ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూసే కార్యక్రమాల్లో మిస్ వరల్డ్ ఒకటి. కోట్లాది మంది ఈ వేడుకలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వేడుకలకు ఈసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే విశ్వనగరంగా పేరొందిన మన భాగ్యనగరం పేరు.. మిస్ వరల్డ్ వేడుకలతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా మార్మోగడం ఖాయం. అయితే నాణేనికి మరోకోణం ఉన్నట్టే మిస్ వరల్డ్ వేడుకలకు కూడా మరో కోణం ఉంటుంది. అనేక వివాదాలు ఈ ఈవెంట్ చుట్టూ ఉంటాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి అంతర్జాతీయ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్ కు ఒనగూరే ప్రయోజనాలేంటి..?
మిస్ వరల్డ్ పోటీలకోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంటుంది. అలాంటి వేడుక ఈసారి హైదరాబాద్లో జరగబోతోంది. మే 7 నుంచి 31 వరకూ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ప్రారంభ వేడుకలతో పాటు ముగింపు వేడుకలకు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. మిగిలిన ఈవెంట్లను తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 140 దేశాలకు చెందిన సుందరీమణులు మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు.
మిస్ వరల్డ్ పోటీలకు ఘన చరిత్రే ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో మన దేశానికి చెందిన సుందరీమణులు కూడా పాల్గొని టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ ఒకటి. తొలిసారి యునైటెడ్ కింగ్ డమ్ లో 1951లో ఈ పోటీలు జరిగాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనదేశం నుంచి ఆరుగురు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తా ముఖి, 2వేల సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు.
మిస్ వరల్డ్ పోటీలు అనగానే అందాల పోటీ అని చాలా మంది భావిస్తారు. అయితే ఈ పోటీలు కేవలం అందానికి మాత్రమే ప్రతీక కాదు. ఇందులో అనేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మిస్ వరల్డ్ పోటీలు అనేక దశల్లో జరుగుతాయి. ప్రతి దేశం నుంచి ఒకరికి ఈ ఈవెంట్ లో ప్రాతనిధ్యం లభిస్తుంది. మొత్తం పోటీని వివిధ రౌండ్లుగా విభజిస్తారు. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనేది ఒక భాగం. ఇందులో సమాజానికి సహాయపడే ప్రాజెక్ట్స్ ను పరిశీలిస్తారు. రెండోది టాలెంటెడ్ రౌండ్. ఇందులో పోటీదారులు ప్రత్యేక కళలను ప్రదర్శించాల్సి ఉంటుంది. మూడోది మల్టీమీడియా రౌండ్. ఇందులో పార్టిసిపెంట్స్ సోషల్ మీడియాలో తమ ప్రభావాన్ని చూపించే అవకాశాలను గుర్తిస్తారు. నాలుగోది స్పోర్ట్స్ ఛాలెంజ్. ఇందులో భాగస్వాముల శారీరక దృఢత్వాన్ని పరీక్షిస్తారు. ఇక చివరిది హెడ్స్ టు హెడ్ ఛాలెంజ్. ఇందులో పోటీదారుల మేధోశక్తికి పరీక్ష పెడతారు. ఈ దశలన్నింటినీ దాటితేనే విజేతలుగా నిలుస్తారు. చివరి రౌండ్ లో న్యాయమూర్తుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారిని విజేతగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల మానసిక, శారీరక సామర్థ్యాలతో పాటు, సమాజసేవా ప్రణాళికలు, వినయ విధేయతలు, మానవతా విలువలు.. లాంటి అనేక అంశాలను ఈ పోటీల్లో పరిశీలిస్తారు.
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం భారత్ కు కొత్తకాదు. గతంలో బెంగళూరు, ముంబైలలో ఈ ఈవెంట్స్ జరిగాయి. 1996లో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యమిచ్చింది. అప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఈవెంట్ జరిగింది. అమితాబ్ బచ్చన్ కు చెందిన ABCL ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తర్వాత 2024లో ముంబైలోని జియో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఇందులో 2023 మిస్ వరల్డ్ విజేతను ఎంపిక చేశారు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఈ ఈవెంట్ ను హోస్ట్ చేశారు. ఈసారి హైదరాబాద్ ఈ ఘనతను దక్కించుకుంది. గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ ప్రారంభ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫైనల్ ఈవెంట్ కూడా ఇక్కడే జరగనుంది.
