు పేల్చారు..? లాంటి అంశాలను ఈ స్టోరీలో చూద్దాం.

లెబనాన్ లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశంలో పేజర్లు పేలడంతో వేలాది మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయారు. అసలు అక్కడ ఏం జరిగింది..? లెబనాన్ లో దేశవ్యాప్తంగా పేజర్లు ఒక్కసారిగా పేలాయి. ముఖ్యంగా సాయుధ హిజ్బుల్లా గ్రూప్ తమ సమాచార మార్పిడికోసం వినియోగించే ఈ పేజర్లు పేలడంతో 9 మందికి పైగా మరణించారు. దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. వీళ్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. రాజధాని బీరూట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగాయి. పేజర్లు వాడుతున్న వాళ్ల జేబుల నుంచి పొగలు వచ్చాయి. కొంతమంది జేబుల్లో అవి పేలిపోయాయి. చేతిలో బాణాసంచా పేలితో ఎలా ఉంటుందో అలాంటి శబ్దాలు వచ్చాయి. దాదాపు గంట పాటు ఈ పేలుళ్లు కొనసాగాయి.

పేజర్ల పేలుళ్ల బాధితులంతా ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. అసలు ఈ పేజర్లు ఎందుకు పేలాయో అర్థంకాక తలలు పట్టుకున్నారు. పేజర్లు ఎందుకు పేలాయో ఇప్పటికీ తెలియట్లేదు. బ్యాటరీ హీట్ కావడం వల్లే పేలి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఒకేసారి అన్ని పేజర్లు పేలడం.. అవన్నీ హిజ్బుల్లా గ్రూప్ కు చెందిన వారివి కావడంతో అనుమానాలు తలెత్తాయి. పేజర్ల బ్యాటరీలను హ్యాక్ చేసి పేలేలా చేసి ఉంటారని.. అందుకే అవి పేలాయని అనుమానిస్తున్నారు.

సహజంగా పేజర్ల తయారీలో ఏవైనా లోపాలుంటే కొంతకాలానికే అవి పాడైపోవడమో.. పేలిపోవడమో జరుగుతాయి. అయితే ఒక్కొసారి ఒక్కోసారి పేలొచ్చు. కానీ ఇలా మూకుమ్మడిగా పేలడం మాత్రం అనుమానాలకు తావిచ్చింది. లెబనాన్ లో ఈ తరహా పేలుళ్లు ఇంతకముందెన్నడూ జరగలేదు. పేజర్లు తయారు చేసినప్పుడు కానీ, వాటిని మార్గమధ్యంలో ఎవరైనా ట్యాంపర్ చేసి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అలాగే.. హ్యాకర్లు వీటి సాఫ్ట్ వేర్ ను హ్యాక్ చేసి పేలేలా చేసి ఉండొచ్చని కూడా కొంతమంది చెప్తున్నారు. గతంలో ఇలా సాఫ్ట్ వేర్ హ్యాక్ చేసి ఎలక్ట్రానిక్ వస్తువులను మిస్ యూజ్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.

ఇంతకుముందు చాలా వరకూ సాఫ్ట్ వేర్ సంబంధిత అటాక్ లు జరిగాయి. అయితే ఇలా హార్డ్ వేర్ ను హ్యాక్ చేసి పేల్చేయడం మాత్రం ఇదే తొలిసంఘటనగా చెప్తున్నారు. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎక్కడా జరిగినట్లు లేవంటున్నారు. సహజంగా ఫోన్ల సాఫ్ట్ వేర్ లు హ్యాక్ చేస్తే అందులోని సమాచారం ట్యాంపరింగ్ గు గురవుతుంది. ఆ గ్యాడ్జెట్లోని సమాచారాన్ని మిస్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాని ఆ గ్యాడ్జెట్ పేలిపోయే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు పేజర్లను ఏకంగా పేల్చేశారు. దీన్ని సప్లై చైన్ అటాక్ గా అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భారీ ఆపరేషన్ చేపట్టి ఉండొచ్చని చెప్తున్నారు. ఆల్ఫా న్యూమరిక్ టెక్స్ట్ మెసేజ్ ల ద్వారా సిగ్నల్స్ పంపించి వాటిని పేల్చేసి ఉండొచ్చని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. మెసేజ్ వచ్చిన తర్వాతే పేజర్లు పేలినట్లు గుర్తించారు. అంతేకాక పేలిన తర్వాత పేజర్లు ఆఫ్ కాకపోవడాన్ని గమనించారు.

