Site icon NTV Telugu

Tiananmen: చరిత్ర నుంచి రక్తపాతాన్ని తుడిచివేసే ప్రయత్నం.. చైనా బరితెగింపు రాజకీయం!

China Erases History Activists Face Jail

China Erases History Activists Face Jail

ఇది ఒక కోర్టు కేసు కాదు.. ఇది ఒక జ్ఞాపకాన్ని చంపే ప్రయత్నం. 1989 జూన్ 4.. టియానన్‌మెన్ స్క్వేర్‌లో చైనీస్ సైన్యం కాల్పులు జరిపిన రోజు అది! వేలమంది యువకులు నేలకొరిగిన ఆ రాత్రి నుంచి చైనా ఒక పని చేస్తూనే ఉంది.

ఆ రక్తపాతాన్ని చరిత్ర నుంచి తుడిచివేసే పనిని బహిరంగంగానే చేస్తోంది. పుస్తకాల నుంచి తొలగించడం, మాటల నుంచి మాయం చేయడం. జ్ఞాపకాలనే నేరంగా మార్చడం చైనాకు అలవాటుగా మారింది. కానీ ఆ మౌనానికి ఎదురుగా ఒక నగరం నిలబడింది. అదే హాంకాంగ్. ప్రతి ఏడాది వర్షం వచ్చినా, పిడుగులు పడుతున్నా వేలాది మంది హాంకాంగ్ ప్రజలు నాటి ఘటనలో చనిపోయిన వారికి నివాళిగా కొవ్వొత్తి వెలిగిస్తారు. చనిపోయినవాళ్ల పేర్లు గుర్తు చేసుకుంటారు. ఇప్పుడదే పాపమైంది. హాంకాంగ్‌లో ఆ జ్ఞాపకానికి శిక్ష పడుతోంది. నివాళులు అర్పించింనుందుకు నాలుగేళ్లుగా జైలులో ఉన్న ఇద్దరు కార్యకర్తలను ఇప్పుడు కోర్టు ముందుకు తీసుకువస్తున్నారు.

ఇది దేశ భద్రత కేసు అంటూ అధికారుల ప్రకటిస్తున్నారు. అయితే అసలు భయం మాత్రం ఇది కాదు..! చరిత్రను గుర్తుపెట్టుకుంటే ఇదే నీ భవిష్యత్‌ అని ప్రభుత్వం నేరుగా చెస్తున్న హెచ్చరిక ఇది. ఇంతకీ హాంకాంగ్‌ ప్రజలు ఏం చేయాలి? చరిత్రను మర్చిపోవాలా? లేదా నిజం కోసం నిలబడాలా?

అది 1989 జూన్ 4.. బీజింగ్‌లోని టియానన్‌మెన్ స్క్వేర్ ఆ రాత్రి ఒక యుద్ధభూమిగా మారింది. అవినీతి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనకు దిగిన విద్యార్థులు, కార్మికులపై చైనా సైన్యం కాల్పులు జరిపింది. చేతుల్లో ఆయుధాలు లేని యువతపై ట్యాంకులు దూసుకొచ్చాయి.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం పారిపోతున్నవాళ్లను కూడా కాల్చారు. రోడ్లపై శవాలు పేరుకుపోయాయి. ఆసుపత్రుల దగ్గర కూడా కాల్పులు జరిగాయి. ఎంత మంది చనిపోయారన్నదానిపై ఇప్పటికీ స్పష్టమైన సంఖ్య లేదు. చైనా ప్రభుత్వం అధికారికంగా ఒక్క నంబర్ కూడా ప్రకటించలేదు. రెడ్ క్రాస్ మొదట 2,600 మంది మరణించారని అంచనా వేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వందల నుంచి వేల వరకు ప్రాణాలు పోయాయని చెబుతున్నాయి. ఆ రాత్రి తర్వాత పదివేల మందిని అరెస్ట్ చేశారు. వేల కుటుంబాలకు తమ పిల్లల గతి ఏంటో కూడా తెలియకుండా పోయింది. ఆ రోజు నుంచి చైనాలో ఒక సంపూర్ణ నిషేధం అమలులోకి వచ్చింది. టియానన్‌మెన్ గురించి మాట్లాడటం నేరం. జూన్ 4ని గుర్తు చేసుకోవడం నేరం. చనిపోయినవాళ్ల పేర్లు చెప్పడం నేరం. ఒక దేశం తన చరిత్రనే నిషేధించుకుంది.

