Balochistan: పాకిస్తాన్ జాతిపితగా పిలువబడే ‘‘మహ్మద్ అలీ జిన్నా’’ బలూచిస్తాన్‌కి చేసిన నమ్మక ద్రోహం కారణంగా ఆ ప్రాంతం కొన్ని దశాబ్ధాల కాలంగా రగులుతూనే ఉంది. పాక్ నుంచి విముక్తి, తమ వనరులపై హక్కుల కోసం బలూచ్ ప్రజలు అనేక సార్లు తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం సైన్యం సాయంతో, కుట్రల సాయంతో ఈ తిరుగుబాటుని అణచివేస్తూనే ఉంది. తాజాగా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాక్ రైల్వేకి చెందిన జఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేయడం సంచలనంగా మారింది. 400 మందికి పైగా ప్రయాణికుల్ని బందీలుగా చేసుకున్నారు. వీరందర్ని విడిపించేందుకు పాక్ ఆర్మీ ఆపరేషన్ చేపడుతోంది.
పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నా బలూచ్ ప్రజలకు చేసిన ద్రోహమే ఈ తిరుగుబాటుకు కారణమైంది. బలూచ్ ప్రజలు 958-59, 1962-63, 1973-77లో స్వాతంత్ర్యం కోసం హింసాత్మక తిరుగుబాటు చేశారు. పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్సు అయిన బలూచిస్తాన్ ఖనిజ, సహాజవాయు సంపదకు నెలవు. ఈ సంపదను కొల్లగొట్టి పంజాబ్ ప్రజలు వాడుకుంటున్నారనేది బలూచ్‌లు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ఈ రాష్ట్రం గుండానే వెళ్తుంది. గ్వాదర్ పోర్టు కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. దీంతో తమ సహజవనరులను పాకిస్తాన్ దోపిడీ చేస్తుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
2004లో తాజా సాయుధ తిరుగుబాటు చెలరేగింది. 2006లో పాకిస్తాన్ దళాలు బలూచ్ గిరిజన నాయకుడు అక్బర్ ఖాన్ బుగ్టి హత్య తర్వాత ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది. బలూచిస్తాన్‌లోని సహజ సంపదలో ఎక్కువ భాగం ఇవ్వడంతో పాటు, స్వయంప్రతిత్తిని బుగ్టి డిమాండ్ చేశారు. దీనికి ముందు 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత బలూచ్ ఉద్యమం ఎగిసిపడింది. అయితే, ఈ ఉద్యమాన్ని అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో తీవ్రంగా అణచివేశాడు.
Read Also: Vijayasai Reddy: భయం అనేది నా రక్తంలో లేదు.. పార్టీని విడటంపై విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
1973లో భుట్టో, అక్బర్ ఖాన్ బుగ్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఇరాన్ రాయబార కార్యాలయంలో బలూచ్ తిరుగుబాటుదారుల కోసం ఉద్దేశించిన ఆయుధాలు దొరికాయనే కుట్రతో పెద్ద ఎత్తున సైనిక చర్యకు ఆదేశించాడు. 1977 వరకు 4 ఏళ్ల పాటు సాయుధ తిరుగుబాటు జరిగింది. దీనిని నాలుగో బలూచ్ వివాదంగా పిలుస్తారు. నివేదికల ప్రకారం, మర్రి, మెంగల్ మరియు బుగ్టి గిరిజన నాయకుల నాయకత్వంలో దాదాపు 55,000 మంది బలూచ్ గిరిజనులు 80,000 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బందిపై పోరాడారు. పాకిస్తాన్ వైమానిక దళం గ్రామాలపై బాంబు దాడి చేసి వేలాది మంది బలూచ్ పౌరులను చంపింది. ఈ ఉద్యమం ఎంతలా చెలరేగిందంటే, తమ ప్రాంతంలోని బలూచిస్తాన్‌లోకి ఈ ఉద్యమం వ్యాప్తి చెందుతుందని భయపడిన ఇరాన్, పాక్‌కి సైనిక సాయం చేసింది. 1977లో జనరల్ జియా ఉల్ హక్ సైనిక తిరుగుబాటు చేసి భుట్టోని గద్దె దించి, బలూచ్ గిరిజనులకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో పోరాటం ముగిసింది.
