NTV Telugu Site icon

Budameru : విజయవాడను బుడమేరు వాగు ముంచడానికి కారణం ఇదే..!

Budameru

Budameru

భారీ వర్షాలు, పోటెత్తిన వరదలతో బెజవాడ నీట మునిగింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మూగజీవాలు చనిపోయాయి. దీనంతటికీ ప్రధాన కారణం బుడమేరు. సహజంగా కృష్ణానది నుంచి విజయవాడకు వరదలు వస్తాయనుకుంటారు. కానీ ఈసారి బుడమేరు బెజవాడను ముంచేసింది. దీంతో అసలు ఈ బుడమేరు ఎక్కడ పుడుతుంది.. ఎక్కడికెళ్తుంది.. బెజవాడకు, దీనికి సంబంధమేంటి.. లాంటి అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి.

బుడమేరును బెజవాడ దుఃఖదాయినిగా చెప్పుకుంటూ ఉంటారు. పేరుకు తగ్గట్టే ఇది బెజవాడ వాసులను కన్నీటిమయం చేసింది. వాస్తవానికి ఇది పెద్దగా వార్తల్లో వినిపించకపోయినా బెజవాడ వాసులకు మాత్రం దీని సంగతి బాగా తెలుసు. బుడమేరు బెజవాడను ముంచేసింది. సగానికి పైగా నగరాన్ని వరద నీటితో కప్పేసింది. సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్న, వన్ టౌన్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. మొదటి అంతస్తు వరకూ నీళ్లు వచ్చాయంటే వరద ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మూడు రోజులు దాటినా ఇప్పటికీ వరదనీటిలోనే ప్రజలు ప్రాణాలు బిగబట్టుకుని బతుకుతున్నారు. పడవలపై ఆహారం, మంచినీళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అసలు బుడమేరు ఎక్కడ పుడుతుంది.. ఎక్కడికెళ్తుంది.. దీనికి బెజవాడకు, ఉన్న సంబంధం ఏంటి.. అనే అంశాలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోని మైలవరం కొండల్లో పుడుతుంది బుడమేరు. ఇది ఒక పెద్ద వాగు. దీనికి ఉపవాగులు కూడా ఉన్నాయి. రెడ్డిగూడెం నుంచి కోతుల వాగు, జి.కొండూరు మండలం గంగినేని నుంచి పులివాగు, మునగపాడు నుంచి బీమ్ వాగు, CH మాధవరం నుంచి లోయవాగు, గడ్డమణుగు లోయ నుంచి దొర్లింతల వాగులు బుడమేరులో కలుస్తుంటాయి. ఖమ్మం జిల్లాలో కురిసే వర్షాలతో పాటు కొండలపైనున్న నీటి ఊటలు, పొలాల నుంచి వచ్చే నీటి వల్ల బుడమేరులో ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో నీళ్లుంటాయి. దాదాపు 160 కిలోమీటర్ల మేర సాగే బుడమేరు.. అనేక మలుపులు తిరుగుతూ కొల్లేరులో కలుస్తుంది. అతి పెద్ద మంచి నీటి సరస్సుగా పేరొందిన కొల్లేరుకు బుడమేరు ప్రధాన నీటి వనరుగా ఉంది.

బుడమేరు వల్ల బెజవాడకు ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంది. గతంలో కూడా పలు సందర్భాల్లో బుడమేరు వల్ల బెజవాడ ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. బుడమేరు ప్రవాహం అంచనాలకు అందదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పడం కష్టం. అందుకే దీని ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు వెలగలేరు వద్ద 70వ దశకంలోనే ఓ రెగ్యులేటర్ ను ఏర్పాటు చేశారు. సాధారణంగా బుడమేరులో గరిష్టంగా 15వేల క్యూసెక్కుల వరకూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఈ నీటి ప్రవాహం భారీగా పెరిగిపోతుంటుంది. ఇప్పుడు 40వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చినట్లు అంచనా. 2005లో 70వేల క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహించింది. అప్పుడు కూడా బెజవాడ పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. 2009లో కూడా మరోసారి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వరదలు వచ్చిన ప్రతిసారీ గగ్గోలు పెట్టడం, ఆ తర్వాత కామ్ అయిపోవడం ఇక్కడి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అలవాటైపోయింది.

