Nandamuri Balakrishna @ 50 Years Special : నందమూరి బాలకృష్ణ, ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తాతమ్మకల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు నందమూరి బాలకృష్ణ. చేసిన మొదటి సినిమాతోనే తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఆయన త్వరగానే హీరోగా కూడా మారిపోయాడు. ఇక ఆయన నటుడిగా మారి ఈరోజుకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 50 సంవత్సరాలు నటుడిగా ప్రస్థానం సాగించి ఇప్పటికీ దాన్ని కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. మధ్యలో ఎన్నో ఫ్లాపులు మరెన్నో డిజాస్టర్లు వచ్చినా తనదైన శైలిలో వాటన్నింటిని అధిగమించి ఈరోజు ఆయన బ్లాక్ బస్టర్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన రికార్డులు క్రియేట్ చేసుకున్నాడు. భారతదేశంలోనే ఇలా 50 ఏళ్ల పాటు నటుడిగా కొనసాగిన అత్యంత కొద్ది మందిలో నందమూరి బాలకృష్ణ కూడా చోటు సంపాదించారు.
Balakrishna: ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే!!
సాధారణంగా తండ్రి చాటు బిడ్డడుగా ఉన్న బాలకృష్ణ ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభంగా ఏమి జరగలేదు. అందుకు ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. బయట ఆయన మాటలు ఎలా ఉన్నా సినిమాల్లో ఆయన పలికిందే డైలాగ్ చెప్పిందే పంచ్ అన్నట్టుగా సాగిపోతూ ఉంటుంది. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానన్నా, నేను ఏది మొదలు పెట్టను, మొదలుపెడితే వదిలిపెట్టనన్నా ఆయనకే చెల్లింది. ఇదంతా ఆయనలోని మాస్ యాంగిల్ అదే పౌరాణికాల విషయానికి వెళ్తే ఈ రోజుల్లో పౌరాణిక పాత్రలు చేసే ధైర్యం ఏ హీరోకి ఉంది? ఒక బాలకృష్ణకు తప్ప అని అంటే ఎవరూ కాదనలేరు. ఇక హీరోలందరూ కమర్షియల్ మూసలో పడి కొట్టుకుపోతున్న సమయంలోనే నందమూరి బాలకృష్ణ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం చేశాడు.
ఆదిత్య 369తో తెలుగు సినిమాల్లో ఒక సరికొత్త ట్రెండ్ కి ఆద్యం పోశాడు. మొన్న వచ్చిన కల్కి 2898 ADకి కూడా అది ఇన్స్పిరేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి బాలకృష్ణ ఒక ట్రెండ్ సెట్ట!!ర్ ఎందుకంటే ఆయన ట్రెండ్ ఫాలో కాడు, సెట్ చేస్తాడు. మిగతా హీరోలు అందరూ ఒక రకమైన సినిమాలు చేస్తూ వెళుతున్న సమయంలోనే బాలకృష్ణ పంచె కట్టుకొని కర్ర సాము చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు. ఆ తరువాత చాలా కాలం తెలుగులో గ్రామీణ వాతావరణంలో సినిమాలు వచ్చాయనటంలో సందేహం లేదు. ఇక ఆ తరువాత కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన ఫ్యాక్షన్ సినిమాలకు కూడా ఆయన నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల బ్లాక్ బస్టర్ హిట్ పంథా ఒక కారణమని చెప్పొచ్చు.
ఇక ఈ రోజుల్లో కాసేపట్లో మూసేస్తున్న ఏ పబ్లో అయినా వినిపించే పాట బాలయ్య పాట, నినాదం జై బాలయ్య. ఎవరు ఏ హీరోకి అభిమాని అయినా ఏదో ఒక సందర్భంలో జై బాలయ్య అనకుండా ఉండలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వ్యక్తిగతంగా కాస్త కోపధారి మనిషి అని అందరూ భావించే బాలకృష్ణకు అన్ స్టాపబుల్ పేరుతో ఆహా ఒక అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఈ షో తర్వాత నందమూరి బాలకృష్ణ ఆబాలగోపాలానికి అభిమాన హీరోగా మారిపోయారు.
ఇదంతా సినీ రంగానికి చెందిన ఒక ఎత్తైతే రాజకీయంగా కూడా తనకు ఎదురు లేకుండా దూసుకుపోతున్నారాయన. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. ఒకపక్క రాజకీయం, మరోపక్క సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే తన తల్లి జ్ఞాపకార్థం స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి కూడా చైర్మన్గా వ్యవహరిస్తూ అనేకమంది పేదలకు ఆపన్న హస్తం అందిస్తూ వస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్ళ స్వర్ణోత్సవ వేడుకలను తెలుగు సినీ పరిశ్రమ అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ నోవోటెల్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఇదే విధంగా ప్రేక్షక లోకాన్ని ఆనందింపచేస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపన్నులకు అండగా ఉంటూ ముందుకు సాగాలని ఎన్టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
భార్గవ్ చాగంటి