Israel-Shivaji statue: ఇజ్రాయెల్‌లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!

Who Are Bene Israel Explained

Who Are Bene Israel Explained

Explainer: 1674 జూన్ 6… రాయగఢ్ కోటలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. ఆ రోజుతో స్వరాజ్యానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు 352 సంవత్సరాల తర్వాత…ఇండియాకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌లో.. శివాజీ మహారాజ్‌ విగ్రహం ఏర్పాటు అవుతోంది. ఇంతకీ ఒక హిందూ రాజుకు… ఒక యూదు దేశంలో విగ్రహం ఎందుకు పెడుతున్నారనే డౌట్ వచ్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే… మనల్ని 2వేల ఏళ్ల వెనక్కి తీసుకెళ్లే చరిత్ర కనిపిస్తుంది.

బెనె ఇజ్రాయెల్‌ అంటే ఎవరు?

అది క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం…పశ్చిమ ఆసియాలో యూదులపై హింస పెరుగుతోంది. ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు యూదులు సముద్ర ప్రయాణం ప్రారంభించారు. అయితే వారి నౌక ప్రమాదానికి గురైంది. బతికి బయటపడ్డ కేవలం 14మందిలో ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలున్నారు. వారంతా మహారాష్ట్రలోని కొంకణ్ తీరానికి చేరుకున్నారు. వారికి ఆ సమయంలో తెలియదు…తాము చేరుకున్న ఈ నేల తమ భవిష్యత్తును మాత్రమే కాదు… తమ జాతి చరిత్రనే మార్చబోతోందని వారు ఊహించలేదు. ఆ చిన్న సమూహం క్రమంగా కొంకణ్ ప్రాంతంలో స్థిరపడింది. కాలం గడిచింది. తరాలు మారాయి. కానీ వారంతా తమ మూలాలను మరచిపోకుండా ఉన్నారు. వారే బెనె ఇజ్రాయెల్.

×
×
Ad

ఇండియా చరిత్రలో అత్యంత పురాతన యూదు సమాజాలలో ఒకటి. వారు మరాఠీ మాట్లాడేవారు. స్థానిక దుస్తులు ధరించేవారు. స్థానిక పండుగల్లో పాల్గొనేవారు. కానీ తమ ప్రార్థనలు మాత్రం హెబ్రూ భాషలోనే చేసేవారు. తమ మతాన్ని కాపాడుకుంటూనే…భారతీయ సంస్కృతిలో భాగమైపోయారు.

వారి జీవన విధానంలో ఒక ప్రత్యేకత ఉండేది. శనివారం రోజును పవిత్ర దినంగా భావించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు ఎలాంటి పని చేసేవారు కాదు. నూనె గానుగలు నడిపే వృత్తిలో ఉన్నప్పటికీ శనివారం మాత్రం విశ్రాంతి తీసుకునేవారు. అందుకే స్థానికులు వారిని “శనివార్ తెలీలు” అని పిలిచేవారు. ఇది వినడానికి చిన్న విషయం లాగా అనిపించవచ్చు కానీ ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో యూదులు తమ మతాన్ని ఆచరించినందుకే హింసకు గురవుతున్న సమయంలో…వారికి ఇండియాలో మాత్రం తమ విశ్వాసాన్ని పాటించే స్వేచ్ఛ దక్కింది.

ఛత్రపతి సైన్యంలో యూదులు:

అందుకే చరిత్రకారులు యూదులను ఎప్పుడూ హింసించని దేశంగా భారత్‌ను వర్ణిస్తారు. ఇలా యూదులు ఎంతో స్వేచ్ఛగా నివసిస్తున్న సమయంలో ఇండియా 17వ శతాబ్దంలోకి అడుగుపెట్టింది. దక్షిణ భారతదేశ రాజకీయ పటాన్ని మార్చేస్తున్న ఒక వ్యక్తి పేరు మారుమోగుతోంది. అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘల్ సామ్రాజ్య విస్తరణను ఎదుర్కొంటూ.. స్వరాజ్యాన్ని నిర్మిస్తూ.. కోటలపై కోటలు జయిస్తూ… ఒక శక్తివంతమైన మరాఠా రాజ్యానికి పునాదులు వేస్తున్నారు. ఈ పోరాటంలో శివాజీ మహారాజ్ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. సామ్రాజ్యాలు కేవలం రాజులతో కాకుండా.. విశ్వాసంతో నిలబడే మనుషులతో నిర్మితమవుతాయని తెలుసుకున్నారు. అందుకే ఆయన వివిధ వర్గాలకు చెందిన ప్రతిభావంతులను తన సైన్యంలో చేర్చుకున్నారు. అలాంటి వారిలో బెనె ఇజ్రాయెల్ యోధులు కూడా ఉన్నారని అనేక చారిత్రక రచనలు చెబుతున్నాయి.

శివాజీ నౌకాదళంలో బెనె ఇజ్రాయెల్ కీలక పాత్ర:

కొంకణ్ తీర ప్రాంతంలో పెరిగిన వీరికి సముద్ర మార్గాలపై మంచి అవగాహన ఉండేది. యుద్ధ నైపుణ్యాలు కూడా ఉండేవి. దీంతో కొందరు శివాజీ సైన్యంలో, మరికొందరు నౌకాదళంలో చోటు సంపాదించారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత్‌లో శక్తివంతమైన నౌకాదళం అవసరాన్ని మొదటిసారి స్పష్టంగా గుర్తించిన రాజుల్లో శివాజీ మహారాజ్ ఒకరు. పోర్చుగీస్‌, డచ్, బ్రిటిష్…ఇలా అందరూ సముద్ర మార్గాల ద్వారా ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న కాలమది. అలాంటి సమయంలో శివాజీ నిర్మించిన నౌకాదళం మరాఠా శక్తికి వెన్నెముకగా మారింది. చరిత్రకారుల కథనాల ప్రకారం… బెనె ఇజ్రాయెల్ సమాజానికి చెందిన కొందరు యోధులు ఈ నౌకాదళంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆరోన్ చుర్రికర్ అనే వ్యక్తి మరాఠా నౌకాదళంలో నాయక్ హోదా పొందినట్లు కొన్ని పాత రచనలు చెబుతున్నాయి. మరికొందరు కోటల రక్షణ బాధ్యతలు కూడా చేపట్టినట్లు ప్రస్తావనలు కనిపిస్తాయి.

ఇలా భారత స్వరాజ్యం కోసం జరుగుతున్న చారిత్రక ఉద్యమంలో యూదులు భాగమయ్యారు. ఒక యూదు సమాజం… ఒక హిందూ రాజు నిర్మిస్తున్న రాజ్యంలో కీలక పాత్ర పోషించడం ఈ కథను ప్రత్యేకంగా నిలబెడుతోంది. శివాజీ మహారాజ్ మరణం తర్వాత కూడా బెనె ఇజ్రాయెల్ సైనిక సంప్రదాయం కొనసాగింది. 18వ శతాబ్దంలో భారత పశ్చిమ తీరాన్ని శాసించిన ఆంగ్రే నౌకాదళంలో కూడా వారు సేవలందించారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలన ప్రారంభమైంది. కానీ బెనె ఇజ్రాయెల్ యోధుల ధైర్యం తగ్గలేదు. ఆంగ్లో-మైసూరు యుద్ధాలు, ఆంగ్లో-మరాఠా యుద్ధాలు, అఫ్ఘాన్ యుద్ధాలు, బర్మా యుద్ధాలు, 1857 తిరుగుబాటు…ఇలా ఎక్కడ చూసినా వారి సేవల ప్రస్తావనలు కనిపిస్తాయి. జనాభాలో చిన్న సమాజమే అయినప్పటికీ… సైన్యంలో మాత్రం అసాధారణమైన గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత కాలం మరోసారి మలుపు తిరిగింది.

1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. శతాబ్దాలుగా భారత్‌లో జీవిస్తున్న వేలాది బెనె ఇజ్రాయెల్ కుటుంబాలు తమ పూర్వీకుల మాతృభూమిగా భావించిన ఇజ్రాయెల్‌కు వలస వెళ్లాయి. 1960ల నాటికి వేలాది మంది అక్కడ స్థిరపడ్డారు. నేడు వారి వారసులు 50 వేల మందికి పైగా ఉన్నారు. వారు ఇజ్రాయెల్ సైన్యంలో, రాజకీయాల్లోనే కాకుండా విద్యా రంగంలోనూ ఉన్నారు.

కానీ ఇప్పటికీ చాలామంది మరాఠీ మాట్లాడతారు. భారతీయ వంటకాలు చేస్తారు. తమ పూర్వీకులు వచ్చిన కొంకణ్ నేలను గౌరవంగా గుర్తు చేసుకుంటారు. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్‌లో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయడం ఒక సాధారణ సాంస్కృతిక కార్యక్రమంలా చూడకూడదు. ఇది రెండు దేశాల మధ్య శతాబ్దాల అనుబంధానికి ప్రతీకగా చూడాలి. ఒకప్పుడు భారత్‌ వారికి ఆశ్రయం ఇచ్చింది. ఒకప్పుడు శివాజీ మహారాజ్ నిర్మించిన స్వరాజ్యంలో వారి పూర్వీకులు సేవలందించారు.

ఇప్పుడు అదే యూదు సమాజపు వారసులు… ఆ మహారాజ్‌కు తమ దేశంలో గౌరవ స్థానం కల్పిస్తున్నారు. ఇక చరిత్రలో కొన్ని విగ్రహాలు రాతితో నిర్మించబడతాయి. మరికొన్ని కృతజ్ఞతతో నిర్మించబడతాయి. ఇజ్రాయెల్‌లో నిలవబోయే శివాజీ మహారాజ్ విగ్రహం… అలాంటి కృతజ్ఞతకు… స్నేహానికి…2వేల ఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలవబోతోంది.