NTV Telugu Site icon

Musi River Dispute : మూసీ నదిపై గొడవేంటి..!? పిల్లలకు పేర్లు పెట్టుకునేలా ఇది మారుతుందా?

Musi River Row

Musi River Row

ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో మూసీ ఒకటి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేయాలనుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆక్రమణలతో అన్యాక్రాంతమైపోయిన ఈ నదికి పునరుజ్జీవం కల్పించాలనుకుంటోంది. లండన్ లోని థేమ్స్ నది, సియోల్ లోని చియోంగ్‌ జియోన్ నది లాగా దీన్ని సుందరీకరించాలనుకుంటోంది. మరి దీనిపై వివాదం ఎందుకు..? మూసీ నది చరిత్రేంటి..? ఎందుకిలా తయారైంది..?

తెలంగాణలో మూసీ నదికి ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ నది పేరు కూడా ఎత్తలేని పరిస్థితి వచ్చింది. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి.. ఇలా చెప్పుకుంటూపోతే దేశంలో ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. వీటిని ఎంతో ఆరాధిస్తారు ప్రజలు. అందుకే తమ బిడ్డలకు ఈ నదుల పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. వీటికి ఏమాత్రం తీసిపోనిది మూసీ. కానీ మూసీ నది పేరును తమ బిడ్డలకు పెట్టుకునేందుకు ఎవరూ సాహసించరు. అయితే భవిష్యత్తులో మూసీ పేరును కూడా తమ బిడ్డలకు పెట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మూసీ నదిపై ప్రత్యేక దృష్టి సారించారు. లండన్, సియోల్ పర్యటనల్లో అక్కడి నదులను చూసి మూసీని కూడా అలా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి లండన్, సియోల్ నగరాల్లో పర్యటించారు. లండన్ లో థేమ్స్ నది కూడా ఒకప్పుడు మూసీలాంటి పరిస్థితే ఎదుర్కొంది. 1957లో థేమ్స్ నదిని బయొలాజికల్లీ డెడ్ అని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకటించింది. తర్వాత బ్రిటన్ ప్రభుత్వం చొరవ తీసుకుని థేమ్స్ నదిని ప్రక్షాళించింది. ఇప్పుడు లండన్ అనగానే థేమ్స్ నది గుర్తొచ్చేలా తయారైంది. అలాగే సియోల్ లోని చియోంగ్ జియోన్ నది కూడా 2003 వరకూ మూసీలాగే ఉండేది. ఆ తర్వాత దాన్ని ప్రక్షాళించారు. ఇప్పుడు ఆ నది అందాలు చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఏటా 2 కోట్ల మంది పర్యాటకులు ఈ నదిని సందర్శిస్తున్నట్టు అంచనా. చియోంగ్ జియోన్ నదిని ప్రక్షాళించిన తర్వాత పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. జీవవైవిధ్యం పెరిగింది. మూసీని కూడా ఇలా ప్రక్షాళించి సుందరంగా తీర్చిదిద్దాలని.. నదికి పునర్జీవం కల్పించాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన.

వాస్తవానికి మూసీ నది ప్రక్షాళన కోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నిజాం కాలంలో మూసీ ఓ వెలుగు వెలిగింది. దీన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అప్పట్లోనే సంకల్పించారు. చివరి నిజాం హయాంలోనే మూసీ సుందరీకరణకు బీజం పడింది. అప్పట్లోనే ఆయన 14 చోట్ల పార్కులను నిర్మించారు. ప్రజలు పార్కుల్లోకి వెళ్లి సేద తీరేవారు. ఆ తర్వాత క్రమంగా ఇది ఆక్రమణలకు గురైంది. దీంతో 1997లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నందనవనం పేరుతో మూసీని సుందరీకరించారని ప్రయత్నించింది. బాపూఘాట్ నుంచి నాగోలు వరకు అభివృద్ధి పనులు చేపట్టింది. వీటివల్ల నిర్వాసితులయిన వెయ్యికి పైగా కుటుంబాలకు కర్మన్ ఘాట్ సమీపంలో నందనవనం పేరుతో కాలనీ నిర్మించి ఇచ్చింది. చాదర్ ఘాట్ ప్రాంతంలో కాంక్రీట్ చానెల్ కూడా పూర్తిచేసింది. పర్యావరణవేత్తల అభ్యంతరాలతో ఈ ప్రాజెక్టు 2001లో ఆగిపోయింది. తర్వాత 2005లో ‘సేవ్ మూసీ’ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని సుందరీకరించాలని నిర్ణయించింది. 330 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. 2013 వరకూ ఇది ముందుకు సాగలేదు. 2013లో నాలుగు ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చాయి. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. మొత్తం 115 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని దీని పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని సంకల్పించింది. పార్కులు, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, సమాంతర రహదారులు, ఇతర వినోద కార్యక్రమాలు అమలనుకుంది. వీటికోసం 16వేల 635 కోట్లతో అంచనాలు రూపొందించింది. నాగోలు, హైకోర్టు, ఛాదర్ ఘాట్ ప్రాంతాల్లో వాకింగ్ ట్రాకులు, పార్కులు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసింది. మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించింది.

ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని ఎలాగైనా ప్రక్షాళించాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ ప్రక్షాళన పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మూసీ ప్రక్షాళన పేరిట భారీ అవినీతి జరగబోతోందనేది బీఆర్ఎస్ ఆరోపణ. 2వేల 400 కిలోమీటర్ల పొడవున్న గంగానది ప్రక్షాళనకోసం మోదీ ప్రభుత్వం 40 వేల కోట్లు ఖర్చు చేసిందని.. 55 కిలోమీటర్ల పొడవున్న మూసీ ప్రక్షాళన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ktr విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డే దీన్ని మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అన్నారని.. ఇప్పుడేమో పునరుజ్జీవ ప్రాజెక్టు అని చెప్తున్నారని విమర్శిస్తోంది. కన్సార్షియంకు 141 కోట్లు అప్పజెప్పిన రేవంత్ ప్రభుత్వం.. తర్వాత పీపీపీ పేరుతో ప్రాజెక్టును వాళ్లకే అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. మూసీ జన్మస్థానమైన వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే.. ఆ నది పునరుజ్జీవం సాధ్యం కాదని చెప్తోంది బీఆర్ఎస్. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంతవరకూ అంచనాలే తయారు కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన ఐదు ఆర్కిటెక్ట్ సంస్థలను కన్సార్షియంగా ఏర్పాటు చేశామని.. ఇందుకోసం 141 కోట్లు మాత్రమే కేటాయించమని తెలిపింది. మూసీ పునర్జీవానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుతో పాటు దాని అమలకు అవసరమైన చర్యలను కూడా ఆ కన్సార్షియం చూసుకుంటుందని వివరించింది. ఇది మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాదని.. పునరుజ్జీవం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించింది.

హైదరాబాద్ లో చెరువులు, కాలువలను ఆక్రమించి కట్టిన వాటిపై హైడ్రా జులుం విదిలిస్తోంది. అలాగే మూసీ ఆక్రమణలను కూడా తొలగించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. 2016 జనవరి 5న ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. అయితే ఈ బఫర్ జోన్ ను ఎక్కడి నుంచి లెక్కిస్తారనే దానిపై స్పష్టత లేదు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడు నెలల కిందట డ్రోన్ సాయంతో మూసీ నదిలో కట్టడాలపై సర్వే చేసింది. మొత్తం 55 కిలోమీటర్ల మూసీ పరీవాహక ప్రాంతంలో దాదాపు 10వేల 600 కట్టడాలు, ఇళ్లు మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్‌లో ఉన్నట్టు గుర్తించింది. నదీ గర్భంలో గుర్తించిన నిర్మాణాలకు గుర్తులు వేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులయ్యే వారి కోసం 16వేల ఇళ్లను కేటాయిస్తూ సెప్టెంబరు 26న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇళ్లకు తరలి వెళ్లేందుకు కొందరు రెడీగానే ఉన్నారు. ఇప్పటికే కొందరు డబుల్ బెడ్ రూం ఇళ్లకు వెళ్లారు. వాళ్ల ఇళ్లను కూల్చేశారు అధికారులు. అయితే కొంతమంది డబుల్ బెడ్ రూం ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు.

అసలు మూసీ నదికి ఎందుకింత ప్రాధాన్యత.? ఇది ఎక్కడ పుడుతుంది.. ఎక్కడ కలుస్తుంది..? దీని చరిత్రేంటి..? మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుడుతుంది. వనమూలికలకు అనంతగిరి నిలయం. అందుకే ఈ నది నీటిని తాగితే రోగాలు నయమవుతాయని భావించేవాళ్లు. ఈ నదిని అక్కడ మూసా లేదా ముచ్‌కుందా అంటారు. దాదాపు 267 కిలోమీటర్లు ప్రయాణించి నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ ప్రాంతంలో ఈసీ, మూసా కలిసి మూసీ నదిగా ప్రయాణం సాగిస్తుంది. నగరంలో దాదాపు 70 కిలోమీటర్ల మేర ఇది ప్రవహిస్తుంది. నగర శివార్లలోని పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలిస్తున్నాయి. దీంతో నది మురికికూపంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన నదుల్లో మూసీకి 22వ స్థానం దక్కిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు మూసీ నది చూస్తే.. ఇది నదేనా అనే అనుమానం కలుగుతుంది.. కానీ గతంలో మూసీ నదికి భయంకరమైన వరదలు వచ్చిన దాఖలాలున్నాయి. 1908లో మూసీకి అత్యంత భారీ వరదలు వచ్చాయి. ఆ ఏడాది సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో మూసీ వరదల వల్ల హైదరాబాద్ నగరం మునిగిపోయింది. దాదాపు 15 వేల మంది చనిపోయారు. 80 వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో వరదలను అడ్డుకునేందుకు ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించింది అప్పటి నిజాం ప్రభుత్వం. ఆ తర్వాత 1930, 1954, 1970, 2000 సంవత్సరాల్లో కూడా మూసీకి వరదలు వచ్చాయి. మూసీ ద్వారా దాదాపు లక్ష ఎకరాల భూమి సాగయ్యేదని అంచనా. తాగు, సాగునీటి అవసరాలకోసం ఈ నీటిని వినియోగించేవారు. అలా ఒకప్పుడు మూసీ నది ఓ వెలుగు వెలిగింది.

ఏదైనా ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఆటంకాలు ఎదురవడం సహజం. అయితే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వాలు నడుం బిగించిన ప్రతిసారీ ఆటంకాలే ఎదురయ్యాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా దీన్ని పూర్తి చేయగలుగుతారా.. అనేది వేచి చూడాలి..