దీనికి ముందు, 1954లో పాకిస్తాన్ వన్ యూనిట్ విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రావిన్సుల్ని పునర్వ్యవస్థీకరించింది. బలూచిస్తాన్ వన్ యూనిట్ కింద ఇతర ప్రావిన్సులతో విలీనం చేయడం ద్వారా స్వయంప్రతిపత్తిని తగ్గించింది. ఇది బలూచ్ నాయకుల్లో తీవ్ర ఆగ్రాహాన్ని రేకెత్తించింది. ఖాన్ ఆఫ్ కలాత్ అయిన నవాజ్ నౌరోజ్ ఖాన్ 1958లో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం ప్రారంభించాడు. అయితే, నౌరోజ్‌ని లొంగిపోతే ఏం చేయమనే హామీ ఇచ్చిన పాకిస్తాన్, ఆ తర్వాత ఆయనను అతడి కుమారులను అరెస్ట్ చేసి, అతడి ఐదుగురు బంధువుల్ని ఉరితీసింది. ఈ ద్రోహం బలూచ్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. దీని తర్వాత 1963లో మూడో బలూచ్ సంఘర్షణ జరిగింది. 1969లో సాధారణ క్షమాభిక్ష మరియు బలూచ్ వేర్పాటువాదులను విడుదల చేయడంతో తిరుగుబాటు ముగిసింది.
జిన్నా నమ్మక ద్రోహం, మోసం:
1947 దేశ విభజన సమయంలో బలూచిస్తాన్ నాలుగు రాజరిక రాష్ట్రాలుగా కలత్, ఖరన్, లాస్ బేలా, మకరన్‌గా ఉండేది. వారు భారత్ లో కానీ, పాక్‌లో కానీ కలవడం లేదా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉంది. జిన్నా ప్రభావంతో మూడు ప్రాంతాలు పాక్‌లో విలీనమైనప్పటికీ, కలాత్ స్వతంత్య్రంగా ఉండాలని భావించింది. తన కేసును బ్రిటీష్ క్రౌన్ ముందు వాదించడానికి మహ్మద్ అలీ జిన్నానున తన న్యాయ సలహాదారుగా ఖాన్ ఆఫ్ కలాత్ అయిన మీర్ అహ్మద్ యార్ ఖాన్ నియమించుకున్నారు.
ఆగస్టు 4, 1947న ఢిల్లీలో లార్డ్ మౌంట్‌బాటెన్, కలాట్ ఖాన్, జవహర్‌లాల్ నెహ్రూ హాజరైన సమావేశంలో, జిన్నా కలాత్ స్వాతంత్ర్యంగా ఉండటాన్ని సమర్థించారు. జిన్నా పట్టుబట్టడంతో ఖరన్ , లాస్ బేలను కలాత్‌లో విలీనం చేసి పూర్తి బలూచిస్తాన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కలాత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
అయితే, 1947 అక్టోబర్లో జరిగిన సమావేశంలో జిన్నా కలాత్ కూడా పాక్‌లో విలీనం కావాలని ఒత్తిడి తెచ్చాడు. దీనిని ఖాన్ ఆఫ్ కలాత్ వ్యతిరేకించాడు. భారత్ సహా అనేక మార్గాల ద్వారా సాయం కోరాడు. చివరకు ఎక్కడి నుంచి సాయం అందకపోవడంతో లొంగిపోయాడు. మార్చి 26, 1948లో పాక్ సైన్యం ముందు లొంగిపోవాల్సి వచ్చింది. ఖాన్ ఆఫ్ కలాత్ విలీన పత్రంపై సంతకం చేసినప్పటికీ ఆయన సోదరుడు ప్రిన్స్ అబ్దుల్ కరీం 1948లో పాక్‌పై తిరుగుబాటు చేశాడు. జిన్నా ద్రోహం, పాక్ సైనిక శక్తితో బలూచిస్తాన్‌ని పూర్తిగా వశం చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాటు జరుగుతూనే ఉందింది.