2005లో బుడమేరు బెజవాడ పుట్టి ముంచింది. అప్పుడు రోజుల తరబడీ విజయవాడ వరదనీటిలోనే ఉండిపోయింది. 2005లో బుడమేరు తీవ్రతకు బెజవాడ వణికిపోయింది. నగరం అతలాకుతలమైపోయింది. వరదల వల్ల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. బుడమేరు నుంచి తమను రక్షించాలంటూ స్థానికులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇరిగేషన్ అధికారులు ఆయనకు మొత్తం పరిస్థితిని వివరించారు. దీని నుంచి కాపాడుకోవాలంటే బుడమేరును మళ్లించడమే మార్గమని సూచించారు. బుడమేరు పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలనే ప్రతిపాదనను కూడా ఇరిగేషన్ శాఖ చేసింది. అప్పట్లో కొంతమేర వర్క్ జరిగింది కానీ తర్వాత మూలన పడింది.

బుడమేరు నుంచి నగరాన్ని కాపాడుకునేందుకు అప్పటి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినా అవి సక్సెస్ కాలేదు. అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. బుడమేరు నుంచి బెజవాడను కాపాడుకునేందుక పోలవరం కుడికాల్వతో అనుసంధానించడం అనేది ఒక ప్రతిపాదన. అందుకు తగ్గట్టే 2007-08లో బుడమేరు దిగువ ప్రవాహాన్ని పోలవరం కుడికాల్వలోకి మళ్లించారు. అంటే.. కొత్తగా మరో కాల్వ తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాల్వలోకి మళ్ళించారు. ఇక్కడే సాంకేతికంగా సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాల్వను గరిష్టంగా 37వేల 5వందల క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు. అయితే వీటీపీఎస్ కాల్వకు అంత సామర్థ్యం లేదు. వరద ప్రవాహానికి అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచాలనే ప్రతిపాదన ఉన్నా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేదు.

బుడమేరుతో పాటు పోలవరం కుడి కాల్వ నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలపడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీని వల్ల కూడా బుడమేరు పనులు ముందుకు సాగలేదు. బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదు. దీనికి తోడు కృష్ణానది ముఖ ద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. VTPS నుంచి కృష్ణా నదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలో ఉండాలి. కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడి కాల్వ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది.

2005 నుంచి ఇప్పటివరకూ బుడమేరు వాగును పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇది పూర్తిగా ఆక్రమణలకు గురైంది. దాని పర్యవసానమే ఇప్పుడు మనం చూస్తున్న దుస్థితి. దాదాపు 20 ఏళ్ల కిందట వచ్చిన బుడమేరు వరదల దాటికి బెజవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పింది. అయితే 2008 తర్వాత విజయవాడ రూరల్ ప్రాంతాలు శరవేగంగా విస్తరించాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత నగరం రూపురేఖలే మారిపోయాయి. కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్‌ టెన్షన్‌, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమే. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కాయి. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఈ కరకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది.

బుడమేరు ఆక్రమణలను తొలగిస్తే ముప్పు తప్పుతుందని తెలుసు. కానీ దాని ఆక్రమణల తొలగింపునకు మాత్రం అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2005, 2008 వరదల తర్వాత బుడమేరు ఆక్రమణలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాగు మలుపులను సరిచేసి నేరుగా వెళ్లేలా చేయగలిగితే నగరంపై ప్రభావం తగ్గుతుందని అధికారులు సూచించారు. అందుకు అనుగుణంగా వాగును విస్తరించి సహజ నీటి ప్రవాహ వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించారు. అయితే.. తమ నియోజకవర్గాల్లోని ఇళ్లను తొలగించేందుకు వీలు లేదని కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. దీంతో ఆ పనులు ముందుకు సాగలేదు. దీంతో ఆక్రమణలు మరింత ఎక్కువయ్యాయి.

బుడమేరు నుంచి బెజవాడను రక్షించాలంటే ఇప్పుడున్న ఏకైకమార్గం ఆక్రమణలను తొలగించడమే. లేదంటే బుడమేరు ప్రవాహం వెంబడీ రిటైనింగ్ వాల్ నిర్మించాలి. బుడమేరు సహజ ప్రవాహానికి అడ్డుగా ఉన్న మలుపులను కూడా సరిచేయాల్సి ఉంది. అప్పుడు నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు వెళ్లేందుకు వీలవుతుంది. ఆ పని చేయగలిగితేనే బెజవాడ్ సేఫ్ గా ఉంటుంది. లేకుంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి దృశ్యాలను చూడాల్సి ఉంటుంది.