NTV Telugu Site icon

China Disruption : చైనా వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి..!?

Three Gorges Dam Effect

Three Gorges Dam Effect

చైనా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం. అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అమెరికా కూడా చైనాతో పోల్చితే కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంది. ఇదే స్పీడ్ తో చైనా అభివృద్ధి సాధిస్తే త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుందని అంచనాలు చెప్తున్నాయి. అయితే ఈ అభివృద్ధి వెనుక చైనా ఎంతో విధ్వంసానికి కారణమవుతోంది. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు.. మేం బాగుంటే చాలు అన్నట్టు చైనా ఆలోచిస్తోంది. ఇది ప్రపంచానికి పెను ముప్పుగా మారనుంది.

చైనాలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ. కానీ అక్కడి పరిణామాలు మాత్రం ప్రపంచంపై తీవ్రంగానే ఉంటాయి. ఇందుకు అతి పెద్ద ఉదాహరణ కరోనా. ప్రపంచంపై కరోనా వైరస్ చూపించిన ప్రభావం ఎంతో మనందరం ప్రత్యక్షంగా చూశాం. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్లింది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. లక్షలాది మంది ఈ వైరస్ దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కరోనా అనంతర వ్యాధులతో సతమతమవుతున్నారు. వీటి నుంచి ఎప్పుడు కోలుకుంటారో తెలియని పరిస్థితి. ఆరంభంలోనే చైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ వైరస్ ను కట్టడి చేసి ఉండొచ్చు. కానీ చైనా ఆ పని చేయలేదు. ప్రపంచంపైకి వదిలేసింది. ఇది ఎంతటి విధ్వంసానికి కారణమైందో అందరం చూశాం. కానీ చైనాను ఏం చేయలేకపోయాం.

ఇప్పుడు చైనా మరో విధ్వంసానికి కారణమవుతోంది. ఏకంగా భూభ్రమణంపైనే అది ప్రభావం చూపిస్తోంది. దీని వల్ల మున్ముందు అనేక సమస్యలను ప్రపంచం ఎదుర్కోబోతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ చైనాలోనే ఉంది. అదే త్రీగోర్జెస్ డ్యామ్. ఇది 22వేల 5వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. యాంగ్జీ నదిపై నిర్మించిన ఈ డ్యామ్ ద్వారా వరదలను నియంత్రించాలనేది చైనా ఆలోచన. అయితే ఈ డ్యామ్ వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. దీని దెబ్బకు భూభ్రమణంలో కూడా మార్పు సంభవిస్తోంది. ఈ డ్యామ్ లో భారీ నీటి నిల్వ కారణంగా భూమి ఒకే చోట బరువెక్కుతోంది. దీని వల్ల భూ భ్రమణం నెమ్మదిస్తోంది. సెకనుకు కొన్ని మైక్రో సెకన్లే అయినా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనేది పర్యవరణ శాస్త్రవేత్తల హెచ్చరిక. భౌగోళిక స్థితిలో మార్పుల వల్ల భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దీని వల్ల కేవలం చైనాకే కాదు.. పలు ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందే.!

చైనా చేష్టలు ప్రపంచంలో పలు దేశాలకు చాలా సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. దక్షిణ చైనా సముద్రంపై చైనా వైఖరి చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలకు ఇబ్బందిగా మారింది. దక్షిణ చైనా సముద్రంలోని అనేక ద్వీపాలు తమవేనని చైనా వాదిస్తోంది. అయితే తమ భూభాగాలకు ఆనుకున్న ఉన్న ద్వీపాలు తమవేనని ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ లాంటి దేశాలు వాదిస్తున్నాయి. వీటిని లెక్క చేయకుండా చైనా తన సైనిక బలగాలను ఆయా ద్వీపాల్లో దింపి నిర్మాణాలు చేపడుతోంది. ఇది నిత్యం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. చైనా చేస్తోంది తప్పు అని పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నా అది మాత్రం అస్సలు తగ్గట్లేదు.

