RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్‌ బుక్‌ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!

Rupee Exrash Explained Reasons

Rupee Exrash Explained Reasons

Rupee Crash Explained: విదేశాల్లో చదువు… ఆపై అక్కడే ఉద్యోగం…చాలామంది భారతీయ విద్యార్థుల కల. కానీ ఆ కల ఇప్పుడు ఎంతోమందికి పీడకలగా మారుతోంది. చేతిలో యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఉన్నా.. జేబులో ఉన్న డబ్బులు సరిపోవడం లేదు. పడిపోతున్న రూపాయి విలువ విదేశాల్లో మన విద్యార్థుల కడుపు మాడుస్తోంది. కనీసం ఒక్కపూట భోజనం కోసం వాళ్లు పడుతున్న ఆకలి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డాలర్ పౌండ్ల దెబ్బకు విదేశాల్లో మన విద్యార్థుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది.

క్షణాల్లోనే బుక్‌ చేసుకోవాలి:

లండన్‌లో ఎనిమిది పౌండ్లు ఉండే శాండ్‌విచ్ కొనాలంటే మన విద్యార్థులకు తలకు మించిన భారం అవుతోంది. డస్ట్‌బిన్‌లో పడేయడానికి కొద్ది గంటల ముందు మాత్రమే దాని ధర రెండు.. మూడు పౌండ్లకు తగ్గుతుంది. ఇలా గడువు ముగియడానికి దగ్గరగా ఉన్న ఆహారాన్ని తక్కువ ధరకు అమ్మే… Too Good To Go లాంటి యాప్‌ల మీద విద్యార్థులు బతకడానికి ఆధారపడుతున్నారు. ఆఫర్ రాగానే క్షణాల్లో యాప్‌లో బుక్ చేసుకోకపోతే ఇతరులు దానిని దక్కించుకుంటారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేసి ఇటీవలే తిరిగి వచ్చిన ఓ స్టూడెంట్ ఇలాంటి కష్టాలను ఎన్నో అనుభవించారు. రూపాయి విలువ పడిపోవడంతో విదేశాల్లో చదివే మన విద్యార్థులు పొదుపు కోసం ఇలా ప్రతిరోజూ పోరాటం చేయాల్సి వస్తోంది.

విదేశీ విద్య అంటేనే ఒక లగ్జరీ అనే భ్రమలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు భారత్ చర్యలు చేపడుతున్నా.. చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. రోజువారీ ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్స్‌తో పాటు రైల్వే స్టేషన్లు.. డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో నేలలు తుడిచే పనులు కూడా చేస్తున్నారు. డబ్బులు ఆదా చేసేందుకు రోజుకు ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం ఒక్కోసారి పస్తులుండటం చేస్తున్నారు. ప్రజా రవాణా ఖర్చులను భరించలేక పది కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణిస్తున్నారు. కేవలం ఆకలిని జయించడమే వారి దినచర్యగా మారిపోతోంది

×
×
Ad

భారతీయ రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా దారుణంగా క్షీణిస్తోంది. 2009 తర్వాత రూపాయి సగానికి పైగా తన విలువను కోల్పోయింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 96 మార్క్ దాటింది. త్వరలోనే 100 మార్క్‌ను కూడా తాకే అవకాశం ఉంది. బలమైన డాలర్ గ్లోబల్ క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్, ఇరాన్ యుద్ధం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. గతంలో పౌండ్, యూరోలకే 100 రూపాయలు దాటిన పరిస్థితి ఉండగా ఇప్పుడు డాలర్ కూడా అదే దారిలో పయనిస్తోంది. దీంతో విదేశాలకు డబ్బు పంపే మధ్యతరగతి తల్లిదండ్రులపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోంది.

రూపాయి పతనం అనేది యూనివర్సిటీలు అధికారికంగా ప్రకటించని అదనపు ఫీజు పెంపు లాంటిది. చాలా కుటుంబాలు ముందుగా ట్యూషన్ ఫీజు..విమాన ఖర్చులు మాత్రమే లెక్కేసుకుని బడ్జెట్ వేసుకుంటారు. కానీ కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్.. వీసా రెన్యూవల్.. చలికాలం దుస్తులు..రోజువారీ ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయి. విద్యా రుణాలు రూపాయల్లో తీసుకుని.. ఫీజులు డాలర్లు.. పౌండ్లలో కట్టాల్సి రావడంతో బడ్జెట్ తలకిందులవుతోంది. కోర్సు చివరి సెమిస్టర్ వచ్చేసరికి తీసుకున్న రుణం సరిపోక టాప్-అప్ లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కరెన్సీ పతనం వల్ల ప్రతి అదనపు ఖర్చు విద్యార్థుల మెడకు ఉరితాడులా మారుతోంది.

అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రూపాయి పతనంతో పాటు కఠినమవుతున్న వీసా నిబంధనలు కూడా వారిని భయపెడుతున్నాయి. ఇమ్మిగ్రేషన్, హెచ్-1బీ వీసా, ఓపీటీ ప్రోగ్రామ్‌లపై నెలకొన్న అనిశ్చితి విద్యార్థుల్లో భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఉచితంగా పంపిణీ చేసే కూరగాయలు పాలు తెచ్చుకుని సరిపెట్టుకుంటున్నారు. ఒకే గదిలో ఏడెనిమిది మంది కలిసి ఉంటూ అద్దెను పంచుకుంటున్నారు. ఒకవేళ సరైన ఉద్యోగం రాకపోతే లక్షల రూపాయల రుణాన్ని ఎలా తీర్చాలన్న భయం వారిని అడుగడుగునా వెంటాడుతోంది.

డబ్బులు ఆదా చేసే క్రమంలో విద్యార్థులు భౌతికంగా.. మానసికంగా ఎంతో నష్టపోతున్నారు. కనీస పోషకాహారం లేక బరువు తగ్గిపోవడమే కాకుండా, తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోజులో ఎక్కువ భాగం బతుకుదెరువు కోసం పనిచేయాల్సి రావడంతో చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని ప్రభావం నేరుగా వారి అకడమిక్ గ్రేడ్స్‌పై పడుతోందని మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారని పలువురు పీహెచ్‌డీ స్కాలర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి జీవితం కోసం వెళ్లిన విద్యార్థులు ఇప్పుడు కనీస మనుగడ కోసం పోరాడుతున్నారు. పడిపోతున్న రూపాయి వారి రోజువారీ భోజనాన్నే కాదు భవిష్యత్తును కూడా దెబ్బతీస్తోంది.

:ఫణి కుమార్ (NTV DIGITAL)