ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. 2011 మార్చి 12న స్థాపించబడిన వైసీపీ.. ఇప్పుడు 16వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పార్టీ స్థాపన సమయంలో తాను ఒక్కడినే ఉన్నానని, కానీ ఇప్పుడు కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదంతో వైసీపీ ఒక పెద్ద శక్తిగా ఎదిగిందని చెప్పారు. ‘నల్లకాల్వలో ఇచ్చిన మాటే పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల దశ, దిశను మార్చింది’ అని పేర్కొన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన ఆశయాలను కొనసాగిస్తానని, ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ నల్లకాల్వలో ఇచ్చిన మాట (ఓదార్పు యాత్ర) ఆ పార్టీ స్థాపనకు పునాది వేసింది. ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ పార్టీ అడ్డు చెప్పడంతో.. ఇచ్చిన మాట కోసం ఆ పార్టీని వదిలి, వైయస్సార్సీపీని జగన్ స్థాపించారు.
Also Read: Gambhir vs Agarkar: గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలు.. కారణం ఆ స్టార్ ఆటగాడే!
‘అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా ప్రజల కోసం పోరాటం చేశా. మొదటి నుంచీ ప్రజలు, దేవుడ్నే నమ్ముకుని ముందుకు సాగా. వైసీపీ ఆవిర్భావం తర్వాత దేశ రాజకీయాల్లో కూడా మార్పులు కనిపించాయి. వైసీపీ కార్యకర్తలు ఎప్పుడూ గర్వంగా కాలర్ ఎగరేసేలా పార్టీ నిలుస్తుంది. ఈ పార్టీ కొన్ని కోట్ల మంది ప్రజలది. అందరి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా పార్టీ నిలిచింది. పార్టీ లోపల ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తాం. నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైసీపీని అభిమానించే ప్రతి ఒక్కరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ తెలిపారు.