అయితే హాంకాంగ్‌ మాత్రం ఆ జ్ఞాపకాన్ని వదల్లేదు. 1990 నుంచి ప్రతీ ఏడాది జూన్ 4న హాంకాంగ్‌లోని విక్టోరియా పార్క్‌లో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతోంది. కొన్ని సంవత్సరాల్లో లక్ష మందికిపైగా ప్రజలు చేరారు. చైనా అంతటా నిషేధం ఉన్నా హాంకాంగ్‌లో మాత్రం టియానన్‌మెన్ జ్ఞాపకం బతికింది. ఈ కార్యక్రమాన్ని మూడు దశాబ్దాల పాటు నిర్వహించిన సంస్థ పేరు హాంకాంగ్ అలయన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ పేట్రియాటిక్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్స్ ఆఫ్ చైనా.

ఈ అలయన్స్‌లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులే ఇప్పుడు కోర్టులో నిలబడ్డారు. అందులో ఒకరు చౌ హాంగ్-టుంగ్. ఆమె ఒక లాయర్, మానవ హక్కుల కార్యకర్త. టియానన్‌మెన్ బాధితులకు న్యాయం కావాలని బహిరంగంగా మాట్లాడిన మహిళ. ఇకో మరో పేరు లీ చెక్-యాన్. అతను ఒక ట్రేడ్ యూనియన్ నేత. శ్రామిక హక్కుల కోసం పోరాడిన కార్యకర్త. మూడున్నర దశాబ్దాల పాటు టియానన్‌మెన్ స్మరణ కార్యక్రమాల్లో ముందుండిన వ్యక్తి. వీళ్లిద్దరూ ఆయుధాలు ఎత్తలేదు. ఎవరినీ రెచ్చగొట్టలేదు. ఒక్క కొవ్వొత్తి వెలిగించారు. ఒక్క జ్ఞాపకం నిలబెట్టారు. దాన్ని కూడా ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయిది.

ఇక 2020లో చైనా విధించిన నేషనల్ సెక్యూరిటీ లా హాంకాంగ్‌పై పూర్తిగా అమలైంది. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వానికి నచ్చని ఏ మాటైనా దేశద్రోహంగా ముద్ర వేయవచ్చు. అదే చట్టాన్ని ఆధారంగా చేసుకుని 2021లో చౌ హాంగ్-టుంగ్, లీ చెక్-యాన్‌లపై దేశద్రోహం కేసులు పెట్టారు.

అప్పటి నుంచి వీళ్లిద్దరూ జైలులోనే ఉన్నారు. నాలుగేళ్లుగా ట్రయల్ లేకుండానే నిర్బంధం. బెయిల్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ కేసు కోర్టులో మొదలైంది. శిక్ష పడితే పదేళ్ల వరకు జైలు. అధికారులు చెబుతున్న వాదన ఒకటే. టియానన్‌మెన్ స్మరణ దేశ భద్రతకు ముప్పు. కానీ మానవ హక్కుల సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది సెక్యూరిటీ కేసు కాదు. ఇది చరిత్రను మర్చిపోవాలని బలవంతం చేసే ప్రయత్నం. ఒక్కమాటలో చెప్పాలంటే జ్ఞాపకాన్ని నేరంగా మార్చే కేసు ఇది. 36 ఏళ్లుగా చైనా ఒక నిజాన్ని దాచేందుకు ప్రయత్నిస్తోంది.

ఇప్పుడు ఆ నిజాన్ని గుర్తు పెట్టుకున్నవాళ్లను శిక్షిస్తోంది. ఈ ట్రయల్ ఒక హెచ్చరిక. ఇక ఇది మానవ హక్కులు వర్సెస్ మరిచిపోవాలన్న అధికార ధోరణి మధ్య జరుగుతున్న పోరాటం. ఇటు నిజాన్ని గుర్తు పెట్టుకోవడం నేరమైతే, మౌనం మాత్రమే భద్రతైతే.. అసలు పాపం ఎవరిదో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉండాలి.

ALSO READ: 40 లక్షల మంది హ*త్య.. సంచలనం రేపుతోన్న నివేదిక.. ఈ పాపం ఎవరిది?

Exit mobile version