Site icon NTV Telugu

Union Budget 2026: ఇళ్ల ధరలు తగ్గుతాయా? బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మిడిల్‌క్లాస్

Union Budget 2026

Union Budget 2026

ఇల్లు కొనడమనేది అతి పెద్ద ఆర్థిక భారంగా మారిపోయిన రోజులివి. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనడం తలకు మించిన భారంగా మారింది. EMIలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు, నిర్మాణ వ్యయాలను భరించడం చాలా కష్టంగా ఉంటుంది.

అందుకే 2026 బడ్జెట్‌పై హౌసింగ్ రంగం ఆశలు పెట్టుకుంది. గత బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి కేటాయింపులు పెరగడం, ట్యాక్స్ రాయితీలు డిమాండ్‌ను కొంత బలపరిచాయి. ఈ సారి విధాన మార్పులు కావాలని పరిశ్రమ కోరుకుంటోంది. ముఖ్యంగా అఫోర్డబుల్ హౌసింగ్ నిర్వచనాన్ని విస్తరించడం, నిర్మాణ ఖర్చులు తగ్గించే చర్యలు తీసుకోవడం, ఫస్ట్‌టైమ్ హోమ్ బయ్యర్లకు మరింత సపోర్ట్ ఇవ్వడం చేయాలని ఆశిసిస్తోంది. ఫిబ్రవరి ఒకటి బడ్జెట్‌లో ఈ అంశాలపై ప్రభుత్వం ఏ స్థాయిలో స్పందిస్తుందన్నదే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎదురుచూస్తున్న కీలక ప్రశ్న.

గత బడ్జెట్‌లో ప్రభుత్వం హౌసింగ్ రంగానికి కొంత ఊరటనిచ్చింది. 2025-26 బడ్జెట్‌లో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు 96,777 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది గతంతో పోలిస్తే సుమారు 17 శాతం పెరుగుదల. ఈ నిధులు ప్రధానంగా అర్బన్ హౌసింగ్, స్మార్ట్ సిటీలు, అమృత్ లాంటి పథకాలకు వెళ్లాయి. అదే సమయంలో ఆదాయపు పన్ను మినహాయింపులు పెరగడం వల్ల మధ్యతరగతి చేతిలో కొంత అదనపు డబ్బు ఉండటంతో ఇళ్ల కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది.

ఇక నిర్మాణ వ్యయాల విషయానికి వస్తే, సిమెంట్‌పై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊరటగా మారింది. దీని వల్ల నిర్మాణ ఖర్చులు కొంత తగ్గాయి. కానీ ఇది సరిపోదని డెవలపర్లు చెబుతున్నారు. ఇంకా చాలా రా-మెటీరియల్స్‌పై పన్ను భారం ఎక్కువగానే ఉందన్నది వారి వాదన. ఈ సమయంలో 2026 బడ్జెట్‌లో అఫోర్డబుల్ హౌసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పరిశ్రమ కోరుతోంది. ప్రస్తుతం అఫోర్డబుల్ హౌసింగ్‌కు ఉన్న ధర పరిమితిని పెంచాలని డెవలపర్ల సంఘం క్రెడై డిమాండ్ చేస్తోంది. ఇళ్ల ధరలు భారీగా పెరిగిన పరిస్థితుల్లో, పాత ధర పరిమితులు వాస్తవానికి సరిపోవడం లేదని చెబుతున్నారు. ఈ పరిమితి పెరిగితే మరిన్ని ఇళ్లు అఫోర్డబుల్ కేటగిరీలోకి వస్తాయి. అప్పుడు వినియోగదారులకు తక్కువ జీఎస్టీ ప్రయోజనం లభిస్తుంది.

ఇటు డెవలపర్ల నిర్మాణ పనులపై జీఎస్టీ తగ్గించాలన్నది మరో కీలక డిమాండ్‌గా వినిపిస్తోంది. ప్రస్తుతం వర్క్ కాంట్రాక్టులపై 18 శాతం జీఎస్టీ పడుతోంది. దీన్ని 12 శాతానికి తగ్గిస్తే, అపార్ట్మెంట్ ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని వల్ల చివరికి లాభం హోమ్ బయ్యర్‌కే చేరుతుందని రియల్ ఎస్టేట్ రంగం భావిస్తోంది. ఫస్ట్‌టైమ్ హోమ్ బయ్యర్ల విషయంలో కూడా బడ్జెట్ నుంచి ఆశలు ఉన్నాయి. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ లాంటి పథకాలను మళ్లీ తీసుకురావాలని పరిశ్రమ సూచిస్తోంది. ఈ స్కీమ్ ఉంటే లోన్‌పై వడ్డీ భారం తగ్గి, కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి పెద్ద సాయం అవుతుంది. మొత్తంగా చూస్తే 2026 బడ్జెట్‌లో హౌసింగ్ రంగం కోరుకుంటున్నది కొత్త స్కీమ్‌లు కాదు. ఉన్న వ్యవస్థను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చే నిర్ణయాలు.

నిర్మాణ ఖర్చులు తగ్గితే, అఫోర్డబుల్ హౌసింగ్ పరిధి పెరిగితే, హోమ్ లోన్లు సులభమైతేనే ఇల్లు కొనడం మధ్యతరగతి కలగా కాకుండా సాధ్యమైన లక్ష్యంగా మారుతుందని పరిశ్రమ భావిస్తోంది. ఫిబ్రవరి ఒకటిన వచ్చే బడ్జెట్ ఆ దిశగా ఎంత ముందడుగు వేస్తుందన్నదే ఇప్పుడు అందరి దృష్టి.

ALSO READ: బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు న్యాయం జరుగుతుందా? పన్ను నిబంధనలు మారతాయా?

Exit mobile version