MP Gurumurthy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది.. బన్నీ చీరకట్టి, కాళికా మాత రూపంలో దర్శనమిచ్చాడు.. మాతంగి గెటప్‌లో ఉన్న అల్లు అర్జున్‌ను చూసి ఫ్యాన్స్ రకరకాల కథలు అల్లేశారు.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గురుమూర్తి మాతంగి వేధారణలో కనిపించారు.. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతుండగా.. వివిధ వేషాల్లో పొంగళ్ళు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.. ఇక, తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పుష్ప-2 వేషధారణలో గంగమ్మ భక్తి చైతన్య యాత్రలో పాల్గొన్నారు.
Read Also: CBI Director: సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు
పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ మాతంగి వేషంలో ఇమిడిపోతే.. ఎంపీ గురుమూర్తి కూడా మాతంగి వేషధారణలో ఒదిగిపోయారు.. ఇక, ఎంపీతో ఫొటోలు దిగడానికి సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు భక్తులు.. కాగా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంతవీధిలోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది. వందలాది మంది భక్తులు విచిత్ర వేషధారణలలో గంగమ్మ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు. తిరుపతి గంగమ్మ జాతర కన్నుల పండవుగా కొనసాగుతోంది. మొత్తం 8 రోజుల పాటు నిర్వహించే జాతరలో ఐదో రోజు మాతంగి రూపంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అయితే, తెలంగాణలో బతుకమ్మ పండుగలు, సమ్మక్కసారక్క జాతర, బోనాల పండగలాగే తిరుపతిలో గంగమ్మ జాతర (తాతగట్టు గంగమ్మ జాతర) ఎంతో సుప్రసిద్ధమైంది. ఈ జాతరకు తిరుపతి నుంచే కాకుండా రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏడాది మే నెలలో గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తారు.. ఇక, గంగమ్మ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించిన విషయం విదితమే.