YS Jagan: రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపు.. హర్షం వ్యక్తం చేసిన జగన్..

Ys Jagan Press Meet

Ys Jagan Press Meet

రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ పోర్టుగా అధికారిక గుర్తింపు లభించడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పోర్టులో దిగుమతులు, ఎగుమతులకు అధికారికంగా అనుమతులు లభించడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి బలమైన బాటలు వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

రాష్ట్రంలో పోర్టుల ఆధారిత పారిశ్రామిక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం గతంలో పక్కా మౌలిక సదుపాయాల ప్రణాళికను రూపొందించిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు నాలుగు ప్రధాన పోర్టుల అభివృద్ధికి తాము శ్రీకారం చుట్టామని తెలిపారు. వాటిలో భాగంగానే రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణ ప్రణాళికలను సిద్ధం చేశామని వివరించారు. కేవలం పోర్టులకే పరిమితం కాకుండా, మత్స్యకారుల సంక్షేమం, తీరప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించేలా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి కూడా రూపకల్పన చేశామని చెప్పారు.

రామాయపట్నం పోర్టును ఒక ప్రధాన పారిశ్రామిక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ విజన్ అని జగన్ స్పష్టం చేశారు. ఆ దూరదృష్టి ఫలితంగానే నేడు రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో బీపీసీఎల్ మెగా రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇండోసోల్ సోలార్ ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రం వంటి అత్యంత భారీ పరిశ్రమలు, పెట్టుబడులు రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల రాకతో రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో పాటు, స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, తద్వారా ఒక సమగ్ర పారిశ్రామిక వ్యవస్థ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ వేదికలైన దావోస్ సదస్సు నుంచి సీఐఐ సదస్సుల వరకు ప్రస్తుత ప్రభుత్వం కూడా తాము ప్రారంభించిన ఈ పోర్టులనే పెట్టుబడుల ఆకర్షణకు ప్రధానంగా ప్రదర్శిస్తోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. గతంలో తమ ప్రభుత్వం రూపొందించిన పోర్టుల ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి విజన్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద పెట్టుబడుల అవకాశంగా మారిందని  తన ట్వీట్‌లో పేర్కొన్నారు.