వ్యాపార, వాణిజ్య రంగాల్లో కూడా చైనా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. తప్పుడు విధానాలు అవలంబిస్తూ మిగిలిన దేశాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలో ఏదైనా కంపెనీ ఒక ప్రోడక్ట్ ను తయారు చేసి మార్కెట్లోకి వదిలిందంటే చాలు.. మరుసటి రోజే చైనా దాని డూప్లికేట్ ప్రోడక్ట్ ను తయారు చేసి వదిలేస్తోంది. తక్కువ ధరకే వీటిని తయారు చేస్తుండడంతో ఒరిజినల్ కంపెనీ నష్టపోతోంది. గుండు సూది మొదలు అణ్వాయుధాల వరకూ చైనా ఇదే వైఖరితో ముందుకెళ్తోంది. అతి తక్కువ ధరలకే వీటిని తయారు చేసి మార్కెట్లలోకి డంప్ చేస్తోంది. దీంతో పలు దేశాల్లో పరిశ్రమలు మూత పడుతున్నాయి. చైనా నకిలీ ఉత్పత్తులపై అనేక కాపీరైట్, పేటెంట్ ఉల్లంఘన కేసులున్నాయి. అంతేకాదు.. చైనా కావాలనే తన కరెన్సీ విలువను తక్కువగా ఉంచి వాణిజ్య ప్రయోజనాలు పొందుతోంది. దీని వల్ల చైనాకు దిగుమతులు చౌకగా లభిస్తాయి. ఎగుమతుల వల్ల భారీగా లాభపడుతుంది.

మేక వన్నె పులి సామెత తెలుసు కదా.. చైనా కూడా అంతే.! ఆపదలో ఉన్న వాళ్లకు ఆపన్నహస్తం అందిస్తుంటుంది. చివరకు దాన్నే కబళిస్తుంది. చాలా దేశాలు ఇప్పుడు చైనా కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఏ దేశంపైనైనా చైనా కన్ను పడిందంటే ఆ దేశం నాశనమే. మన పొరుగున ఉన్న శ్రీలంకే ఇందుకు పెద్ద ఉదాహరణ. శ్రీలంకను భారత్ కు దూరం చేయాలనే ఉద్దేశంతో చైనా ఆ దేశానికి అన్ని విధాలా అండగా నిలుస్తూ వచ్చింది. భారీగా అప్పులిచ్చింది. చివరకు శ్రీలంక రుణ ఊబిలో చిక్కుకుపోయింది. చివరకు అప్పులు తీర్చలేక తమ ఆస్తులను చైనాకు రాసివ్వాల్సి వచ్చింది. మాల్దీవుల పరిస్థితి కూడా ఇంతే. మొదట్లో మంచిగా అప్పులిస్తుంది. తర్వాత క్రమంగా దాన్ని ఆక్రమిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ – BRI వల్ల పలు దేశాలు చైనా గుప్పిట్లో చిక్కుకున్నాయి. చైనా నుంచి విముక్తి పొందేందుకు ఇప్పుడు ఇతర దేశాల సాయం కోరుతున్నాయి.

టెక్నాలజీలో చైనా దూసుకుపోతోందనే విషయం మనకు తెలుసు. అయితే పలు చైనా కంపెనీలు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తూ నిషేధానికి గురవుతున్నాయి. టిక్ టాక్ మనకు బాగా తెలుసు. కొంతకాలం కిందటి వరకూ మన దేశంలో ఈ యాప్ ఒక ఊపు ఊపేసింది. అయితే మన దేశ రహస్య సమాచారాన్ని ఈ యాప్ ద్వారా చైనా పొందుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. మన దేశమే కాదు.. పలు ప్రపంచ దేశాలు చైనాకు చెందిన అనేక యాప్ లు, కంపెనీలను ఇవే ఆరోపణలతో మూసేశాయి. కొన్ని దేశాలైతే తమ దేశ టెలీకమ్యూనికేషన్ నెట్ వర్క్స్ నుంచి చైనా కంపెనీలను తొలగించాయి. ఇలా దొంగచాటుగా వివిధ మార్గాల ద్వారా ఇతర దేశాల రహస్య సమాచారాన్ని చైనా సేకరిస్తోందనే ఆరోపణలు కోకొల్లలు.

