NTV Telugu Site icon

YSRCP: ప్రతినిధుల సభలో పార్టీ ప్రోటోకాల్.. వీవీఐపీ గ్యాలరీల్లో మంత్రులు..

Jagan

Jagan

YSRCP: విజయవాడలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం ప్రారంభమైంది.. నాలుగున్నర ఏళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు సిద్ధం అయ్యారు సీఎం వైఎస్‌ జగన్‌.. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణు­లను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అయితే, ప్రతినిధుల సభలో పార్టీ ప్రోటోకాల్ పాటిస్తున్నారు.. వేదిక పై పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు మాత్రమే చోటు కల్పించారు.. దీంతో.. వీవీఐపీ గ్యాలరీల్లో ప్రేక్షకుల్లా కూర్చిండిపోయారు మంత్రులు బూడి ముత్యాల నాయుడు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కార్మూరి నాగేశ్వరరావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.

ఇక, ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం చేసి 300 కోట్ల రూపాయలు తిన్నాడని ఆరోపించారు.. 14 ఏళ్ళల్లో 6 లక్షల కోట్ల దోపిడీ చేశాడు.. 2014లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి 10 హామీలు కూడా నెరవేర్చ లేదని దుయ్యబట్టారు.. 2024లో జగన్ ముఖ్యమంత్రి అయితే వచ్చే 20 ఏళ్ళు జగనే సీఎం గా కొనసాగుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జగన్ ను గెలిపించుకోవల్సిన బాధ్యత మన అందరి పై ఉంది.. అణగారిన కులాలను కించ పరిచిన చంద్రబాబును ఎవరైనా మళ్ళీ గెలిపించాలి అనుకుంటారా? అని ప్రశ్నించారు ఎంపీ సురేష్‌.

మరోవైపు.. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చరిత్రలో జగన్ లాగా దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు.. పేదవాడి కోసం తపించే నాయకుడు జగన్.. అందుకే ఈ రాష్ట్రానికి జగన్ అవసరం ఉందన్నారు.. వైసీపీ కి సైన్యంలాగా అందరం కలిసి కట్టుగా పని చేయాలని.. జగన్ ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.. ఇక, మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు.. బీసీల కోసం నిబద్దతతో పని చేస్తున్న నాయకుడు జగన్.. త్వరలోనే రాష్ట్రంలో బీసీ జన గణన ప్రారంభం కానుంది.. దీని కోసం ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం.. బీసీ జన గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని గుర్తుచేశారు మంత్రి వేణు.