Balochistan: పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ ‘‘బలూచిస్తాన్’’ విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుందని, తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా ఆరోపించే వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసి, క్రూరంగా హత్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి పాక్ ఆర్మీ బలూచిస్తాన్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందనేది స్పష్టం.
తాజాగా, ఈ రోజు బలూచ్ రాజధాని క్వె్ట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని పెషావర్ వెళ్లున్న ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) హైజాక్ చేసింది. వందలాది మందిని బందీలుగా చేసుకుంది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న గ్రూపుల్లో అతిపెద్ద గ్రూప్ బీఎల్ఏ. అయితే, ఇటీవల బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం వందలాది గ్రూపులు కూడా అన్ని ఒకే గొడుగు కిందకు చేరాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.
అసలేంటి ఈ వివాదం:
నిజానికి బలూచిస్తాన్ వివాదం పాకిస్తాన్, ఇండియా విభజన తర్వాత నుంచి ప్రారంభమైంది. స్వయంప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలు రెండు దేశాల్లో ఇష్టముంటే చేరవచ్చు, లేదా స్వాతంత్య్రంగా ఉండొచ్చని బ్రిటీష్ వారు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, 1948లో పాకిస్తాన్ స్వయంప్రతిపత్తి కలిగిన బలూచ్ రాష్ట్రమైన కలాత్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి బలూచ్ ఉద్యమం మొదలైంది. అప్పటి నుంచి అక్కడ జాతీయవాదులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. నిజానికి విభజన సమయంలో బలూచిస్తాన్‌లోని అతిపెద్ద రాచరిక రాష్ట్రమైన ఖాన్ ఆఫ్ కలాత్ భారత్‌లో చేరాలని కోరుకుంది. ఆ తర్వాత, జిన్నా సమక్షంలో బలవంతంగా బలూచిస్తాన్‌లోని కలాత్, మక్రాన్, లస్ బేలా, ఖరన్ చేరాల్సి వచ్చిందనేది, అక్కడి ప్రజల ఆరోపణ.
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో చేరిన వెంటనే తిరుగుబాటు ప్రారంభమైంది. 1948, 158-59, 192-63, 1973-77 మధ్య భారీ తిరుగుబాట్లు జరిగాయి. 1973లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికల్ అలీ భుట్టో బలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి, సైనిక చర్యకు ఆదేశించాడు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం అట్టుడుకుతూనే ఉంది. 2005లో సుయ్ పట్టణానికి చెందిన వైద్యురాలు షాజియా ఖలీద్ అత్యాచారంతో మరోసారి బలూచ్ రగిలిపోయింది. అప్పటి అధ్యక్షుడు ముషారఫ్ మాట్లాడుతూ.. అత్యాచారం చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించాడు.
పాక్ నుంచి చేజారుతోంది..
బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి చేజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పాక్ ఆర్మీపై క్రమంగా దాడులు చేస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం బలూచిస్తాన్‌లోని క్వెట్టా, తర్బుత్ వంటి కొన్ని ప్రాంతాల్లోనే పాక్ ప్రభుత్వ ఆధిపత్యం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తిరుగుబాటుదారులదే పైచేయి. ఇటీవల పాక్ పార్లమెంట్‌లో ఓ ఎంపీ మాట్లాడుతూ.. బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోతుందా..? అని మాట్లాడటం సంచలనంగా మారింది.
బలూచిస్తాన్ ఎందుకంత కీలకం, ప్రజలు ఏం అంటున్నారు..?
పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్సుల, అతి తక్కువ జనాభా కలిగిన బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కుల్ని కాలరాస్తోంది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సుని, గ్వాదర్ పోర్టుని కలుపుతూ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది చైనా. తమ వనరులని చైనా కొల్లగొడుతుందనే భావన బలూచ్ ప్రజల్లో ఉంది. దీంతో వారు చైనాపై దాడులు చేస్తున్నారు. చైనాకు చమురు లేదా ప్రపంచంతో వాణిజ్య సంబంధాల కోసం మలక్కా జల సంధిపై ఆధారపడుతుంది. ఎప్పుడైనా భారత్‌తో ఉద్రిక్తలు పెరిగితే ఈ మార్గంలో చైనా నౌకల్ని భారత్ దిగ్భందించవచ్చు. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్టుని నిర్మిస్తోంది.
తమ వనరులను పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు దోచుకుంటోందని, తమకు న్యాయం జరగడం లేదని అక్కడి ప్రజల వాదన. దీనికి తోడు పాక్ ఆర్మీ అకృత్యాలకు లెక్కే లేదు. ఈ ప్రావిన్స్‌లో 20,000 మందికి పైగా పురుషులు, మహిళలు మరియు పిల్లలను చట్టవిరుద్ధంగా నిర్బంధించారని సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి. మహిళలపై అత్యాచారం చేసి చంపేవారు. ప్రభుత్వానికి ఎదురుతిరిగిన వారిని కిడ్నాప్ చేసి చింపేసేవారు. కొన్ని సందర్భాల్లో గోర్లు పీకేసిన, తలలో రంధ్రాలు ఉన్న మృతదేహాలు దొరికాయంటే, పాక్ ప్రభుత్వ మానవహక్కుల ఉల్లంఘన అర్థం అవుతుంది.
భారత్ ప్రమేయం ఉందని ఆరోపణ:
తమ అకృత్యాలను, నేరాలను, అణచివేతను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ బ్లేమ్ గేమ్ ఆడుతోంది. బలూచిస్తాన్ అశాంతికి భారత్ కారణమంటూ ఆరోపణలు చేస్తోంది. ఇక్కడి వేర్పాటువాదులకు భారత గూఢచార సంస్థలు సాయపడుతున్నాయని ఆరోపిస్తోంది. ఇస్లామాబాద్ ఆధారిత థింక్ ట్యాంక్ AIERD యొక్క CEO అయిన షకీల్ అహ్మద్ రామీ ప్రకారం.. ఈ మిలిటెంట్లు విదేశీ శక్తుల ఎజెండాను నెరవేరుస్తున్నారని పరోక్షంగా భారత్‌ని ఉద్దేశించి అన్నారు. చైనా-పాక్ సంబంధాల్లో చిచ్చు పెట్టేందుకే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, పలు సందర్బాల్లో ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ వాసులు తమ ప్రాంతాన్ని స్వతంత్రం చేసుకోవడానికి భారత్ సాయం కోరారు. ఇదే భారత్‌పై ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్‌కి కారణమవుతోంది.