పేజర్ పేలుళ్లు కేవలం లెబనాన్ కే పరిమితం కాలేదు. సిరియాలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ కూడా ఒకే సమయంలో పేలుళ్లు జరగడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. పేజర్ల పేలుళ్లలో ఇద్దరు హిజ్బుల్లా ఎంపీల కొడుకులు, మరో హిజ్బుల్లా సభ్యుడి కుమార్తె చనిపోయారు. గాయపడిన వారిలో లెబనాన్ లో ఇరాన్ రాయబారి మోజాబా అమానీ కూడా ఉన్నారు. ఈ పేలుళ్లలో చాలామందికి చేతులు, కాళ్లకు గాయలయ్యాయి. కొంతమంది కంటిచూపు కోల్పోయారు. అయితే గాయపడిన వారంతా హిజ్బుల్లా సభ్యులేనని చెప్పడం కష్టమేనని కొందరు భావిస్తున్నారు. అయితే ఎక్కవ మంది హిజ్బుల్లాకు సంబంధం ఉన్న వ్యక్తులే కావడంతో ఈ పేలుళ్ల వెనుక కుట్ర ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు లెబనాన్ లో పేలుళ్లు జరిగిన సమయంలోనే సిరియాలో కూడా పేజర్లు పేలాయి. ఈ ఘటనల్లో 14 మంది గాయపడ్డారు.

లెబనాన్, సిరియాల్లో ఇలా పేలుళ్లు జరగడం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఇది కచ్చితంగా ఇజ్రాయెల్ పనేనని కొందరు చెప్తున్నారు. పేజర్ల పేలుళ్లు తామే జరిపాం అంటూ ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. అయితే లెబనాన్ ప్రభుత్వంతో పాటు హిజ్బుల్లా ప్రతినిధులు మాత్రం ఇది ఇజ్రాయెల్ పనేనని అనుమానం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా నేరమేనని.. తగిన ప్రతీకారం తీర్చుకుంటామని లెబనాన్ ప్రధాని హెచ్చరించారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు చేయడానికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు.

పేజర్ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్, హిజ్బుల్లా ఎందుకు చెప్తున్నాయి..? ఇజ్రాయెల్ ఇలాంటి దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది.? ఇటీవల కాలంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. గాజాలో మొదలైన దాడులు ఇప్పుడు ఆ ప్రాంతమంతటికీ వ్యాపించాయి. గాజా, పాలస్తీనాకు మద్దతుగా లెబనాన్, సిరియా, ఇరాన్, జోర్డాన్ లాంటి దేశాలు నిలిచాయి. దీంతో ఇజ్రాయెల్ వీటన్నిటినీ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఆ దేశాల్లో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న హిజ్బుల్లా, హమాస్, హైతీ లాంటి ఉగ్రవాద సంస్థలపై విరుచుకుపడుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు పేజర్లను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇప్పుడు 5జీ, 6జీ కాలం నడుస్తోంది. అయినా స్మార్ట్ ఫోన్లు రాకముందు వాడిన పేజర్లను ఇప్పటికీ ఈ దేశాల్లో ఎందుకు వాడుతున్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ వృద్ధి చెందుతోంది. దీంతో అత్యాధునిక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటి గ్యాడ్జెట్లతో పోల్చితే పేజర్లు చాలా పాతవి. వీటిని ట్రాక్ చేయడం చాలా కష్టం. తక్కువ ఫ్రీక్వెన్సీ నెట్ వర్క్ తో ఇవి పనిచేస్తాయి. వీటిని వాడడం ద్వారా టెక్నాలజీకి దొరక్కుండా తప్పించుకోవచ్చు. అందుకే హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థలు పేజర్లను ఇప్పటికీ వాడుతున్నాయి. పేజర్ల ద్వారా టెక్స్ట్ మెసేజ్ లు, వాయిస్ మెసేజ్ లు పంపడానికి వాడుతుంటారు. మొబైల్ లాగానే ఇదొక వైర్ లెస్ సాధనం.

శత్రువులను వేటాడడంలో ఇజ్రాయెల్ ముందుంటుంది. రాకెట్ లాంచర్ల ద్వారా గతంలో ఎంతోమంది ఉగ్రవాదులను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇప్పుడు పేజర్లను కూడా పేల్చేసిందనే ఆరోపణలు రావడంతో ఇజ్రాయెల్ కమ్యూనికేషన్ రంగంలో బాగా చొచ్చుకుపోయిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశంలో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారనేది ఇజ్రాయెల్ ట్రాక్ చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతోంది. దీంతో తమ కమ్యూనికేషన్ వ్యూహాలను హిజ్బుల్లా, హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలు మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.