YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..

Jagan

Jagan

ప్రభుత్వ వైద్య రంగంపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. పేదలకు ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ (PPP) విధానం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా భారీ కుంభకోణానికి తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, అందులో ఐదు ప్రారంభించామని, మరో మూడు సిద్ధం చేశామని తెలిపారు. మిగిలిన కాలేజీల పూర్తికి ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కావాలనే వాటిని తెగనమ్ముతోందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు

ఈ ప్రైవేటీకరణ ఒప్పందంలో భాగంగా వందల కోట్ల విలువైన భూములను ఎకరా కేవలం రూ.100 లీజుకు ఇస్తున్నారని, సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా వీజీఎఫ్ (VGF) పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు చెల్లించడం దారుణమని పేర్కొన్నారు. భూములు, భవనాలు, నిధులు, సిబ్బంది ప్రభుత్వానివే అయినప్పుడు ప్రైవేటు సంస్థలకు వీటిని అప్పగించడం దోపిడీ కాక ఏంటని ప్రశ్నించారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే కన్వీనర్ కోటాతో పాటు తక్కువ ఫీజులకే వైద్య విద్య, నాణ్యమైన వైద్యం అందడంతో పాటు విలేజ్ క్లినిక్స్ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు నెట్‌వర్క్ ఏర్పడుతుందని వివరించారు.

చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పథకం నీరుగారిపోయిందని, నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కరువయ్యాయని, తాము తెచ్చిన జీరో వేకెన్సీ పాలసీని పక్కనబెట్టి వైద్యుల ఖాళీలను మళ్లీ పెంచుతున్నారని విమర్శించారు. నాడు-నేడు పనులు, విలేజ్ క్లినిక్స్, 108, 104 సేవలు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల వ్యతిరేకతను, కోటి సంతకాల నిరసనలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే తగిన గుణపాఠం తప్పదని, భవిష్యత్తులో ఈ దోపిడీపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.