వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. బుధవారం (మే 28) పొదిలిలో జగన్ పర్యటించాల్సి ఉండగా.. వాయిదా పడిందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడినట్లు పేర్కొంది. వాతావరణం అనుకూలించిన తర్వాత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన తేదీలను వైసీపీ ఖరారు చేయనుంది.
Also Read: CM Chandrababu: అదే నా ఆశ.. ఆకాంక్ష!
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం పొదిలి పోరుబాట కార్యక్రమాన్ని వైసీపీ తలపెట్టింది. కూటమి పాలనలో మద్ధతు ధర లేక రైతాంగం కష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై జగన్ ఒత్తిడి తేనున్నారు. జగన్ పర్యటనకు భారీగా రైతులు, వైసీపీ శ్రేణులు తరలి వచ్చే అవకాశం ఉంది. పొదిలి పర్యటన కోసమే ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే భారీ వర్షాల నేపథ్యంతో పర్యటన వాయిదా పడింది.