మిస్ వరల్డ్ పోటీలపై అనేక వివాదాలున్నాయి. ఆడవాళ్ల అంగాంగ ప్రదర్శనలతో సంస్కృతి సంప్రదాయాలను మంటగలుపుతున్నారనే విమర్శలున్నాయి. పలు మహిళా సంఘాలు, స్వచ్చంధ సంస్థలు ఈ వేడుకలను వ్యతిరేకిస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు అనేక సందర్భాల్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఈ పోటీలు స్త్రీల శరీర అందాలను ప్రదర్శించడానికేనని చాలా మంది మహిళలు ఆరోపిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా పలు మహిళా సంఘాలు ఈ వేడుకలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మరికొన్ని దేశాలైతే ఇలాంటి వేడుకల వల్ల సంస్కృతి, సంప్రదాయాలు మంటగలుస్తున్నాయని విమర్శిస్తున్నాయి. ఇక నల్లజాతి మహిళలపై వివక్ష చూపిస్తున్నారని కొన్ని దేశాలు ఆరోపించాయి. ఈవెంట్లో అడిగే ప్రశ్నలు కూడా గతంలో వివాదానికి దారి తీసిన పరిస్థితులు ఉన్నాయి. సరైన సమాధానాలు ఇచ్చినా వివక్ష చూపించి విజేతలను ఎంపిక చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయనే వార్త బయటకు రాగానే విమర్శలు మొదలయ్యాయి. హైదరాబాద్ తో పాటు పలు ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో కూడా వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆయా ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు రావాలనేది ప్రభుత్వ ఆలోచన. అప్పుడు టూరిజం అభివృద్ధి చెందుతుందని, పర్యాటకులు రావడం ద్వారా అభివృద్ధి జరుగుతుందని భావిస్తోంది. అయితే ఆలయాల వద్ద ప్రపంచ సుందరి పోటీలను ఎలా నిర్వహిస్తారని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అశ్లీలతతో కూడిన మిస్ వరల్డ్ పోటీలను అక్కడ నిర్వహించడమంటే భారతీయ సంస్కృతిని దెబ్బతీయడమేనని ఆరోపించింది.
అయితే ఇలాంటి అంతర్జాతీయ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వాలని ప్రపంచంలోని ఎన్నో దేశాలు పోటీపడుతుంటాయి. ఇలాంటి అరుదైన అవకాశం హైదరాబాద్ కు వచ్చినందుకు సంతోషించాలి. దీని వల్ల హైదరాబాద్ రూపురేఖలు మారే అవకాశం ఉంది. విశ్వనగరంగా ఎదగాలని భావిస్తున్న హైదరాబాద్ కు మిస్ వరల్డ్ ఈవెంట్ కచ్చితంగా బోనస్ అవుతుందనే భావించాలి. ఈ ఈవెంట్ ద్వారా భారీ స్థాయిలో టూరిజం, హోటల్ పరిశ్రమ, వాణిజ్య కార్యకలాపాలు లాభపడతాయి. హైదరాబాద్‌లో ఈ పోటీలు జరగడం వల్ల అంతర్జాతీయ ఫోకస్ లభిస్తుంది. దేశవిదేశాల నుంచి సెలబ్రిటీలు వస్తారు. హోటల్ పరిశ్రమ కళకళలాడుతుంది. రవాణా రంగానికి మేలు జరుగుతుంది. నగరంతో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల గురించి దేశవిదేశాలకు తెలుస్తుంది. హైదరాబాద్ కు బ్రాండింగ్ లభిస్తుంది. భవిష్యత్తులో పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి ఈవెంట్లు నిర్వహించేందుకు లండన్, పారిస్, న్యూయార్క్ లాంటి నగరాలు ముందుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ స్థాయికి ఎదిగేందుకు అవకాశం లభిస్తుంది. ఏ ఈవెంట్ జరిగినా మంచిచెడులు ఉంటాయి. అయితే మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది మన విచక్షణ.