Kuppam: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 175 సీట్లు గెల్చుకోవడం లక్ష్యమంటోంది వైసీపీ. ఇందులో భాగంగా చంద్రబాబు కోట.. కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసింది అధికారపార్టీ. 35 ఏళ్లుగా కుప్పం నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చంద్రబాబు. 1989 నుంచి వరుసగా ఏడుసార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతిసారి ఈజీగా గెలుపొందిన చంద్రబాబుకు గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది వైసీపీ. మొదటి రెండు రౌండ్లలో షాక్ ఇచ్చింది. తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం కోటలో వైసీపీ జెండా ఎగిగింది. ఆ జోష్‌తో వైసీపీ శ్రేణులు కుప్పంలో మరింతగా యాక్టివ్ అయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఏకంగా ఓడించి తీరతామంటున్నారు అధికారపార్టీ నేతలు.
కుప్పంలో పునర్‌వైభవం కోసం చంద్రబాబు సరికొత్త యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. కుప్పం నియోజకవర్గానికి సమన్వయ కమిటీని ఏర్పాటుచేసి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించి… వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని స్థానిక నేతలకు టార్గెట్ పెట్టారు. దీంతో వైసీపీ మరింత అలర్ట్ అయ్యింది. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో జెండా ఎగరేసిన వైసీపీకి…ఆ విజయాలు గాలి వాటంగా రాలేదని, ప్రభుత్వ పనితీరే కారణమని నిరూపించేందుకు సిద్ధపడుతున్నారు నేతలు. లక్ష ఓట్ల మెజార్టీ అని టీడీపీ శ్రేణులు యాక్టివ్ అయితే.. నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లడానికి పల్లె బాట కార్యక్రమాన్ని కుప్పంలో చేపట్టింది వైసీపీ.
తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో పాటు కుప్పంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాటను ప్రారంభించారు. కుప్పంకు చంద్రబాబు చేసిందేమి, 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు హంద్రీనీవా నీళ్లు తీసుకురాలేదని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి. దొంగ ఓట్లు తీసేస్తే చంద్రబాబు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోతారని ధీమాగా చెప్పారు. ఓటమి భయంతోనే తరచూ కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి విమర్శలతో టీడీపీ కూడా ధీటుగా స్పందించింది. కుప్పం అభివృద్దిపై బహిరంగ చర్చకు రావాలని పెద్దిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సవాల్ విసిరారు. 30 వేల ఓట్లతో చంద్రబాబు ఓడిపోతే స్థానిక టీడీపీ నేతలంతా నియోజకవర్గం వదిలి వెళ్లిపోతారన్నారు. వైసీపీ ఓడిపోతే..కుప్పంలో కాలుపెట్టకుండా ఉంటారా అని సవాల్ విసిరారు.