NTV Telugu Site icon

YS Jagan: ఓ ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే.. కనీసం పోలీస్ భద్రత కూడా సీఎం ఇవ్వలేదు!

Ys Jagan Pressmeet

Ys Jagan Pressmeet

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మరోసారి బయటపడింది. జగన్‌కు జెడ్‌ఫ్లస్‌ కేటగిరీ భద్రత ఉన్నా.. ఆయనకు పోలీసులు కనీస భద్రత కూడా కల్పించలేదు. వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటన నేపథ్యంలో దారిలో ఎక్కడా పోలీసులు పెద్దగా కనబడలేదు. పెద్దగా భద్రత లేకుండానే గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులతో జగన్ సమావేశం అయ్యారు. తన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ మండిపడ్డారు.

మిర్చి యార్డ్‌ బయట మీడియాతో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో పరిస్థితి దిగజారిపోయింది. ఓ ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే.. కనీసం పోలీస్ భద్రత కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నెలకొంది. నేను చంద్రబాబు గారికి ఓ మాట చెబుతున్నా… ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. రేపు ప్రతిపక్షంలో మీరు కూర్చున్నపుడు ఇదే మాదిరిగా మేం పోలీసు భద్రత తీసేస్తే.. ఎలా ఉంటుందో ఓసారి ఆలోచన చేయండి. సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తారు. నేను చేసింది సరైందేనా కదా అన్నది సీఎం ఆలోచన చేయమని నేను చెబుతున్నా’ అని ఫైర్ అయ్యారు. జగన్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుధవారం ఉదయం గుంటూరు మిర్చి యార్డ్‌కు వైఎస్ జగన్‌ వచ్చారు. మిర్చి రైతుల కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. రైతుల దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. తమ హయాంలో వ్యవసాయం ఓ పండగలా మారిందని, రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.