2025 మన సత్తాను ప్రశ్నించింది.. నీకు ఎంత వరకు నిలబడగలిగే శక్తి ఉందో పరీక్షించింది. ఉద్యోగాలు ఇచ్చినట్టు నటించి తీసుకుపోయింది. భద్రత చాటున భయాన్ని మిగిల్చింది. టెక్నాలజీతో ఏం సమస్య ఉండదని నమ్మించి మనిషి మెదడునే సందేహంలోకి నెట్టింది. ప్రపంచం అంతా ఒకేలా అనిపించింది.
ఎక్కడ చూసినా ఒకే వార్తలు. యుద్ధాలు.. వాతావరణ విపత్తులు.. రోగాలు.. రెసెషన్.. మొత్తంగా భవిష్యత్తు మీద అనిశ్చితి. మరి ఈ ఏడాదిని చూసిన తర్వాత ఒక ప్రశ్న సహజంగా వస్తుంది. ఇక ముందు ముందు పరిస్థితి ఏంటి? మన చేతుల్లో ఏం మిగిలింది? కానీ ఇక్కడే అందరూ ఒక నిజాన్ని గమనించాలి.. 2025 మనల్ని భయపెట్టింది కానీ.. మనలో ధైర్యాన్ని పూర్తిగా ఓడించలేకపోయింది. మనల్ని కుదిపేసింది కానీ కూల్చలేకపోయింది. మన ఆశల్ని పరీక్షించింది కానీ వాటిని ఆర్పలేకపోయింది. ఇక ఇప్పుడు 2026 తలుపు మన ముందు నిలబడి ఉంది. మరి 2026లో మనం ఎలా దూసుకెళ్లాలి?
2025 మనల్ని ఒక్కసారిగా వెనక్కి నెట్టిన సంవత్సరం. కానీ అదే ఏడాది మనలోని తట్టుకునే శక్తిని బయటకు లాగింది. ఉద్యోగాలు పోయినప్పుడు, మార్కెట్లు ఊగిపోయినప్పుడు, టెక్నాలజీ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టినప్పుడు కూడా మనిషి ఆగలేదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం 2025లో ప్రపంచవ్యాప్తంగా 9కోట్లకు పైగా ఉద్యోగాలు రూపాంతరం చెందాయి. ఇది వినడానికి భయంకరంగా అనిపిస్తుంది కానీ ఆ సంఖ్యలో ఒక నిజం దాగుంది. ఉద్యోగాలు పూర్తిగా అంతరించలేదు. అవి కొత్త రూపాన్ని మార్చుకున్నాయి. ఒకప్పుడు అవసరమైన నైపుణ్యాలకు ఇప్పుడు విలువ లేకుండాపోయిన మాట నిజమే అయినా.. అదే సమయంలో కొత్త నైపుణ్యాలు ఊపిరి పీల్చాయి. డేటా, హెల్త్ టెక్, గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ, ఏఐ రంగాల్లో డిమాండ్ 2025లో రికార్డు స్థాయికి చేరింది. అంటే ఇది ఉద్యోగాలకు అంతం కాదు.. ఇది ఉద్యోగ మార్పుకు ఆహ్వానం!
ఈ మార్పు మధ్యలో మనిషి ఎదుర్కొన్న అసలు యుద్ధం బయట నుంచి రాలేదు.. లోపల నుంచే వచ్చింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలపై చర్చ జరిగిన స్థాయి గత దశాబ్దాల్లో ఎప్పుడూ లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం హెల్ప్‌లైన్ కాల్స్ నాలుగేళ్లలో 40శాతం పెరిగాయి. ఇది మనం బలహీనంగా మారుతున్నామన్న సంకేతం కాదు. సహాయం అడగడం నేర్చుకుంటున్నామన్న సంకేతం. ఒకప్పుడు మనిషి బాధను దాచేవాడు. ఇప్పుడు బయట పెట్టగలుగుతున్నాడు. ఇది సమాజం నెమ్మదిగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోందని చెప్పేందుకు ఉదాహరణ.
2025 మరో విషయాన్ని బలంగా చెప్పింది. విపత్తులు వచ్చినా జీవితం ఆగదు. యుద్ధాలతో నలిగిపోయిన ప్రాంతాల్లో కూడా స్కూల్స్ తిరిగి తెరుచుకున్నాయి. వరదలు కొట్టుకుపోయిన గ్రామాల్లో కూడా ప్రజలు మళ్లీ ఇళ్లకు పునాదులు వేశారు. వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం విపత్తుల తర్వాత పునర్నిర్మాణ ప్రాజెక్టులపై ఖర్చు 2025లో 18శాతం పెరిగింది. ఇది ప్రభుత్వాల గొప్పతనం కాదు. సామాన్యుల పట్టుదల. కూలిపోయిన తర్వాత కూడా లేచి నిలబడే మనస్తత్వం.
భారత్‌లోనూ తుఫాన్లు, వరదల సమయంలో ఏఐ ఆధారిత వాతావరణ మోడల్స్ వల్ల లక్షల మందిని ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. మరోవైపు 2025లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మొదటిసారి డిజిటల్ హెల్త్ సేవలను ఉపయోగించుకున్నారు. అంటే టెక్నాలజీ కేవలం నగరాలకే పరిమితం కాలేదని అర్థంచేసుకోవచ్చు. అందుకే 2026లో మన ముందున్న అసలైన ఛాలెంజ్ టెక్నాలజీని ఆపడం కాదు. దాన్ని మన జీవితం కోసం, మన భవిష్యత్తు కోసం సరైన దిశలో మలచుకోవడం.
