అంటార్కిటికాలో ఒక హిమనది ఉంది.. అక్కడ మంచు రక్తంలా కారుతుంది. తెల్లటి టేలర్ గ్లేసియర్ మధ్య నుంచి ఎర్రటి నీరు నెమ్మదిగా బయటకు జారుతుంది. ఈ దృశ్యాన్ని బ్లడ్ ఫాల్స్ అంటారు.
1911లో మొదటిసారి ఇది కనిపించినప్పటి నుంచి శాస్త్రవేత్తలకు ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఇంతకి ఎప్పటికీ గడ్డకట్టే ఖండంలో నీరు ఎలా ప్రవహిస్తోంది? అది కూడా ఇంత ఎర్రటి రంగులో ఎందుకు ఉంది? బ్లడ్ ఫాల్స్ ఇప్పటికి ఎందుకు ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రకృతి రహస్యంగా మిగిలింది?
టేలర్ గ్లేసియర్ నుంచి కారుతున్న ఆ ఎర్రటి నీరు చూసినవాళ్లకు రక్తంలా అనిపిస్తుంది. అందుకే దీనికి బ్లడ్ ఫాల్స్ అనే పేరు వచ్చింది. కానీ ఇది రక్తం కాదు. ఇది సాధారణ జలపాతం కూడా కాదు. ఇది వేలాది ఏళ్లుగా మంచు కింద దాగి ఉన్న ఒక ద్రవ ప్రపంచం బయటకు వచ్చేటప్పుడు కనిపించే సంకేతం.
టేలర్ గ్లేసియర్ లోతుల్లో, లక్షల సంవత్సరాల క్రితం ఒక సరస్సు ఏర్పడింది. వాతావరణ మార్పులు, మంచు కదలికల వల్ల ఆ సరస్సు పూర్తిగా మంచుతో మూసుకుపోయింది. సూర్యకాంతి చేరని, గాలితో సంబంధం లేని ఒక చీకటి లోకం అక్కడ ఏర్పడింది. ఆ నీరు బయటకు రావడానికి మార్గం లేకుండా మంచు లోపలే ఉండిపోయింది. ఆ సరస్సులో ఉన్న నీరు సాధారణ నీరు కాదు. అది అత్యంత ఉప్పుగా ఉండే బ్రైన్. సముద్రపు నీటికంటే మూడింతలు ఎక్కువ ఉప్పు కలిగి ఉండటం వల్ల, అంటార్కిటికాలోని తీవ్రమైన మైనస్ ఉష్ణోగ్రతల్లో కూడా అది గడ్డకట్టలేదు. సంవత్సరాలు గడిచేకొద్దీ గ్లేసియర్ లోపల ఒత్తిడి పెరిగింది. చివరకు మంచులో ఏర్పడిన చిన్న చిన్న చీలికల ద్వారా ఆ నీరు నెమ్మదిగా బయటకు జారడం మొదలైంది. అప్పుడే ప్రపంచం చూసింది.. తెల్లటి మంచు మీద ఎర్రటి మరకలు.
అసలు ఆ ఎరుపు రంగుకు కారణం ఇనుము. ఆ నీటిలో అధికంగా ఉన్న ఇనుము, వేల సంవత్సరాల పాటు ఆక్సిజన్‌ను చూడలేదు. మంచు లోపల ఉన్నప్పుడు అది రసాయనికంగా స్థిరంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ నీరు బయటకు వచ్చి గాలిని తాకిందో, ఇనుము ఆక్సిడేషన్‌కు గురైంది. అదే ప్రక్రియ ఇనుము తుప్పు పట్టినప్పుడు జరుగుతుంది.
ఈ ఆక్సిడేషన్ వల్ల నీరు ఒక్కసారిగా ఎర్రగా మారింది. అందుకే అది మంచు మీద కారుతున్న రక్తంలా కనిపిస్తుంది. ఇక ఈ నీటిలో శాస్త్రవేత్తలు సూక్ష్మజీవులను గుర్తించారు. ఆ జీవులు సూర్యకాంతి లేకుండా, ఆక్సిజన్ లేకుండా జీవిస్తున్నాయి. అవి ఇనుము, సల్ఫర్ లాంటి ఖనిజాలను ఉపయోగించుకొని శక్తిని పొందుతున్నాయి. అంటే భూమిపై జీవం ఉండాలంటే తప్పనిసరిగా వెలుగు కావాలన్న మన అంచనాలు ఇక్కడ కూలిపోయాయి. ఈ కనుగొనడం వల్ల మంగళగ్రహం లాంటి గ్రహాల్లో, లేదా జూపిటర్ ఉపగ్రహాల లోతుల్లో కూడా జీవం ఉండే అవకాశంపై శాస్త్రవేత్తలు కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. నిజానికి బ్లడ్ ఫాల్స్ మనకు ముప్పు కాదు. కానీ ఇది భూమి లోపల ఇంకా మనకు తెలియని ఎన్నో ప్రపంచాలు ఉన్నాయని గుర్తుచేస్తుంది. బయటకు ప్రశాంతంగా కనిపించే మంచు కింద, వేల సంవత్సరాలుగా జీవం తనదైన మార్గంలో కొనసాగుతూనే ఉందని చెబుతుంది.
ఒకప్పుడు భయంకరంగా అనిపించిన ఈ ఎర్రటి జలధార, ఇప్పుడు శాస్త్రానికి ఒక పెద్ద తలుపు తెరిచింది. అంటార్కిటికా మంచులో కారుతున్న ఆ ఎర్రటి నీరు, మనకు తెలియని ఈ పుడమి తల్లి కథలను నెమ్మదిగా బయటకు చెబుతోంది.
ALSO READ: మరణానికి 85 సెకన్ల దూరంలో భూమి.. డూమ్స్ డే క్లాక్ చెబుతున్న భయంకర నిజాలు!