చైనా నియంతృత్వ పోకడలు కూడా అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. తప్పుడు విధానాలతో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది చైనా. దీని వల్ల చైనాతో పోటీ పడలేని చిన్న దేశాలు కుదేలవుతున్నాయి. ఎలక్ట్రానిక్ చిప్ తయారీలో తమదైన ముద్రవేసిన తైవాన్ తమదేనంటోంది చైనా. తైవాన్ స్వతంత్రతను అంగీకరించకుండా ఆ దేశంపై బల ప్రదర్శన చేస్తోంది. తైవాన్ కు అమెరికా అండగా నిలుస్తోంది. దీంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నిత్యం ఉద్రిక్తతలకు చైనా కారణమవుతోంది. టిబెట్ పరిస్థితి కూడా ఇంతే. టిబెట్ ను అసలు ప్రత్యేక దేశంగాకానీ, ప్రాంతంగా కానీ గుర్తించేందుకు చైనా అస్సలు ఒప్పుకోవట్లేదు. అయితే టిబెటన్లు మాత్రం చైనా పెత్తనాన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు. అయినా చైనా మాత్రం ఆ ప్రాంతంలో సైనక బలగాలను మోహరించి తమ గుప్పిట్లో పెట్టుకుంది. ఇక భారత్ తో సరిహద్దు సమస్యల గురించి చెప్పాల్సిన పనే లేదు. అరుణాచల్ ప్రదేశ్ మొదలు కాశ్మీర్ వరకూ అడుగడుగునా చైనా ఆటంకాలు కలిగిస్తోంది. ఇతర దేశాలపైనే కాదు.. తమ దేశంలోని ఉయిగర్ ముస్లిం మైనారిటీలను చైనా కఠినంగా అణచివేస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది.

ప్రపంచానికంతటికీ చైనా తన ఉత్పత్తులను చీప్ గా ఎగుమతి చేస్తోంది. ఇలాంటి ఉత్పత్తులతో ఆ దేశం భారీగా లాభపడుతోంది. కానీ ఆ కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యం మాత్రం ప్రపంచానికి పెను ముప్పుగా మారుతోంది. చైనా పరిశ్రమలు అధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నాయ. గ్లోబర్ వార్మింగ్ కు కారణమవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కాలుష్య కారక దేశాల్లో చైనా ఒకటి. చైనా విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతోందని.. ఆ దేశంపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు కోరుతున్నా అది పట్టించుకోవట్లేదు. మిగిలిన దేశాలు కూడా చైనాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి.

ఇలా అనేక అంశాల్లో చైనా ప్రపంచంపై పగబట్టింది. ఆ దేశ నియంతృత్వ పోకడలు ప్రపంచానికి పెను సవాల్ గా మారుతున్నాయి. అయితే ఆర్థిక, వ్యాపార, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైనా అగ్రగామిగా ఉంటోంది. పలు దేశాలు ఆ దేశంపై ఆధారపడుతున్నాయి. అందుకే ఆ దేశం జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించట్లేదు. ఒకవేళ వెళ్లినా చైనా వినిపించుకోవట్లేదు. ఎవరు ఏమైపోతే నాకేం అన్నట్టు వ్యవహరిస్తోంది. చైనాకు ముకుతాడు వేయకపోతే మున్ముందు ప్రపంచం మరిన్ని సమస్యల్లో చిక్కుకోవడం ఖాయం.