ఇక వర్క్ కల్చర్ గురించి 2025లో జరిగిన చర్చ గతంలో ఎప్పుడూ జరగలేదు. జీవితమంటే గొడ్డుచాకిరి చేయడం కాదనే ఆలోచన బలపడింది. యూరప్‌లో నాలుగు రోజుల పని వారం ప్రయోగాలు విస్తరించాయి. ఆసియాలో రిమోట్ వర్క్ శాశ్వతంగా మారింది. పని గంటల గురించి మాట్లాడటం ఇక తిరుగుబాటు కాదు.. అవసరంగా మారింది. ఇది కార్పొరేట్ సంస్కృతిలో వచ్చిన పెద్ద మార్పు. మనిషి జీవితం విలువైనదని అంగీకరించిన క్షణం 2025లోనే పురుడుపోసుకుంది.
2025 మనకు ఇంకో విషయాన్ని నేర్పించింది. ఎదురు చూసే కాలం అయిపోయిందని చెప్పకనే చెప్పింది. ఒకప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయో, కంపెనీలు ఏం ఇస్తాయో, మార్కెట్లు ఎలా స్పందిస్తాయో అని మనం ఎదురు చూసేవాళ్లం. కానీ 2025లో ఆ భ్రమ కూలిపోయింది. మన జీవితానికి బాధ్యత ఎవరూ తీసుకోరని, మనమే తీసుకోవాల్సి వస్తుందని ఈ ఏడాది కళ్లకు కట్టింది. అందుకే చిన్న వ్యాపారాలు, ఫ్రీలాన్స్ ఎకానమీ 2025లో రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక నివేదికల ప్రకారం గిగ్ ఎకానమీతో ఆదాయం పొందుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 30 శాతం పెరిగింది. అంటే కొత్త దారులు వెతుక్కునే వారి శాతం భారీగా పెరిగింది.
యువత విషయంలో 2025 పూర్తిగా భిన్నంగా నిలిచింది. ఒకప్పుడు కెరీర్ అంటే ఒకే కంపెనీ, ఒకే జాబ్, ఒకే రూట్. ఇప్పుడు ఆ ఆలోచన చచ్చిపోయింది. 2025లో చదువుతో పాటు నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టిన యువత సంఖ్య భారీగా పెరిగింది. ఆన్‌లైన్ కోర్సులు, స్కిల్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా కోట్ల మంది కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇది డిగ్రీ విలువ తగ్గిందన్న మాట కాదు. నేర్చుకోవడం ఎప్పటికీ ఆగకూడదన్న అర్థం. ప్రపంచం మారుతున్నప్పుడు మనిషి కూడా మారకపోతే వెనుకబడిపోతాడని యువత అర్థం చేసుకుంది. మరోవైు సమాజంగా కూడా మనం కొంచెం మారాం. 2025లో డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం అనే విషయం చాలామందికి ఆలస్యంగా అయినా అర్థమైంది. ఫిట్‌నెస్, మెంటల్ హెల్త్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లాంటివి లగ్జరీలు కావని, కచ్చితంగా అవసరమనే చర్చ మొదలైంది. ఒకప్పుడు ఓవర్‌టైమ్‌ని గొప్పగా చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడాన్ని కూడా అవసరంగా చూడటం మొదలైంది. ఇది వీక్‌నెస్ కాదు. ఇది సేల్ఫ్ కేర్..!
అటు దేశాల స్థాయిలో కూడా 2025 ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ఎనర్జీ, ఆహారం, టెక్నాలజీ విషయంలో స్వావలంబనపై ప్రపంచం మొత్తం మాట్లాడటం మొదలైంది. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెరిగాయి. సస్టైనబుల్ జీవనశైలిపై ఆసక్తి పెరిగింది. ఇది ట్రెండ్ కాదు. అవసరం. రాబోయే సంవత్సరాల్లో మనం బ్రతకాలంటే తీసుకోవాల్సిన దారి. అంతా చూసిన తర్వాత ఒక విషయం మాత్రం క్లియర్. 2025 మనల్ని కూల్చడానికి రాలేదు. మనల్ని మేల్కొల్పడానికి వచ్చింది. మన బలహీనతలు చూపించడానికి వచ్చింది. మనలో ఉన్న శక్తిని గుర్తు చేయడానికి వచ్చింది. అందుకే 2026 ముందు మనం భయంతో నిలబడాల్సిన అవసరం లేదు. అప్రమత్తతతో ముందుకు నడవాలి.
2026లో ప్రపంచం మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. కానీ ఆ మార్పులో మనం తలవంచుతామా, తలెత్తుతామా అన్నది మన చేతుల్లోనే ఉంది. ఉద్యోగాలు మారుతాయి.. టెక్నాలజీ మరింత వేగంగా దూసుకుపోతుంది. వాతావరణం ఇంకా పరీక్షలు పెడుతుంది. కానీ ఒక విషయం మాత్రం మారదు. మనిషి లేచి నిలబడగలడు.. ప్రపంచం ఎన్నిసార్లు కూలిపోయినా మనిషి ప్రతీసారి తిరిగి లేచాడు. అందుకే 2026లోకి అడుగు పెట్టేటప్పుడు భయాల నీడలో కాకుండా.. మన శక్తిని గుర్తించి ధైర్యంగా ముందుకు వెళ్లాలి. ఎందుకంటే ప్రపంచం కఠినంగా మారొచ్చు. కానీ మనిషి ఇంకా బలంగా మారగలడనే నిజాన్ని మర్చిపోకూడదు..!
