YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!

  • డీఎస్సీలో అవకతవకలు షాకింగ్‌గా ఉన్నాయి
  • మెగా డీఎస్సీ అనడానికి అర్హత లేదు
  • వీళ్లు చేసిన స్కాములతో ఎంతోమంది కన్నీళ్లు పెడుతున్నారు
Ysjagan

Ysjagan

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో అనేక అవకతవకలు జరిగాయని, మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ మాట్లాడుతూ.. 16 వేల పోస్టుల భర్తీలోనే ఇన్ని స్కాములు, లీకులు, అనుమానాలు బయటపడుతున్నాయని అన్నారు. దీనిని మెగా డీఎస్సీగా చెప్పుకునే అర్హత ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో దేశ చరిత్రలోనే అరుదైన రీతిలో లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని ఆయన గుర్తుచేశారు.

50 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చాం:

‘2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం 50 రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశాం. నాలుగు నెలల్లో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసి చరిత్ర సృష్టించాము. ప్రస్తుతం ఆ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నాపత్రాల తయారీ, డిజిటల్ అప్‌లోడ్, పరీక్షల నిర్వహణ వంటి అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రక్రియలను సరైన విధంగా నిర్వహించలేదు. సాధారణంగా పరీక్షల నిర్వహణ బాధ్యతలు వేర్వేరు విభాగాల పర్యవేక్షణలో ఉండాలి, కానీ ఈసారి కీలక బాధ్యతలను ఒకే వ్యవస్థకు అప్పగించడం ద్వారా స్కామ్‌కు బీజం పడింది’ అని వ్యాఖ్యానించారు.

×
×
Ad

టాప్ ర్యాంక్ సాధించిన ఉద్యోగిపై అనుమానాలు:
డీఎస్సీ ప్రశ్నాపత్రాల అప్‌లోడ్ వంటి కీలక బాధ్యతలను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో చేయించడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. తప్పు బయటపడితే బాధ్యతను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై నెట్టివేయాలనే ఉద్దేశంతో ఇలా చేశారని ఆరోపించారు. డీఎస్సీ ప్రక్రియలో పనిచేసిన ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సోషల్ స్టడీస్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించడాన్ని జగన్ ప్రశ్నించారు. అదే వ్యక్తి మరో విభాగంలో కూడా టాప్ ర్యాంకుల్లో నిలవడం అనుమానాస్పదమని అన్నారు. ‘పరీక్షల నిర్వహణకు సంబంధించిన వ్యవస్థలో పనిచేసిన వ్యక్తే పరీక్ష రాసి టాప్ ర్యాంక్ సాధించడం సాధారణ విషయమా?.. ఇది పెద్ద స్కామ్ కాదా?’ అని జగన్ ప్రశ్నించారు.

డేటా మాయం చేశారన్న ఆరోపణ:
ఆ ఉద్యోగి నిజంగా ప్రతిభతో ర్యాంక్ సాధించి ఉంటే అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని జగన్ ప్రశ్నించారు. అతని పేరు మెరిట్ జాబితాలో లేకపోవడం, కాల్ లెటర్ అందకపోవడం, చివరకు కోర్టును ఆశ్రయించాల్సి రావడం అనుమానాలను మరింత పెంచుతోందని అన్నారు. ప్రభుత్వం చెబుతున్న వివరాలు నిజమైతే సంబంధిత వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడని ప్రశ్నించిన జగన్.. మెరిట్ లిస్ట్‌లో మార్పులు జరిగాయా?, డేటా తొలగించబడిందా? అనే అంశాలపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొన్నారు.

సీబీఐ విచారణే నిజాలు బయటపెడుతుంది:
ప్రశ్నాపత్రాల తయారీలో ఎవరు పాల్గొన్నారు?, డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి వద్ద ఉంది?, నియామకాల ప్రక్రియలో ఎవరికైనా ముడుపులు అందాయా? వంటి అంశాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ అధికార పక్షం ప్రభావంలో ఉన్నాయని ఆరోపించిన ఆయన.. నిష్పాక్షిక విచారణ కోసం సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాల్సిందేనని స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై నిజాలు వెలుగులోకి రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు.