ఇది నిరసన కాదు.. ఇది తిరుగుబాటు కాదు.. ఇది అంతుబట్టని నడక..! వేల సంఖ్యలో ఉన్న పెంగ్విన్ల నుంచి ఒక్క పెంగ్విన్ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అది సముద్రం వైపు కాదు.. ఆహారం వైపు కూడా కాదు. జీవించడానికి అవకాశం ఉన్న దారిలో అంతకన్నా కాదు.. జీవానికి అవకాశం లేని మంచుతో కప్పబడిన పర్వతాల వైపు పెంగ్విన్ నడుస్తూ వెళ్తోంది. అక్కడ బ్రతకడం అసాధ్యం అని దానికీ తెలుసు. కానీ అది ఆగడంలేదు. వేగం పెంచడమూ లేదు. భయపడినట్లు కాకుండా నిశ్చలంగా నడుస్తూ పోతోంది. 20 ఏళ్ల క్రితం తీసిన ఈ వీడియో 2026లో మళ్లీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇంటర్నెట్ దీనికి ఒక పేరు పెట్టింది. ‘నిహిలిస్ట్ పెంగ్విన్’.. అంటే అర్థం లేని జీవితం నుంచి బయటికి నడిచిన జీవి అన్నట్టు మీనింగ్.
ఈ నడకలో కొందరికి అలసట కనిపించింది. కొందరికి తిరుగుబాటు కనిపించింది. ఇక హడావిడి ప్రపంచాన్ని వదిలి వెళ్లాలనుకునే మనసుల ప్రతిబింబంగా ఈ పెంగ్విన్ మారిపోయింది. ఇంతకీ ఈ పెంగ్విన్ ఇలా ఒంటరిగా ఎందుకు వెళ్తోంది? ఈ నడక వెనుక ఉన్న నిజం ఏంటి?
ఈ వీడియో మొదటగా కనిపించినప్పుడు ఇది ఒక తాత్విక దృశ్యంలా అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న కథ మన ఊహలకు భిన్నం.
ఈ ఫుటేజ్ 2007లో విడుదలైన ఒక డాక్యుమెంటరీలోది. దీనికి వెర్నర్ హెర్జాగ్ దర్శకుడుగా ఉన్నాడు. అంటార్కటికాలోని అడెలీ పెంగ్విన్ కాలనీని చిత్రీకరిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు గమనించిన అరుదైన ప్రవర్తన ఇది. వేల సంఖ్యలో కలిసి జీవించే పెంగ్విన్లలో చాలా అరుదుగా ఒకటి లేదా రెండు ఇలా కాలనీ నుంచి దూరంగా నడవడం మొదలుపెడతాయి. శాస్త్ర భాషలో దీన్ని ‘డిస్ఓరియెంటెడ్ బిహేవియర్’గా పిలుస్తారు. అయితే సోషల్‌మీడియాలో ఓ కథ వైరల్‌గా మారింది. ఆడ, మగ పెంగ్విన్లు లవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ బ్రేకప్ అయితే మగ పెంగ్విన్ ఆ బాధను తట్టుకోలేకపోతుందట.
అందుకే అలా ఒంటరిగా మరణం వైపు వెళ్తుందని కొన్ని కథలు కనిపిస్తున్నాయి కానీ అందులో ఏ మాత్రం నిజంలేదని సైంటిస్టులు చెబుతున్నారు. అదంతా మనుషులు సృష్టించిన కథ మాత్రమేనట. నిజానికి పెంగ్విన్లు సాధారణంగా సముద్రానికి దగ్గరగా ఉంటాయి. అక్కడే ఆహారం ఉంటుంది. అక్కడే జీవనం సాగుతుంది. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న పెంగ్విన్ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా కదులుతోంది. లోపలికి, మంచు పర్వతాల వైపు, ఎక్కడ ఆహారం లేదు, ఎక్కడ తిరిగి రావడానికి దారులూ లేవు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది భావోద్వేగ నిర్ణయం కాదు. ఇది వ్యాధి వల్ల కలిగే అయోమయం కావచ్చు. లేదా నాడీ వ్యవస్థలో వచ్చిన లోపం కావచ్చు. కొందరు పరిశోధకులు మాగ్నెటిక్ ఫీల్డ్ మార్పుల వల్ల దారి తప్పే అవకాశమూ ఉందంటున్నారు. ఒకసారి ఈ నడక మొదలైతే, ఆ పెంగ్విన్‌ను తిరిగి కాలనీకి తీసుకొచ్చినా మళ్లీ అదే దారిలో నడిచే అవకాశం ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే ఇంటర్నెట్ ప్రపంచం మాత్రం దీన్ని సైన్స్‌తో చూడలేదు. ఈ నడకలో మనిషి తనను తాను చూసుకున్నాడు. పని ఒత్తిడి నుంచి బయటకు నడిచిపోవాలనుకునే మనసు, హడావిడి జీవితాన్ని వదిలేయాలనుకునే అలసట, అర్థం లేకుండా అనిపించే రొటీన్‌పై నిరాకరణ కనిపిస్తున్నాయట.
ఈ పెంగ్విన్ ఒక జీవిగా కాకుండా ఒక భావంగా మారిపోయింది. అందుకే దీనికి నిహిలిస్ట్ పెంగ్విన్ అనే పేరు వచ్చింది. కాని ఇక్కడ అసలు నిజం ఏంటంటే పెంగ్విన్‌కు తిరుగుబాటు అనే ఆలోచన లేదు. కానీ మనకు ఉన్నాయి. ఈ వీడియో వైరల్ అవ్వడానికి కారణం పెంగ్విన్ కాదు. మనమే. మన అలసట, మన ఒంటరితనం, మౌనంగా బయటకు వెళ్లిపోవాలనే కోరిక. ఒక జంతువు చేసిన పొరపాటును మనం మన జీవితానికి ప్రతీకగా మార్చుకున్నాం. అయితే ఈ కథ ఒక నిజాన్ని మన ముందు వదిలేస్తుంది. ఇది పెంగ్విన్ గురించి కాదు. మన గురించి.
వేల మందిలో ఉన్నా ఒంటరిగా అనిపించే మనుషుల గురించి. ఎవరితోనూ గొడవ పడకుండా, ఎవరికీ చెప్పకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా వెనక్కి తిరిగి నడిచిపోవాలనుకునే మనసుల గురించి. ఈ వీడియోలో మనం చూస్తున్నది ఒక జంతువు నడక కాదేమో. మన లోపల దాగి ఉన్న అలసట, మౌనానికి వచ్చిన ప్రతిబింబమే కావచ్చు. అందుకే ఈ పెంగ్విన్ నడక మనల్ని కుదిపేస్తోంది, ఆలోజింపచేస్తోంది కూడా.
ALSO READ: 40 లక్షల మంది హ*త్య.. సంచలనం రేపుతోన్న నివేదిక.. ఈ పాపం ఎవరిది?
